Take a fresh look at your lifestyle.

జివోలు వెబ్‌సైట్‌లో పెట్టడానికి ఇబ్బందేమిటి?

  • 24 గంటల్లోగా పెట్టాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
  • వాసాలమర్రిలో దళితబంధు అమలుపై విచారణ

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించండి : మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాచ్‌ ‌వాయిస్‌ ఆఫ్‌ ‌పీపుల్‌ ‌సంస్థ వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌హిమాకోహ్లి, జస్టిస్‌ ‌విజయసేన్‌ ‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళిత బంధుకు నిధులు విడుదల చేశారని పిటిషనర్‌ ‌కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్‌ ‌జనరల్‌ ‌ప్రసాద్‌ ‌స్పందిస్తూ.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు.దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటిషన్‌లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది శశికిరణ్‌ ‌న్యాయస్థానానికి వివరించారు. జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. దళితబంధుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగించింది. జీవోను 24 గంటల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ ‌చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించండి : మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించింది. సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్‌ఎం‌సీ, హైదరాబాద్‌ ‌సీపీలకు హైకోర్టు ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్‌ అధికారులు హైకోర్టుకు హాజరుకావాలని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌, ‌దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్‌ ‌పిల్‌పై విచారించింది. ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సూచనలు కాదని, స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని హైకోర్టు పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.

Leave a Reply