Take a fresh look at your lifestyle.

‘అప్‌డేట్‌’ ‌కానపుడు ‘అవుట్‌డేట్‌’ ‌కావలసిందే…!

“సాధారణ ఉద్యోగాలను తోసుకుంటూ ‘సాఫ్ట్‌వేర్‌ ‌బూమ్‌‘ ‌వెల్లివిరుస్తున్నది. సరిహద్దులు చెరిగిపోయి వసుదైక కుటుంబం వెలసింది. ప్రపంచమే కుగ్రామం అయ్యింది. నేటి శాస్త్రసాంకేతిక విప్లవంతో ఉద్భవించిన కృత్రిమ మేధ (ఆర్టిఫీషిల్‌ ఇం‌టెలిజెన్స్, ఏఐ), ‌రోబోటిక్స్ ‌రంగాలు 2030 నాటికి 800 మిలియన్ల ఉద్యోగాలను మింగేయవచ్చని, ఈ మార్పుకు అనుగుణంగా నేటి రేపటి యువత మానసికంగా సిద్ధంగా ఉంటూ, భవిష్యత్తు కోరుకునే నైపుణ్యాలను అంచనా వేస్తూ ముందుచూపును ప్రదర్శించాలని నిపుణులు సూచిస్తున్నారు. రేపటి ప్రగతిరథానికి ఇంధనంగా మారనున్న కృత్రిమ మేధ, రోబోటిక్స్ ‌విభాగాల్లో యువతీయువకులు నిష్నాతులు కావలసిన అత్యవసర పరిస్థితులు రానున్నాయని హెచ్చరిస్తున్నారు.”

నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ ‌కృత్రిమ మేధ ఈ-యుగం వరకు గత 2.6 మిలియన్‌ ఏం‌డ్లుగా మానవాళి జీవన పరిణామక్రమంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. లాండ్‌లైన్‌ ‌ఫోన్‌ ‌కూడా లేని గ్రామాల్లో నేడు స్మార్ట్ ‌ఫోన్‌ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతోంది. అంతర్జాల విజ్ఞాన గని తవ్వకాల్లో అనంత జ్ఞాన సంపదలు బయట పడుతున్నాయి. పాత చదువులకు తిలోదకాలు పలుకుతూ నూతన శాస్త్రసాంకేతిక విద్య రాజ్యమేలుతోంది. సాధారణ ఉద్యోగాలను తోసుకుంటూ ‘సాఫ్ట్‌వేర్‌ ‌బూమ్‌‘ ‌వెల్లివిరుస్తున్నది. సరిహద్దులు చెరిగిపోయి వసుదైక కుటుంబం వెలసింది. ప్రపంచమే కుగ్రామం అయ్యింది. నేటి శాస్త్రసాంకేతిక విప్లవంతో ఉద్భవించిన కృత్రిమ మేధ (ఆర్టిఫీషిల్‌ ఇం‌టెలిజెన్స్, ఏఐ), ‌రోబోటిక్స్ ‌రంగాలు 2030 నాటికి 800 మిలియన్ల ఉద్యోగాలను మింగేయవచ్చని, ఈ మార్పుకు అనుగుణంగా నేటి రేపటి యువత మానసికంగా సిద్ధంగా ఉంటూ, భవిష్యత్తు కోరుకునే నైపుణ్యాలను అంచనా వేస్తూ ముందుచూపును ప్రదర్శించాలని నిపుణులు సూచిస్తున్నారు. రేపటి ప్రగతిరథానికి ఇంధనంగా మారనున్న కృత్రిమ మేధ, రోబోటిక్స్ ‌విభాగాల్లో యువతీయువకులు నిష్నాతులు కావలసిన అత్యవసర పరిస్థితులు రానున్నాయని హెచ్చరిస్తున్నారు.

వేగవంతంగా మారుతున్న సాంకేతికతతో నేటి నైపుణ్యాలు రేపటికి అవుట్‌డేట్‌ అవుతున్నాయని, ప్రతి ఒక్కరు తమ తమ రంగాల్లో అనునిత్యం అప్‌డేట్‌ ‌కావలసిన అగత్యం ఏర్పడిందని తెలుసుకోవాలి. నిత్యం ‘అప్‌డేట్‌‘ ‌కానపుడు రేపటికి ‘అవుట్‌డేట్‌’ అవుతామని మరువరాదు. నేటి యువత సాంప్రదాయ ఆలోచనల పరిధిని దాటి, సృజనశీలతలను ప్రదర్శిస్తూ తమ బంగారు భవితకు పునాదులు వేసుకోవాలి. నేటి బాలబాలికలు, యువతీయువకులలో రావలసిన సాంకేతిక నైపుణ్య మార్పుల కలలను సాకారం చేయడానికి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు తమ తమ బాధ్యతలను నిర్వహించాలి. గణిత వైజ్ఞానిక శాస్త్రాల పరిధిని దాటుతూ శాస్త్ర విజ్ఞానానికి సాంకేతిక నైపుణ్యాలను అద్దుతూ కావలసిన సాఫ్ట్, ‌హార్డ్ ‌స్కిల్స్‌ను యువతకు బోధించాల్సిన అత్యవసర పరిస్థితులు వచ్చాయి. భవిష్యత్‌ ‌తరాలకు కావలసిన అన్వేషనాత్మక విద్య, సమస్యా పరిష్కార నిపుణత, అనుసంధాన నేర్పు, భవిష్యత్‌ ‌మార్పులకు సంసిద్ధత, సంక్లిష్టమైన ఆలోచనాతత్వం (క్రిటికల్‌ ‌థింకింగ్‌), ‌నిర్ణయాలు తీసుకునే చొరవ, టీమ్‌ ‌వర్క్, ‌మానవీయ విలువలు, విశ్లేషణాత్మక ఆలోచనలు, ఒత్తిడి నిర్వహణ, ఎమోషనల్‌ ఇం‌టెలిజన్స్, ‌ప్రోఆక్టివ్‌ ‌లెర్నింగ్‌, ‌సామాజిక అవగాహన, గరిష్టంగా టెక్నాలజీ వాడకం లాంటి 21వ శతాబ్ద నవ్య నైపుణ్యాల అవసరం కనీస అర్హత కావాలని ‘వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌’ ‌సూచిస్తున్నది.

