Take a fresh look at your lifestyle.

‌ప్రాజెక్టులను సందర్శిస్తే ప్రభుత్వానికి నొప్పేంటి?

 

*మంజీర ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది
* ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో కరువు తాండవం
* ప్రజల కొరకు ప్రజాక్షేత్రంలో ఎళ్లవేళ్లలా కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా
* టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళుతున్న టిపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ని గురువారం పటాన్‌చెరు టోల్‌ ‌గేట్‌ ‌వద్ద మార్గమధ్యంలో స్థానిక పోలీసులు అడ్డుకుని మండల పరిధిలోని బీడీఎల్‌ ‌భానూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు తరలించారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీస్‌ ‌స్టేషన్లోనే నిర్బంధించి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిని విడుదల చేశారు. అనంతరం ఆయన బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపైన పోరాడటానికి వెళుతున్న తనను అక్రమంగా, అప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుని పోలీసులతో అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇలాంటి ఘటనలను తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. నా సొంత పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని తెలియడంతో వాటిని పర్యవేక్షించేందుకు వెళుతున్న తనను ప్రభుత్వం మొండి వైఖరితో అరెస్టు చేసి ఆరు గంటలపాటు నిర్బంధించారని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మంజీర ప్రాజెక్టు ఎండిపోయిందని దీనిని గోదావరి జలాలతో నింపి త్రాగు నీరు, సాగు నీరు ను ప్రజలకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌ ‌నియోజకవర్గాల్లో తప్ప మిగతా నియోజకవర్గాల్లో కరువు తాండవిస్తోందని అన్నారు. మేము శ్రీశైలం లెఫ్ట్ ‌కెనాల్‌, ‌మంజీర ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌కు ఏమి నొప్పి వస్తుంది, ఏమీ ఇబ్బంది అవుతుందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతును రాష్ట్ర ప్రభుత్వం నొక్కుతోందని అన్నారు. ఏది ఏమైనా ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రాజెక్టులను సందర్శించడానికి వెళుతున్న మమ్మల్ని ఏ చట్టం కింద అడ్డుకుంటున్నారో డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు అడుగుతున్నామని పేర్కొన్నారు. గతంలో గొప్ప సంప్రదాయాలు, చరిత్ర ఉన్న పోలీస్‌ ‌శాఖ ప్రజలకు ఎంతో మేలు చేసిందని, అదే పోలీసు శాఖ ఇప్పుడు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతులను నొక్కే వాటిలో పోలీసులు భాగస్వాములు కావోద్దని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి, పది వేల మందితో సభలు పెట్టుకోవచ్చు కానీ మేము పదిమందితో ప్రాజెక్టులు సందర్శిస్తే తప్పు వచ్చిందా అని ప్రశ్నించారు. జిల్లాల్లో మంత్రులు వ్యవసాయ విధానంపై సుమారు వెయ్యి మందితో సభలు నిర్వహిస్తున్నారని, అక్కడ లేని ఆంక్షలు మాకెందుకు పెడుతున్నారని వాపోయారు. మా పార్టీ సభ్యులు డీజీపీ తో మాట్లాడితే హోం మినిస్టరీ నోటిఫికేషన్‌ ‌మేరకు మేము మిమ్మల్ని అవుతున్నామని సమాధానం చెప్పాడు. ఇదే నోటిఫికేషన్‌ ‌ముఖ్యమంత్రి కెసిఆర్కు వర్తించదా అని ప్రశ్నించారు. వాళ్లేమైనా ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్లేమైనా ఒకటవ క్లాసు పౌరులా, మేమేమైనా రెండవ క్లాసు పౌరులమా అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ ‌నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం, తక్కువ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. భారతదేశంలోనే అతి తక్కువ టెస్టులు చేసిన రాష్ట్రం తెలంగాణనే అని గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌ ‌ప్రకారం నియమ నిబంధనలతో ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తున్నాము తప్ప, టీఆర్‌ఎస్‌ ‌నాయకుల మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్య విచ్చలవిడిగా తిరగడం లేదని అన్నారు. ప్రజల కొరకు ప్రజా క్షేత్రంలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అణిచివేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ ‌రెడ్డి, మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంచార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply