Take a fresh look at your lifestyle.

రెండో డోస్‌ ‌వ్యాక్సిన్‌ ‌ఎప్పుడు ..?

  • సమయం దాటిపోతున్నది..ప్రజల ఎదురుచూపు
  • రాష్ట్రంలో ఆగి పోయిన టీకా కార్యక్రమం ..
  • నిల్వలు ఉన్నాయంటున్న ప్రతిపక్షాలు
  • ముంచుకొస్తున్న మూడవ తరంగం
  • స్పష్టత లేని ప్రభుత్వం

మే 22:రెండో డోస్‌ ‌వ్యాక్సిన్‌ ‌సమయంకూడా దాటిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారంకూడా తమకు రెండవ డోస్‌ ‌వేసుకునే అవకాశం లేకుండా పోతుండడంతో పరిస్థితి ఏమిటో అర్థంకాకుండా ఉందంటు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీనుండి రాష్ట్రంలో వాక్సినేషన్‌ ‌వేయడాన్ని నిలిపివేసింది. ఇలా ఎందుకు నిలుపాల్సి వచ్చిందో, మళ్ళీ ఎప్పటినుండి వేస్తారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వస్తున్న వార్తల ప్రకారం రాష్ట్రంలో వాక్సిన్‌ ‌నిల్వలు లేకపోవడంవల్లనే నిలిపివేశారంటుండగా, వాక్సిన్‌ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో అర్థంకావడం లేదని ప్రతిపక్ష నాయకులు గొడవ పెడుతున్నారు. విచిత్రకర విషయమేమంటే దేశంలో వాక్సిన్‌ ‌ప్రక్రియ దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరాటంకంగా జరుగుతుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా మందికి రెండవ వాక్సిన్‌ కూడా వేశారు. కాగా ఇంకా సుమారు 56 లక్షల మంది రెండవ డోసుకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహామ్మారిగా విజృంభిస్తున్న కొరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే ప్రత్యమ్నాయంగా ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రక్రియ మన దేశంలో విస్తృతంగా కొనసాగుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ ప్రక్రియను నిలిపివేశాయి. ఇందుకు కేంద్రం నుండి వాక్సిన్స్ అం‌దకపోవడమేనన్నది తెలంగాణ ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాట. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన వాక్సిన్‌ను సరిగా వాడటంలేదని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంవాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తాజాగా దీనిపైన స్పందించారు. కేంద్రం సరఫరా చేసిన వాక్సిన్‌కు, రాష్ట్రం చెబుతున్న లెక్కలకు పొంతనలేదంటున్నాడాయన. ఇంకా రాష్ట్రం వద్ద సుమారుగా ఆరులక్షల డోసులుంటాయని, అయినా ప్రభుత్వం వాక్సినేషన్‌ను ఎందుకు నిలిపివేసిందో అర్థం కావడంలేదంటున్నాడు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వాటిని వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో వాక్సినేషన్‌ ‌ప్రక్రియ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మే ఒకటినుండి పద్దెనిమిదేళ్ళు పైపడిన వారికి కూడా వాక్సినేషన్‌ ఇవ్వాలంటూ ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో ఈ కార్యక్రమం కుంటుపడుతూ వచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ ‌బుకింగ్‌ ‌పెరగటంతో రెండవ డోస్‌ ‌వేసుకునేవారికి ఇబ్బందికరంగా మారింది. దీన్ని గమనించిన ప్రభుత్వం ముందుగా రెండవ డోసు వారికి ప్రాధాన్యత నిస్తున్నట్లు ప్రకటించింది. దానికి కూడా చాలా తక్కువ సమయం కేటాయించింది. జలుబో, జ్వరమో వచ్చినవారు వాక్సినేషన్‌ ‌చేయించుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. దాని ప్రకారం తమ జలుబు, జ్వరం తగ్గిన తర్వాత రెండవ టీకా తీసుకుందామనుకున్న వాళ్ళు ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. మొదటి వాక్సినేషన్‌ ‌చేసుకున్న వారిలో ఎక్కువ మంది కోవిషీల్డ్ ‌వేసుకున్నవారున్నారు. ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకునే విషయంలో గందరగోళ వార్తలు రావడంకూడా అయోమయానికి గురిచేస్తోంది. మొదట్లో ఈ వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారు ఇరవై ఎనిమిది రోజుల్లో రెండవ వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలన్నారు. ఆ తర్వాత దీన్ని నలభై మూడు రోజులకు పెంచారు. ఇప్పుడు పన్నెండు వారాల వ్యవధి ఉండాలంటున్నారు. దీనికి అమెరికా శాస్త్రజ్ఞులు చెబుతున్న దాన్ని చూపిస్తున్నారు.

వాస్తవంగా వ్యాక్సిన్‌ ‌లేక పోవడంవల్ల అమెరికా శాస్త్రజ్ఞుల మాటను అమలు పరుస్తున్నారా లేక నిజంగానే అంత సమయం తీసుకోవడం అవసరమా అన్న విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో ప్రజలకు ఏమీ అర్థం కాకుండా పోతుంది. మరి అంతకు ముందు 28 రోజుల వ్యవధానంలో, 43 రోజుల వ్యవధానంలో రెండవ టీకా వేసినప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకుంటుందని రెండవ వ్యాక్సిన్‌ ‌కోసం ఎదురుచూస్తున్నవారు ఆరోగ్య సిబ్బందిని నిలదీస్తున్నారు. ఒక విధంగా వారిని ఇబ్బందిపెడుతున్నారుకూడా. దీంతో ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ ఆ ‌తేదీలకే ఓపన్‌ అవుతున్నదంటూ వారిని సిబ్బంది శాంత పరిచేప్రయత్నం చేస్తున్నారు.

ఏది ఏమైనా టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుందనడంతో దీన్ని తప్పక తీసుకోవాలని జనం ఆసక్తి చూపుతున్నారు. కాని వారి ఉత్సాహానికి తగినట్లుగా ప్రభుత్వం వాక్సినేషన్‌ ‌కార్కక్రమాన్ని ముమ్మరం చేయాల్సి ఉండగా, దాదాపు వారం రోజులుగా మొత్తానికే బంద్‌ ‌పెట్టింది. రెండవ డోసు తీసుకునేవారు, కొత్తగా వాక్సిన్‌ ‌వేయించుకోవాలనుకునేవారికిది పూర్తి నిరాశను కలిగిస్తున్నది. మరోవైపు కోవిద్‌ ‌మూడవ వేవ్‌ ‌కూడా చాలా డేంజర్‌గా వస్తుందని అంటున్న తరుణంలో ముందు జాగ్రత్తగా టీకా తీసుకుందామనుకునే వారికిప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా రెండవ విడుత వ్యాక్సిన్‌ను ప్రభుత్వం చెబుతున్న పన్నెండు వారాల సమయం దాటినప్పుడు అది పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు చాలామంది కున్నాయి. కొందరు సమయం ఎక్కువైతే మళ్ళీ రెండు టీకాలు తీసుకోవాలంటున్నందును దీనిపై ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

Leave a Reply