Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది…!

  • అసెంబ్లీ సమావేశాలకు జగ్గారెడ్డి దూరం
  • గైర్హాజర్‌కు కారణమేంటి…?
  • అలిగారా? ఆర్థిక సమస్యలా?
  • గాంధీభవన్‌, అసెంబ్లీకి అంటీముట్టనట్లుగా…
  • ఆధ్యాత్మిక, పాటల కచేరిలో పాల్గొంటున్న జగ్గారెడ్డి

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అంతుచిక్కడం లేదు. రోజు రోజుకూ పార్టీలో చిత్ర, విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని ఎవరు వీడుతున్నారో…ఎవరు ఉంటున్నారో తెలియడం లేదు. పార్టీలో ఫలాన నేత ఉన్నాడా? లేడా? అని వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది. కీలక నేతలుగా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడి వెళ్లిపోవడం..ఉన్న కొద్ది మంది నేతల్లోనైనా సమన్వయం, ఏకాభిప్రాయంతో ఉన్నారంటే అదీ లేదు. ఎవరి దారి యమునా తీరు అన్నట్లుగా తయారైంది. పార్టీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో పార్టీ కేడర్‌ను ఒకతాటిపైకి తెచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపే నాయకుడు ఒకడంటే ఒక్కరు నేడు కాంగ్రెస్‌ ‌పార్టీలో కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. రోజు రోజుకూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీని వీడారనే మాట వినాల్సి వొస్తుందోననీ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరీ ముఖ్యంగా 6గురు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో…ఎప్పుడు ఎవరేమీ మాట్లాడుతారో తెలియక కాంగ్రెస్‌ ‌శ్రేణులు అయోమయానికి గురౌతున్నాయి. జుట్టు పీక్కుంటున్నాయి.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌ ‌పార్టీలో ఫైర్‌‌బ్రాండ్‌గా పేరుండి, కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు కష్టమొస్తే ఆర్థికంగా ఆదుకునేందుకు తానున్నాననీ కార్యకర్తలకు అంతో ఇంతో భరోసా ఇస్తూ వస్తున్న సీనియర్‌ ‌నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి కూడా కనిపించకుండా పోయారు. తన ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా అటు గాంధీభవన్‌లో కనిపించడం లేద. ఇటు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ ‌సమావేశాల్లో ఒకటంటే ఒక్క పూట మాత్రమే జగ్గారెడ్డి అసెంబ్లీకి హాజరయ్యారు. గాంధీభవన్‌కు వెళ్లడం మాటుంచి..శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలకు కూడా జగ్గారెడ్డి దూరంగా ఉండటం అటు కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలన్నీ తన చుట్టూ తిరిగేలా చేసుకోవడం జగ్గారెడ్డి ప్రత్యేకత. అటువంటి జగ్గారెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా..అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరం కావడం వెనకాల మతలబుపై పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటుకున్నారు. పలు ఊహాగానాలూ వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం పార్టీలో, రాజకీయాలలో అంతటా ఒకటే చర్చ కాంగ్రెస్‌ ‌ఫైర్‌ ‌బ్రాండ్‌ ‌జగ్గారెడ్డి ఎక్కడ?గాంధీభవన్‌కు ఎందుకు వెళ్లడం లేదు? అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీపై జగ్గారెడ్డి ఏమైనా అలిగారా? లేదంటే ఆర్థిక సమస్యలతోనే జగ్గారెడ్డి సైలెంటుగా ఉంటున్నారా? అనేదానిపై ఎవరికి తోచిన వారు మాట్లాడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో యాక్టీవ్‌గా కనిపించే జగ్గారెడ్డి ఆ పార్టీకి, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలకు దూరంగా ఉండటమే. బడ్జెట్‌ ‌సమావేశాల్లో వినిపించాల్సిన తన గళాన్ని భక్తి పాటలకోసం వినియోగిస్తున్నారు. అధ్యాత్మిక కార్యక్రమాలకు తన సమాయాన్ని కేటాయిస్తూ…పనిలో పనిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీపై ఒంటికాలిపే లేచే జగ్గారెడ్డి… తెలంగాణ బడ్జెట్‌ ‌సమావేశాల్లో ప్రజా సమస్యలను వినిపించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ…ముఖ్యంగా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ ‌కళాశాల, నీళ్లు, నిధుల గురించి ఇరకాటంలో పెడుతారనుకున్న ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులకు జగ్గారెడ్డి ఊహించని షాకే ఇచ్చారనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ రోజుల్లో అటు గాంధీభవన్‌లోనో, ఇటు అసెంబ్లీ ఆవరణలోనో దాదాపుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏకిపారేసే జగ్గారెడ్డి..బడ్జెట్‌ ‌సమావేశాలకే రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కనిపించని జగ్గారెడ్డి మరెక్కడికైనా వెళ్లారా అనుకుంటే పొరపాటే. ఆయన తన నియోజక వర్గంలో జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.

