రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి స్థాపన కోసం నానా జాతి సమితి లాంటి ప్రపంచ శాంతి సంస్థను స్థాపించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోని ముందుకు సాగారు. ఈ విధంగా అట్లాంటిక్ మహసముద్రంలోని సూర్య పౌండ్ ల్యాండ్ ఓడరేవులో బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షులు రూజ్‌వెల్త్ ల మధ్య జరిగిన చర్చలు ఐక్యరాజ్యసమితి స్థాపనకు పూనాది రాయిగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి స్థాపన గొప్ప అంశం అయినప్పటికీ, దానిని సవరించని కారణంగా నానాజాతిసమితి మాదిరిగానే వైఫల్యాలను మూటగట్టుకుంటుంది. ఐక్యరాజ్యసమితి ఏర్పాటులో మాస్కో, టెహరాన్, డంబర్టన్ ఓక్స్ , యాల్టా , శాన్ ప్రాన్సిస్కో వంటి అనేక సమావేశాలు జరిగి చివరికి అక్టోంబర్ 24 1945 వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యల నేపథ్యంలో , దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఐక్యరాజ్యసమితి పూర్తిగా విఫలమైందని చాలా దేశాల ప్రజలు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి లో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నా కూడా వీటో అధికారం ఉన్న అమెరికా, రష్యా,చైనా, బ్రిటన్,ఫ్రాన్స్ దేశాలకు ఉన్న వీటో అధికారం కారణంగా ఏకఛత్రాధిపత్యం నడుస్తుందని చాలా కాలం నుండి ఐక్యరాజ్యసమితి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సవరించినప్పుడే ఐక్యరాజ్యసమితి పట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. ప్రస్తుతం ఐదు దేశాలకే వీటో అధికారం ఉన్న కారణంగా ప్రపంచ శ్రేయస్సు కోసం తీసుకునే కీలకమైన బిల్లులు ఏ మాత్రం అమలు కావడం లేదు. అదేవిధంగా ప్రస్తుతం భద్రతా మండలిలో ఉన్న ఐదు శాశ్వత సభ్య రాజ్యాలతో పాటు భద్రతామండలిలో శాశ్వత సభ్య రాజ్యాలుగా అవతరించడమే లక్ష్యంగా ఏర్పడిన జి -4 ( భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ ) దేశాలకు భద్రతామండలిలో శాశ్వత సభ్య రాజ్యాలుగా అవతరించే విధంగా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిన సందర్భం వచ్చింది.
కేవలం ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం ఉన్నప్పుడు గానీ లేదా ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే కాకుండా ఇతర సమయాలలో కూడా ఐక్యరాజ్యసమితి గురించి ప్రస్తావిస్తూ సమితిలో కీలకమైన మార్పులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రరాజ్యం చేతిలోనో లేదా బలమైన దేశాల ఆధీనంలోనే పనిచేస్తూ ఆర్థికంగా వెనకబడిన దేశాల సమస్యలను పట్టించుకోకుండా సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాల పట్ల ఐక్యరాజ్యసమితి చిన్నచూపు చూస్తుందనే విమర్శలు చాలానే ఉన్నాయి. ఇటువంటి విమర్శల నుండి సమితి బయటపడాలంటే అన్ని దేశాలకు సమానమైన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకుసాగాల్సి ఉంటుంది.
చాలా నెలల నుండి రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్దం జరుగుతున్నా ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి సరియైన చర్యను తీసుకోవడం లేదు, ఈ సందర్భంలో ఐక్యరాజ్యసమితి మౌనం దేనికి సంకేతం అనే ప్రశ్న యావత్ ప్రజలలో కలుగుతుంది ! అంతర్జాతీయ సమాజం గురించి ఏ మాత్రం అలోచించకుండా ఉత్తరకొరియా దేశం తరుచుగా అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రక్కనున్న దక్షిణకొరియా,జపాన్, దేశాలకు భయాన్ని పుట్టిస్తూ అగ్రరాజ్యం అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన సందర్భంలో ఇకనుండైనా ఐక్యరాజ్యసమితి ఇతర దేశాల నిర్ణయాల మేరకు కాకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రపంచ శాంతి పట్ల ఒక ధైర్యాన్ని, భరోసాను ఇవ్వాలని ప్రపంచ సమాజం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంది.
ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం దిశగా కొనసాగుతుంది అని అనేక రకాల సర్వేలు, నివేదికలు స్పష్టం చేస్తున్నా కూడా, దేశాల మధ్య ఆధిపత్యాలు తారాస్థాయికి చేరుతున్నా కూడా, దేశాల మధ్య ఆధిపత్యాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్యసమితి తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అనేది ఏమి లేదని అభిప్రాయపడ్డుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితిలో ఇకనైనా విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావాల్సిందే.ఒక్క మాటలో చెప్పాలంటే ఐక్యరాజ్యసమితిని సంస్కరించకపోతే ఐక్యరాజ్యసమితికి భవిష్యత్తు లేదని స్పష్టంగా చెప్పవచ్చు. పరిస్థితులు ఇదే విధంగా ఉంటే నానాజాతిసమితి మాదిరిగానే ఐక్యరాజ్యసమితి వైఫల్యం చెందెందుకు దారులు దగ్గరలోనే ఉన్నాయని అర్థం అవుతుంది. భారతదేశం నిరంతరం శాంతిని కోరుకునే దేశం, భారత్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి ప్రముఖమైన ప్రాధాన్యతను ఇస్తూ ప్రపంచశాంతి స్థాపనకు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది.
కేతూరి శ్రీరామ్, ఏం. ఎ
పొలిటికల్ సైన్స్.