Take a fresh look at your lifestyle.

ఆ శుభవార్త ఏమై ఉంటది ..!!

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మీడియా ముందుకు వొచ్చాడంటేనే ఆరోజు ఏదో గొప్ప విషయం ఉందనే అర్థం. సామాన్యంగా ఉట్టిట్టి మీడియా సమావేశాలు పెట్టే అలవాటేలేదాయనకు. ఉద్యమ కాలం నుండి కూడా ప్రజల దృష్టికి అత్యవసరంగా ఏదైనా తీసుకురావాలంటేనే తప్ప మీడియా సమావేశాలను ఏర్పాటు చేసేవాడు కాదు. అంతెందుకు అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల విషయంలో ప్రతిపక్షాలు గొడవ గొడవచేస్తున్నా ప్రశాంతంగా తాను చెప్పాలనుకున్నప్పుడే మీడియా ద్వారా చెప్పదలుచుకున్న అంశాన్ని చెప్పడం ఆయన నైజం. అలాంటిది తానేదో తీపి కబురు అందించనున్నట్లు ముందుగానే చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అందులోనూ అది రైతాంగానికి సంబందించిన అంశం కావడంతో మరింత ఆసక్తిని కలిగిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వ్యవసాయరంగానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా అభివృద్ధి దిశలోకి తీసుకెళ్తున్న విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు యావత్‌ ‌మంత్రివర్గం నిత్యం చెబుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో నష్టపోయిన విషయం తెలియంది కాదు. అందుకే నిధులు, నీళ్ళు, నియామకాల పేరున చేపట్టిన మలి విడుత ఉద్యమం రాష్ట్రాన్ని సాధించి పెట్టింది.

కొత్త రాష్ట్రంలో గతంలో పడిన కష్టాలేవీ రైతాంగానికి ఎదురుకావద్దన్నలక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. ప్రధానంగా సాగునీటి విషయంలో అనేక కొత్త ఎత్తిపోతల పథకాలను చేపట్టి రికార్డు టైమ్‌లో వాటిని పూర్తి చేయడం ద్వారా పల్లెర్లు మొలుస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశగా నీళ్ళు మళ్ళిస్తూ పట్టు వదలని ప్రయత్నాలను కొనసాగిస్తూనేఉంది. ఈ రంగంలో రైతాంగం ఎదుర్కుంటున్న అనేక సమస్యల్లో ఒకటైన పెట్టుబడిని ముందుస్తుగానే రైతాంగానికి అందించడం ద్వారా కొనసాగుతున్న ఆత్మహత్యలను కొంతవరకు నివారించగలిగిందనే చెప్పాలి. ఎకరానికి పది వేలరూపాయల చొప్పున సాగుపెట్టుబడి కోసం ముందస్తుగా అందిస్తూనే ఉంది. రైతుల రుణమాఫిని ప్రకటించిన ప్రభుత్వం విడుతలవారిగా దాన్ని కొనసాగిస్తున్నది. అయితే లాక్‌డౌన్‌ ‌కష్టాల్లో సర్కార్‌ ఆర్థిక పరిస్థితికూడా క్షీణించడంతో పూర్తిస్థాయిలో రుణమాఫీకి మరికొంత సమయం పట్టేట్లు కనిపిస్తున్నది. కొరోనాలో కూడా ఈ రంగానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత నిచ్చింది. ఈసారికి వరితోపాటు మొక్కజొన్న, పసుపు లాంటి పంటలను ప్రభుత్వమే కొనుగోలుచేసింది. దీంతో ఈసారి కనీస మద్దతు ధర విషయంలో రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన పనిలేకుండా చేయగలలిగింది. అయితే కొరోనా కారణంగా మాత్రమే ఇప్పుడు కొనుగోలుచేశామని ఇకముందు అలా సాద్యం కాదని చెబుతూనే, రైతులనుండి కొనుగోలుచేసిన ముడిసరుకును వినిమయ వస్తువుగా మార్చినప్పుడు రైతులకు సరైన ధర వస్తుందన్న ఆలోచనతో పౌరసరఫరాల సంస్థ ఆ బాధ్యతను తీసుకునేల చర్యలు చేపట్టే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. దీనివల్ల రైతుకు లాభం జరుగడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు చౌకధరకు లభించే అవకాశాలేర్పడుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు రికార్డు సమయంలో రూపుదిద్దుకోవడంతో ఈసారి పంటల విస్తీర్ణం కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వం అంచనాలకుమించి ధాన్యం ఉత్పత్తి కావడంతో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేకపోయింది.

పర్యవసానంగా రైతాంగం తమ పంటను విక్రయించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. అయినా ప్రభుత్వం మాత్రం చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వడం రైతులకు కొంత ఊరటనిచ్చిన అంశం. సుదీర్ఘకాలం కరువుతో అల్లాడుతున్న తెలంగాణ పంట భూముల్లో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల కారణంగా కరువు ప్రాంతాలన్నిట నీరు సమ్రుద్దిగా చేరుకోవడంతో లక్షలాది ఎకరాలిప్పుడు సాగులోకి వొచ్చాయి. అయితే పాత పద్దతిలోనే వ్యవసాయం చేస్తుండడంతో రైతులకు గిట్టుబాటు కావడంలేదు. ఇదే క్రమంలో ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని కూడా ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే రకం పంట ఎక్కువ మొత్తంలో వేయడంవల్ల డిమాండ్‌ ‌తగ్గి, లాభసాటి కాకుండా పోవడాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాన్ని క్రమబద్దీకరణ చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. వొచ్చే ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌నుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు కూడా. ఏ పంట ఏ ప్రాంతంలో ఎంత వేయాలన్న విషయంలో వ్యవసాయ రంగ నిపుణులు, ఆ శాఖకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాల చర్చలు కొనసాగిస్తున్నది. అయితే ఈ నియంత్రిత సాగు విధానాన్ని కొందరు రైతులతోపాటు, ప్రతిపక్ష పార్టీలుకూడా విబేధిస్తున్నప్పటికీ ఈ విధానంద్వారా రైతాంగానికి తాము లాభాలను తీసుకొచ్చి చూపిస్తామంటున్న ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంలో పట్టుదలతో ఉంది. దీనివల్ల బంగారు తెలంగాణకు బాటలువేయడమవుతుందంటోంది. , కొండపోచమ్మసాగర్‌ ‌రిజర్వాయర్‌ ‌ప్రారంభోత్సవం సిఎం కెసిఆర్‌ ఇదేవిషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అలాగే ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశంలోలేని తరహాలో రైతాంగానికి మరో శుభవార్త తమ ప్రభుత్వం అందజేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఆ ప్రకటనిప్పుడు వ్యవసాయరంగానికి చెందిన ప్రతిఒక్కరిలో ఉత్కంఠతను కలిగిస్తున్నది. రాష్ట్ర అవతరణ రోజున ప్రకటించే అవకాశముందనుకుంటున్న ఆ శుభ వార్తా ఏమై ఉంటుందా అన్నది యావత్‌ ‌తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Reply