Take a fresh look at your lifestyle.

‘పారిశుద్ధ్య’ కార్మికుల జీవితాల్లో వెలిగేది ?

“జాతీయ సగటుగా ఉన్న డెబ్బయి ఏళ్ళ ఆయువు ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు పాతిక ఏళ్ళ తక్కువ వయసులోనే వీరి జీవితాలు కొవ్వొత్తుల్లా కరగిపోతున్నాయన్నమాట. పైగా ఈ కార్మికులలో వారి పని స్వభావం కారణంగా మరణాల రేటు, దీర్ఘకాల అస్వస్థత కూడా ఎక్కువే. గత అయిదేళ్ల కాలంలో తమ పనులు చేస్తూనే మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు. మురుగు కాలువలు , సెప్టిక్‌ ‌ట్యాంకులను శుభ్రం చేస్తున్నప్పుడు ఊపిరి ఆడక మరణించిన వారు ఎందరో ? ఇవన్నీ కూడా అధికారిక రికార్డులు చెబుతున్న వాస్తవాలే. కానీ వాస్తవంగా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువేనన్నది కూడా నిజం..!”

తగ్గిపోతున్న ఆయుప్రమాణం … మురుగులోనే బతుకు కనుమరుగు!

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మరి ఆ ఆరోగ్యం ఎలా వస్తుంది? మనం పరిశుభ్రంగా ఉంటేనే మన పరిసరాలు స్వచ్ఛతకు తార్కాణంగా నిలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యం. మనంతట మనం వరకు శుభ్రంగా ఉంటే సరిపోదు. ఆ శుభ్రత పరిసరాల్లోనే కనిపించాలి. మొత్తం మనం జీవించే సమాజంలోనూ ప్రతిఫలించాలి. మన కోసం మన ఆరోగ్యం కోసం మొత్తం సమాజం సంక్షేమం కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కనీసం జీవనాదాయం లేక అహరహం శ్రమిస్తున్న వారే పారిశుద్ధ్య కార్మికులు. వీరు మనకు చేసే సేవ అత్యంత మౌలికమైనదే కాదు ఎంతో ప్రాథమికమైనది కూడా. దశాబ్దాల తరబడి ఈ కార్మికులు చేస్తూ వచ్చిన సేవలకు గుర్తింపే లేదు. వారి మనుగడను పట్టించుకొని వారి బతుకులు తీర్చిదిద్దే ప్రయత్నం ఇటీవలి కాలం వరకు జరుగనే లేదు. గత ఏడెనిమిది సంవత్సరాలుగానే దేశంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత పెరిగింది. స్వచ్ఛ భారత్‌ ‌పుణ్యమా అని ప్రభుత్వాలు కూడా పారిశుద్ధ్యానికి విధానపరమైన ప్రాధాన్యతను ఇచ్చాయి. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పరిశుభ్రతే పరమావధి అన్న భావనను బలంగా పాదుకొలిపే ప్రయత్నం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం మొదలుకొని ఆరోగ్యకర సామాజిక జీవనానికి పెద్దపీట వేసిన ఈ కార్యక్రమాలలో ప్రభుత్వంతో పాటు ప్రయివేటు రంగమూ పాల్గొంది. సినీ నటులు మొదలు కొని వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పారిశుద్ధ్యానికి జై కొట్టారు. కానీ మాటల వరకు అంతా బాగానే ఉంది. చేతల్లో ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? పాకీ పని వారి దగ్గరినుంచి ప్రతి ఒక్కరూ తమ కోసం కాకుండా ఇతరుల కోసమే పనిచేస్తారు. అత్యంత హేయంగా భావించే ఈ పనులు వారు చేసేది వారి కోసం కాదు తమ చుట్టూ ఉన్న వారికోసం. అలాంటి వారిని ప్రభుత్వాలు ఎంతవరకు ఆడుకుంటున్నాయి? దేశవ్యాప్తంగా అత్యంత మౌలికమైన ఈ విధులు నిర్వహించే వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది.

మరుగుదొడ్లు శుభ్రం చేయడం మొదలుకొని సెప్టిక్‌ ‌త్యాంకులను క్లీన్‌ ‌చేయడం, నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం అన్నది మామూలు వ్యక్తులు చేసే పని కాదు. తన ఆరోగ్యాన్ని పణంగా పెడితే తప్ప ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడలేమన్న భావన కలిగిన పారిశుద్ధ్య కార్మికులే ఈ పని చేయగలుగుతారు. బహిరంగ మల విసర్జన అన్నది ఇటీవలి కాలంలో టాయిలెట్ల నిర్మాణం కారణంగా కొంత మేర తగ్గినా ఈ సమస్య తీవ్రత చాలా ఎక్కువగానే ఉందన్నది వాస్తవం. అందరూ పరిశుభ్రత కావాలంటారు. అంత స్వచ్ఛంగా ఉండాలంటారు. తాజ్‌ ‌మహల్‌ ‌కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలెవరన్నట్లుగా ఈ సామాజిక పరిశుభ్రత డిమాండును తీర్చేదెవరు? వీరే పారిశుద్ధ్య కార్మికులు. సమాజం తమను నిరాదరిస్తున్నా , అదే సమాజాన్ని ఆదరిస్తున్న ఆరోగ్య ప్రదాతలు వీరినే సఫాయి పనివారు అంటారు. ఇలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. కానీ వారి పట్ల సమాజం కనబరిచే ఆదరణ మాత్రం మొక్కుబడి చందమే. ఇటీవల జరిగిన సర్వేలో దేశంలో దాదాపు యాభై లక్షల మంది ఈ రకమైన సఫాయి పని చేసే వారేనని వీరిలో దాదాపు యిరవై లక్షల మంది చేసే పారిశుద్ధ్య పనులు ఏ క్షణంలోనైనా వారి ప్రాణానికి, లేదా ఆరోగ్యానికి ముప్పు తెచ్చేవేనని తేలింది. వీరందరినీ పారిశుద్ధ్య కార్మికులే అంటున్నప్పటికీ వారు చేసే పనుల వర్గీకరణను విస్మరించడానికి వీలు లేదు.

మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు రైల్వే ట్రాక్లను శుభ్రం చేయడం, డ్రయిన్లను శుభ్రం చేయడం, స్కూల్‌ ‌టాయిలెట్లను శుభ్రం చేయడం వంటి విధులు నిర్వహించే వారి ఆరోగ్యానికి దిక్కులేని పరిస్థితే. ఇలాంటి వారిలో దాదాపు నలభై శాతం మంది పట్టణ ప్రాంతాలలోనే పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది మహిళలే అన్నది వాస్తవం. వీరంతా కూడా బయటకు కనిపించని అజ్ఞాత కార్మికులే. ఇటు ప్రభుత్వాలకు, అటు పౌరులకూ పట్టని అజ్ఞాత సేవకులే. వీరు లేకుండా ఆరోగ్య వ్యవస్థ నడువదు. కానీ వీరి చాకిరీకి గుర్తింపు ఎక్కడ? పైగా దేశంలో అసలు పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది అన్న దానిపై ప్రామాణికమైన లెక్కలు లేవు. ప్రభుత్వ జీతాలపై పనిచేసే వారే పారిశుద్ధ్య కార్మికులని లెక్కగట్టడం వల్ల ఈ విధులను నిర్వహిస్తున్న లక్షలాది మంది విస్మరిస్తున్నట్లే అవుతుంది. పైగా పరిశుభ్రత అన్న పదానికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిర్వచనం లేదు. ప్రభుత్వ జీతాలపై పని చేసే వారినే పారిశుద్ధ్య కార్మికులుగా లెక్కగట్టడం వల్ల ఇతర కార్మికులకు మౌలికమైన ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందకుండా పోతున్నాయి. సరైన రీతిలో మొత్తం పారిశుద్ధ్య కార్మికులను గుర్తించకపోతే కొద్దిమందికి మాత్రమే ఈ రకమైన ప్రభుత్వ ప్రయోజనాలు పరిమితం అయిపోతాయి. ఎవరు ఏ పని చేస్తున్నారు? అందులో ఉన్న ఇబ్బందులు ఏమిటి? అన్న వాస్తవ సృహతోనే ఈ గణన జరగాలి. ఇలా చేయని పక్షంలో పారిశుద్ధ్య కార్మికుడి జీవితం ఆ మురుగులోనే మరుగున పడిపోతుంది. ఇప్పటికే ఈ రకమైన పనులు చేసేవారి ఆయువు ప్రమాణం 40-45 సంవత్సరాల మధ్యే.

జాతీయ సగటుగా ఉన్న డెబ్బయి ఏళ్ళ ఆయువు ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాదాపు పాతిక ఏళ్ళ తక్కువ వయసులోనే వీరి జీవితాలు కొవ్వొత్తుల్లా కరగిపోతున్నాయన్నమాట. పైగా ఈ కార్మికులలో వారి పని స్వభావం కారణంగా మరణాల రేటు, దీర్ఘకాల అస్వస్థత కూడా ఎక్కువే. గత అయిదేళ్ల కాలంలో తమ పనులు చేస్తూనే మరణించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు. మురుగు కాలువలు , సెప్టిక్‌ ‌ట్యాంకులను శుభ్రం చేస్తున్నప్పుడు ఊపిరి ఆడక మరణించిన వారు ఎందరో ? ఇవన్నీ కూడా అధికారిక రికార్డులు చెబుతున్న వాస్తవాలే. కానీ వాస్తవంగా మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువేనన్నది కూడా నిజం. పైగా ఈ రకమైన కార్మికులలో తమ పనుల కారణంగా మాదక ద్రవ్యాలకు, మద్యపానానికి కూడా అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కరోనా విజృంభణ కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. వీరందరినీ ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ అం‌టూ ఇటు ప్రభుత్వాలు, అటు జనం నీరాజనాలు పలికినా వారి ఆరోగ్యం, వారి భద్రత, హుందాతో కూడిన జీవనంపై ఎవరూ దృష్టిపెట్టలేదు అస్సాం, మధ్యప్రదేశ్‌ , ‌ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తొంభై శాతం మంది పారిశుద్ధ్య కార్మికులకు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. వీరికి ఆరోగ్య భీమా, ఆరోగ్య సంరక్షణ చివరికి కోవిడ్‌ ‌పరీక్షలూ జరుగలేదు. ఇంక ఆదాయం విషయానికి వస్తే ఈ పారిశుద్ధ్య కార్మికులందరూ దాదాపుగా రోజు కూలీపై ఆధారపడుతున్నవారే. వీరికి ఆర్ధిక సాయం మాటలు ఎంత గొప్పగా ఆచరణలో మాత్రం అవి పూజ్యమే. ఈ వాస్తవాలను దృష్టిలోపెట్టుకొని జాతికి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఈ పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను ఆదుకోవాలి. కొవ్వొత్తి చందంగా మనకు వెలుగునిచ్చి వారు సమసిపోయే పరిస్థితి ఉండకూడదు.
-ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply