Take a fresh look at your lifestyle.

కల నిజమవుతున్న వేళ….!

  • గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు
  • ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో 88 కిలో మీటర్ల పొడవునా నడవనున్న రైలు
  • తొలుత 33 కిలో మీటర్లు(కొడకండ్ల) నడపనున్న అధికారులు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు

సిద్ధిపేట, ఫిబ్రవరి 11 (ప్రజాతంత్ర బ్యూరో) : కల నిజమవుతుంది. చిరకాల స్వప్నం సాకారమవుతుంది. ఎన్నో దశబ్దాలుగా ఎదురు చూస్తున్న మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి గజ్వేల్‌ ‌రైల్వేస్టేషన్‌ను ప్రారంభించడానికి సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ఐదేండ్ల(2018)లో మార్చి 14న  ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా ప్రజల కల అయిన మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌ ‌పనులకు గానూ మెదక్‌ ‌లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వేల అధికారులతో కలిసి  రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు  గజ్వేల్‌ ‌మండలంలోని గిరిపల్లి వద్ద మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వే పనులకు భూమి పూజ చేసిన విషయం విధితమే. గత కొన్నేళ్లుగా మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌ ‌కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. తొలుత 2004లో అప్పటి కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపిఏ సర్కార్‌  ఈ ‌రైల్వేలైన్‌ ‌కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.

తర్వాత వొచ్చిన బిజెపి సర్కార్‌ ‌సైతం ఈ రైల్వేలైన్‌ ‌కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైలన్‌ ‌పనులకు గత ఏడాది ఆగస్టులో మిషన్‌ ‌భగీరథ పనులను ప్రారంభించేందుకు గజ్వేల్‌ ‌మండలంలోని కోమటింబండకు వొచ్చిన సందర్భంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. తాజాగా  కేసీఆర్‌ ‌చొరువ వల్ల ఈ రైల్వేలైన్‌ ‌కోసం కేంద్రం నిధులను కేటాయించింది.  దీంతో పనుల్లో కదలిక వొచ్చింది. మనోహరాబాద్‌ ‌నుంచి కొత్తపల్లి వరకు 150కిలో మీటర్లు ఉంది. ఇప్పటికే  ఈ రైల్వే లైన్‌కు సంబంధించి దాదాపుగా భూసేకరణ పూర్తయింది. దీంతో తొలి విడుతగా 33కిలో మీటర్ల రైల్వే లైన్‌ ‌పనులకు గానూ దక్షిణ మధ్య రైల్వే టెండర్లను ఆహ్వానించింది. మనోహరాబాద్‌ ‌నుంచి గజ్వేల్‌ ‌మండలం కొడకండ్ల వరకు 33కిలో మీటర్ల వరకు రైల్వే లైన్‌ ‌పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే పలు దఫాలుగా రైల్వే అధికారులు ట్రయల్‌ ‌రన్‌ ‌నిర్వహించారు.

గత ఏడాది కిందటనే ఈ రైల్వే పనులు పూర్తయినప్పటికీ కొరోనా మూలంగా గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వొస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత త్వరగా గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు.  రెండు మూడ్రోజుల్లో ఈ గజ్వేల్‌ ‌స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ప్రారంభోత్సవానికి సంబంధించి పనులను శరవేగంగా చేస్తున్నారు.

ప్రయాణికులకు శుభవార్త, రైలు కూతకు గజ్వేల్‌ ‌సిద్ధం
గజ్వేల్‌ ‌పరిసర ప్రాంతాలకు ఇదీ శుభవార్త అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో దశబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు రైలు కూత కోసం ఎదురు చూస్తున్నారు. గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌కు సంబంధించి పనులన్నీ పూర్తై ప్రారంభానికి ముస్తాబైంది. ఇదిలా ఉంటే,  సికింద్రాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌ప్రధాన రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌ ఎదగబోతోంది. నగరంలోని స్టేషన్లలో రద్దీ పెరిగి విస్తరణకు అవకాశం లేకపోవడంతో సిటీకి దగ్గరగా ఉన్న (60కి.మీ.) గజ్వేల్‌ ‌స్టేషన్‌పై రైల్వే అధికారులు దృష్టి పడింది. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గజ్వేల్‌ ‌స్టేషన్‌ను మరింతగా విస్తరించారు. దీంతో  రాష్ట్రంలో కీలక రైల్వేస్టేషన్‌గా గజ్వేల్‌ ‌మారే అవకాశముంది.

గజ్వేల్‌నే ఎందుకు ఎంచుకున్నారంటే….
సికింద్రాబాద్‌, ‌నాంపల్లి రైల్వే స్టేషన్ల విస్తరణకు స్థలం లేక ఇబ్బందిగా మారింది. ప్రస్తుత రైళ్ల తాకిడిని అవి తట్టుకోలేకపోతున్నాయి. కొత్త రైళ్లను ప్రారంభించడం అసాధ్యంగా మారింది. ఒక స్టేషన్‌ ‌నుంచి రైలు మొదలవ్వాలంటే ముందు దానికి మెయింటెనెన్స్ ‌పనులు జరపాలి. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఈ పనులు మరింత కఠినంగా ఉంటాయి. రైళ్ల అవసరాల ప్రకారం 3 రకాల మెయింటెనెన్స్ ‌పనులుంటాయి. ఇంజిన్‌, ‌బ్రేకులు, లింకులు, ఏసీ.. ఇలా అన్నింటిని పరిశీలించే ప్క్రెమరీ మెయింటెనెన్స్‌కు 6 గంటలు పడుతుంది. బ్రేకులు, గేర్లు.. తదితరాలను పరిశీలించి సెకండరీ మెయింటెనెన్స్‌కు 4 గంటలవుతుంది. ఈ రెండు రకాల పనులకు పిట్‌ ‌లైన్లు అవసరమవుతాయి. ఈ లైన్లలో పట్టాల మధ్య మనిషి నిలబడేంత గుంత ఉంటుంది. అందులో నిలబడి మరమ్మతులు చేస్తారు.

ఇలాంటి పిట్‌లైన్లు సికింద్రాబాద్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌పైనే ఉన్నాయి. నాంపల్లి స్టేషన్‌లో మూడే ఉన్నాయి. రైళ్ల మెయింటెనెన్స్ ఎక్కువ సమయం పడుతుండటం, కొత్త లైన్లు నిర్మించే స్థలం లేకపోవడంతో వేరే రైళ్లను ప్రారంభించే వీలు లేకుండా పోతోంది. కాచిగూడను విస్తరించే పరిస్థితి లేక  లింగంపల్లి స్టేషన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నారు. అక్కడ పిట్‌ ‌లైన్స్ ‌లేక సాధారణమెయింటెనెన్స్ ‌మాత్రమే చేస్తున్నారు. 24 బోగీలుండే పెద్ద రైళ్లకు సరిపడా ప్లాట్‌ఫామ్స్ ‌సికింద్రాబాద్‌లో 7, నాంపల్లిలో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి దగ్గరగా ఉన్న గజ్వేల్‌పై రైల్వే దృష్టి పడింది. హైదరాబాద్‌కు గజ్వేల్‌ ‌స్టేషన్‌ ‌చేరువగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లను ప్రారంభిస్తే దగ్గరలోని ప్రాంతాల ప్రయాణికులు ఇక్కడికే వొచ్చి ఎక్కుతారు. ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌ ‌వైపో, కాచిగూడ వైపో వెళ్లే సిటీ ప్రయాణికులూ ఎక్కుతారు. ఆయా స్టేషన్లలో సాధారణ స్టేషన్‌ ‌తరహాలోరైలు కాసేపు ఆగి బయలుదేరితే సరిపోతుంది. దీంతో రెండు ప్రధాన స్టేషన్లపై మెయింటెనెన్స్ ‌బాధ ఉండదు. ప్రయాణికుల తాకిడి తగ్గి భారం కూడా బాగా తగ్గిపోతుంది.

మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌ ‌కథ ఇదీ..
తూప్రాన్‌ ‌మండలం మనోహరాబాద్‌ ‌నుంచి సిద్దిపేట మీదుగా కరీంనగర్‌ ‌జిల్లా కొత్తపల్లి వరకు దాదాపు 150కిలో మీటర్లు. గజ్వేల్‌, ‌సిద్దిపేట మీదుగా రైల్వేలైన్‌ ఏర్పాట అనేది దశబ్దాల కల. అనేక మంది రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో సైతం మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనేక మంది నేతలు హామీలిచ్చినా…ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరికైన మనోహరాబాద్‌-‌కొత్తపల్లి రైల్వేలైన్‌కు కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపిఏ సర్కార్‌ 2005‌లో  సుమారు 310కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  ఈ రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2005లో 310కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే… దాని అంచనా వ్యయం 1160కోట్లకు చేరింది. మెదక్‌, ‌సిద్ధిపేట జిల్లాలో 88కిలోమీటర్ల మేరకు ఈ రైల్వేలైన్‌ ‌వెళ్తుంది.  ఈ రైల్వేలైన్‌ ఈ‌ప్రాంత ప్రజల చిరకాలవాంఛ. ఈ రైల్వేలైన్‌ ‌ప్రాజెక్టు వీలైనంత త్వరగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతుగా కొంత వాటా భూ సేకరణకు నిధులను ఇస్తోంది.  ఫలితంగా రైల్వే పనులు చాలా వేగంగా నడుస్తున్నాయనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రైల్వే స్టేషన్లు ఇవేనా…?
మనోహరాబాద్‌-‌కొత్తపల్లి వరకు సుమారు 150కిలో మీటర్లు. దీనిలో 88కిలో మీటర్లు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో రైల్‌ ‌నడవనున్నది. మిగతా కిలోమీటర్లు కరీంనగర్‌ ‌జిల్లాలో ఉంటుంది. అయితే, మనోహరాబాద్‌-‌కొత్తపల్లి వరకు 13రైల్వే స్టేషన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. మనోహరాబాద్‌ ‌తర్వాత నాచారం, వీరనగరం, గజ్వేల్‌, ‌కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, మిట్టపల్లి( సిద్ధిపేట), గుర్రాలగొంది, చిన్నలింగాపూర్‌, ‌సిరిసిల్ల, వేములవాడ, బోయినిపల్లి, వెదిర వరకు రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, త్వరలోనే గజ్వేల్‌ ‌రైల్వే స్టేషన్‌ను ప్రారంభించడంతో పాటు ఇక్కడి నుంచి  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లను నడపాలని అధికారులు భావిస్తున్నట్లు రైల్వే అధికారుల ద్వారా తెలుసుకున్న ఈ ప్రాంత ప్రజల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.

Leave a Reply