నేటి విద్యా ప్రణాళికలో 1833 నాటి ‘లార్డ్ ‌మెక్కాలే విద్యావిధానం’ ప్రాధాన్యతను కోల్పోయింది. నాటి భారత పారిశ్రామిక విప్లవంలో ఆదేశాలను ఆచరణలో పెట్టడానికి ‘బాబూస్‌ (‌క్లర్కులు)’ను తయారు చేయడానికి మాత్రమే ఆ విద్యావిధానం వినియోగిం చబడింది. భారతీయుల ఆలోచనలకు తావివ్వకుండా, చెప్పింది చేయగలిగే మానవ యంత్రాలను తయారు చేయడమే లక్ష్యంగా వలసపాలకుల విద్యాప్రణాళికలు అమలు చేయబడ్డాయి. పనిని ఎలా, ఎందుకు, ఎప్పుడు చేయాలనే ఆలోచనలుగల నాయకులను తయారు చేయడానికి బదులు, పనిని ఎలా ‘మేనేజ్‌’ ‌చేయాలో మాత్రమే తెలిసిన ‘మేనేజర్ల’ను తయారు చేయడానికి నాటి విద్యావిధానం ఉపయోగపడింది. బట్టీ పట్టే చదువులు, ర్యాంకులు, మార్కులు పొందే విద్యకు బదులుగా బాధ్యతగల నైపుణ్య సంపదగల దేశ పౌరులను తయారు చేసే అనువర్తిత విద్యా విధానం తక్షణ అవసరం అవుతున్నది. పుస్తకంలోని పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్న, జవాబు పరీక్షా విధానానికి బదులు సృజనశీల, వినూత్న ఆలోచనలు చిగురించే ప్రశ్నలతో కూడిన పరీక్షావిధానం రావాలి. విద్యార్థుల జ్ఞాపకశక్తితో పాటు సృజనశీలత, వినూత్న ఆలోచనలను పరీక్షించే విద్యా విధానం రావాలి. పిల్లల్లో జిజ్ఞాసను పెంపొందిస్తూ, ఒరిజినల్‌ ‌థింకింగ్‌ను ప్రోత్సహించే నైపుణ్య చదువులు కావాలి.

నేటి చదువులతో పాటు పదేళ్ళ ముందుకు ఆలోచిస్తూ, రాబోయే తరపు స్లిల్స్‌ను బోధించగల విద్యావిధానాన్ని ఆహ్వానించాలి. స్వీయ కేంద్రీకృత (సెల్ఫ్ ‌సెంటర్డ్) ‌సాంఘీక వ్యవస్థ నుంచి జట్టులో అమూల్య సభ్యుడిగా సమన్వయ సహకారాలతో (టీమ్‌ ‌స్పిరిట్‌) ‌విధులను నిర్వహించగలగాలి. పిల్లల పెంపకంలో తల్లితండ్రులు నూతన ఒరవడిని చూపాలి. నవ్య మార్గాన నడిచే తత్వాన్ని నూరి పోయాలి. పది మందిలో ఉంటూనే తన విలక్షణ ప్రత్యేకతలను నిలుపుకోనుటకు చేయూత ఇవ్వాలి. న్యూ-ఏజ్‌ ‌స్కిల్స్ ‌పరిచయం చేయడం, ఓటమిని తట్టుకునే యుక్తులను నేర్పడం, విజయం అంతమే లేని ప్రయాణమని అవగాహన పరచడం, వ్యక్తిత్వ వికాస ప్రాధాన్యతను తెలపడం లాంటి నూతన బాధ్యతలను అధ్యాపకులు బోధించడం తప్పనిసరి అయ్యింది. ఓటమిని చవిచూసిన వారే గెలుపును ఆస్వాదించగలరు.

నూతన విద్యావిధానంలో ‘ఎడ్యుటేయిన్‌మెంట్‌ (ఎడ్యుకేషన్‌ ‌ప్లస్‌ ఎం‌టర్‌టేయిన్‌మెంట్‌, ‌వినోద పద్దతిలో విద్యా బోధన)‘ ప్రక్రియలతో విద్యా బోధన పద్దతులను ప్రవేశపెట్టాలి. విద్యార్థుల బహుముఖీన ప్రతిభ చిగురించేలా ఆధునిక చదువులు సాగాలి. చదువులు జీతం ప్యాకేజీ కోసమే కాదని, జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించటానికని, ‘ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌’‌ను తప్పనిసరిగా నేర్పాలి. నేటి విద్యా విధానంలో లైఫ్‌ ‌స్కిల్స్, ‌సాఫ్ట్ ‌స్కిల్స్‌తో పాటు క్రిటికల్‌ ‌థింకింగ్‌ ‌పెంపొందేలా ప్రయోగాలతో కూడిన పాఠ్యాంశాలను బోధించాలి. మన పిల్లలు జీతాన్ని సంపాదించే మర మనుషులు (రోబోలు) కాదని, జీవించే కళను సంపూర్ణంగా నేర్చుకున్న బాధ్యతగల సున్నిత, ఆకర్షణీయ మనసులు కలిగిన సత్‌పౌరులని రుజువు చేద్దాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply