Take a fresh look at your lifestyle.

‌సొరకాయ ఉద్యోగులను ఎప్పుడు పంపిస్తరు సారు?

  • స్థానికతే ప్రామాణికత
  • ఉద్యోగుల విభజన సమస్యలు ఎక్కడివక్కడే
  • తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏపీ ఉద్యోగులు
  • స్థానికతను ప్రామాణికంగా తీసుకోకపోవడమే అసలు సమస్య
  • విద్యుత్తు ఉద్యోగుల విభజన నుంచి విభజన సమస్యలన్నీ తెరమీదికి

సొరకాయ ఉద్యోగులను ఎప్పుడు పంపిస్తరు సారు? మన ఆన్పకాయ ఉద్యోగులను తెలంగాణకు ఎప్పుడు తీసుకొస్తరు సారు? అంటూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేరుగారాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పైననే ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాయి. జస్టిస్‌ ‌ధర్మాధికారి కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విద్యుత్తు ఉద్యోగుల విభజన జరిగినప్పటికీ, ఏపీకి చెందిన 655 మంది ఉద్యోగులను చట్టవిరుద్ధ్దంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు సంస్థలకు బదిలీ చేయడంతో, మొత్తం ఉద్యోగుల విభజన, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం వివిధ విభజనాంశాలన్నీ మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మహోద్యమమై ఎగిసిపడుతున్న సందర్భంలో 2012 డిసెంబర్‌9‌న ఇందిరాపార్క్ ‌వద్ద జరిగిన మహాసభలో ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమనేత కేసీఆర్‌ ‌మాట్లాడుతూ తెలంగాణ ఏపీ ఉద్యోగుల విభజన చాలా సులభమని, సెక్రటేరియట్‌ ‌గేట్‌ ‌ముందు నిలుచొని ఆన్పకాయ పట్టుకొని ఇదేమి కాయ అని అడగాలని, సొరకాయ అన్నోళ్లను ఏపీక• పంపించాలని, ఆన్పకాయ అన్నోళ్లను తెలంగాణకు కేటాయించాలని ఉద్యోగుల విభజనను అరటిపండు వలిచినట్లు చెప్పారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా, సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రితో మూడు సార్లు ప్రత్యేకంగా భేటీ అయినా, విభజన సమస్యలన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో ,అవే ఇబ్బందులను ప్రస్తుతం కూడా ఎదుర్కొంటున్నారని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్యవేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏపీ విభజన చట్టం -2014, కమల్‌నాథన్‌ ‌కమిటీ ఇచ్చిన సిఫారసుల ప్రకారం తెలంగాణస్థానికులైన 800 మంది నాలుగోతరగతి ఉద్యోగులను 58: 42 అనే నిష్పత్తి అనే నిబంధనల ప్రకారం ఏపీకి కేటాయించారు. అదేవిధంగా 600 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణకు ఇచ్చారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు వెళ్తామని, తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులు ఏపీకి వెళ్తామని 2014 ఆగస్టు నుంచి నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు. కమల్‌నాథన్‌కమిటీకి వందలసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ ఉద్యోగుల పరస్పర మార్పిడి జరగాలని, స్థానికత నిబంధనల ప్రకారం ఏపీ స్థానికత గల ఉద్యోగులను ఏపీకీ, తెలంగాణ స్థానికతగల ఉద్యోగులను తెలంగాణకు కేటాయించాలని టీఎన్జీవో, ఏపీఎన్జీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏపీ నేటివ్స్ ‌వర్కింగ్‌ ఇన్‌ ‌తెలంగాణ సంఘం, తెలంగాణ నేటివ్‌ ఎం‌ప్లాయీస్‌ ‌వర్కింగ్‌ ఇన్‌ ఏపీ సంఘం వేర్వేరుగా రెండు రాష్ట్రాల చీఫ్‌ ‌సెక్రటరీలకు,రెండు రాష్ట్రాల గవర్నర్లకు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చాలా సార్లు విజ్ఞాపనలు అందచేశాయి.

తెలంగాణ స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని చేసిన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలవుతున్నాయి. సమస్యలు మరింత జఠిలమవుతున్నాయే తప్ప, పరిష్కారాలు మాత్రం లభించడంలేదని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్సనర్లు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏపీ వలసపాలకుల కుట్రల కారణంగానే ఐదుదశాబ్దాల పాటు తెలంగాణకు అన్యాయం జరగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే సమస్యల పరిష్కారాలకు మార్గమని 1947 సర్కారీ ములాజిమ్‌యూనియన్‌ ‌కాలం నుంచి 2014జనవరిలో ఆనాటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలోని గ్రూప్‌ ఆఫ్‌ ‌మినిస్టర్స్(‌జీవోఎం)కు నివేదికలను ఇచ్చేవరకు కొట్లాడిన టీఎన్జీవో సంఘం,ఉద్యోగుల విభజనపై పోరాటస్పూర్తితో స్పందించడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఫేక్‌ ‌నేటివిటీ సర్టిఫికేట్‌లతో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారని తెలంగాణ ఉద్యోగులు వాదిస్తున్నారు. పే అండ్‌ అకౌంట్స్, ‌ట్రెజరీ,రెవెన్యూ, సెక్రటేరియట్‌, ‌సర్వే అండ్‌ ‌లా రికార్డస్, ఆర్కివ్స్, ‌దేవాదాయశాఖ వంటి శాఖలలో పనిచేస్తూ తెలంగాణలో చదువుకోకున్నా, ఫేక్‌సర్టిఫికేట్‌లను జతపరిచి పదోన్నతులు కూడా పొందిన దాఖలాలు ఉన్నాయని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ నేటివ్స్ ఉద్యోగుల సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. 1972లో వనస్థలిపురంలోని ప్రైవేట్‌పాఠశాలలో ప్రాథమికవిద్యను చదివినట్లుగా సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలలో కొనసాగుతున్నవారున్నారని విమర్శలు ఉన్నాయి.

1972లో వనస్థలిపురం లేనేలేదుకదా? అనే ప్రశ్న ఎవరినీ బాధించడంలేదు. హైదరాబాద్‌ •తెలంగాణ గెజిటెడ్‌ అధికారులసంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్న సీనియర్‌ అధికారికి పదోన్నతి లభిస్తే తెలంగాణలో పోస్టు లేదనే నెపంతో ఏపీకి బదిలీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హైదరాబాద్‌లోని ఉద్యోగులందరినీ కదిలించడంలో ఈ అధికారి కీలకపాత్ర పోషించారు. తెలంగాణలో పోస్టు ఏర్పాటు చేయాలని తనను తెలంగాణకు తీసుకరావాలని ఉద్యమకాలంతో తనతో కలిసి నడిచిన మంత్రులందరికీ విజ్ఞాపనలు ఇచ్చారు. మూడేళ్లుగా వారి చుట్టూ తిరుగుతునే ఉన్నానని, పనిమాత్రం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫేక్‌ ‌నెటివిటీ సర్టిఫికేట్‌లపైన కమలనాథన్‌ ‌కమిటీకి, కేంద్రంలోని డీవోపీటీ అధికారులకు తెలంగాణ ఉద్యోగులు ఫిర్యాదులు ఇచ్చారు. కేంద్రంలోని డీవోపీటీ అధికారులు కూడా తాబేలుతో పోటీపడుతూ విభజనాంశాలపైన ఎటూ తేల్చకపోవడంతో ఉద్యోగుల విభజన, తొమ్మిది పదోషెడ్యూల్‌ ‌సంస్థల విభజన ఆస్తుల విభజన వంటి అనేక అంశాలలో చిక్కుముడులు పడుతున్నాయి. ఏపీ లోని ప్రేంచంద్రారెడ్డి సారథ్యంలో సెల్‌, ‌తెలంగాణలోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రామకృష్ణారావు సారథ్యంలోని సెల్‌ ‌పని చేస్తున్నప్పటికీ, సమస్యలను ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర పెద్దలకు రాయడం తప్ప పరిష్కారాలను చూపిన పాపానపోలేదని విమర్శలు ఉన్నాయి. విద్యుత్తు ఉద్యోగుల విభజన సందర్బంలో కూడా పట్టువదలకుండా విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్‌ ‌ధర్మాధికారి కమిటీని ఏర్పరిచారు. ఈ కమిటీ విద్యుత్తు సంస్థలలోని 1157 మంది ఉద్యోగులను ఏపీకి తెలంగాణకు నిష్పత్తి ప్రకారం విభజించినప్పటికీ, ఏపీకి చెందిన 655 మంది ఉద్యోగులను తెలంగాణపైన రుద్ది ఏపీ విద్యుత్తు సంస్థలు సమస్యను జఠిలం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఏపీ ఉద్యోగులందరినీ ఒక్క కలంపోటుతో ఏపీకి పంపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలు కూడా రికార్డులలో ఉన్నాయి.

సెక్రటేరియట్‌లో..
తెలంగాణ సెక్రటేరియట్‌లో అడిషనల్‌ ‌సెకట్రకరీ, జాయింట్‌ ‌సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్‌ ‌సెక్రటరీ, సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ‌సెక్షన్‌ ఆఫీసర్‌, ‌ప్రైవేట్‌సెక్రటరీ టు మినిస్టర్స్, ‌స్పెషల్‌ ‌కేటగిరీ స్టెనోస్‌,‌సీనియర్‌స్టెనోస్‌, ‌టైపిస్ట్ ‌కమ్‌ అసిస్టెంట్‌, ‌డీఆర్‌ అం‌డ్‌ ‌టీ అసిస్టెంట్స్, ‌రికార్డ్ అసిస్టెంట్స్ , ఆఫీస్‌ ‌సబార్డినేట్స్ ‌వంటి అన్నీ స్థాయిలలో నిష్పత్తులకు ఏపీ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం వాదిస్తున్నది. తెలంగాణ స్థానికత గల ఉద్యోగులనే సెక్రటేరియట్‌లో ఉంచాలని, ఏపీ మూలాలు ఉన్న వారందరినీ సెక్రటేరియట్‌నుంచి పంపించాలని టీఎన్జీవో తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం, తదితర ఉద్యోగసంఘాలన్నీ 2014 నుంచి ఆందోళను చేశాయి. కానీ కాలక్రమంలో ఆందోళనలను విరమించాయి. సెక్షన్‌ ఆఫీసర్‌ ‌స్థాయిలోనే 60 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలంగాణ అసిస్టెంట్‌ ‌సెక్షన్‌ ఆఫీసర్ల సంఘం వాదిస్తున్నది.వీరు తెలంగాణలో ఉన్నంత కాలం తమకు పదోన్నతులలో అవకాశాలు లభించవదని తెలంగాణ అసిస్టెంట్‌ ‌సెక్షన్‌ అధికారుల సంఘం నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

Leave a Reply