అలిగారా?ఆర్థిక సమస్యలు కారణమా?
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్‌ ‌సమావేశాల్లో కేవలం ఒక పూట మాత్రమే హాజరైన జగ్గారెడ్డి…మిగతా రోజుల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడానికి…ఆధ్యాత్మిక, పాటల కచేరి, షాప్స్ ‌ప్రారంభోత్సవాలకు పరిమితం కావడం వెనక ప్రధాన కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు మంగళవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. ప్రజా సమస్యలతో పాటు రైతు సమస్యలను ఎత్తిచూపుతూ జగ్గారెడ్డి రెండు సార్లు సంగారెడ్డి నియోజకవర్గంనుండి హైదరాబాద్‌ ‌వరకు పాదయాత్రకు సన్నాహాలు చేసుకున్నారు. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ, ఒకసారి పోలీసులు అనుమతిని నిరాకరించారు. రెండోసారి ఏమైందో ఏమో కానీ రెండు సార్లు అనూహ్యంగా తన పాదయాత్ర వాయిదా పడుతూ వచ్చింది. రెండోసారి ఎందుకు పాదయాత్రకు బ్రేకులు పడటానికి కారణం పార్టీ నుండి సరైన సహకారంలేక ఆయన రెండోసారి తలపెట్టిన యాత్రను నిర్వహించలేకపోయారనీ, దీంతోనే పార్టీపై జగ్గారెడ్డి ఒకింత అలకబూనారనీ సమాచారం. ఇక రెండో విషయానికి వస్తే జగ్గారెడ్డి ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు చెబుతున్న మాట.

జగ్గారెడ్డి ఇప్పటికే బహిరంగంగానే తనకు వందల కోట్ల రూపాయల అప్పులున్నాయనీ, తనను నమ్ముకున్న వారికి ఇంకెన్నయినా అప్పులు చేస్తాననీ చెప్పిన విషయం విధితమే. పలువురికి డబ్బులు ఇస్తానన కమిట్‌మెంటు ఇచ్చిన జగ్గారెడ్డి తనకు రావల్సిన డబ్బులు రాకనో, తనకు సర్దుబాటు చేస్తాననీ చెప్పిన వ్యక్తులు డబ్బులు సర్దుబాటు చేయకనో మొత్తానికి తెలియదు కానీ ప్రస్తుతం ఆయన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదనీ సమాచారం. తనను డబ్బులు అడిగిన వారికి తన వద్ద ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇచ్చి పంపే జగ్గారెడ్డి…ప్రస్తుతానికి ఆయన రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నాడనీ, ఈ ఆర్థిక సమస్యలు కూడా జగ్గారెడ్డి గాంధీభవన్‌కు వెళ్లకపోవడానికి, అసెంబ్లీ సమావేశాలకు అంటీముట్టనట్టుగా ఉండటానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనా జగ్గారెడ్డి వ్యవహారంపై అందరూ దృష్టిసారించినట్లు సమాచారం. ఇప్పుడు రాజకీయాలలో ఇదే హాట్‌ ‌టాపిక్‌.

Leave a Reply