Take a fresh look at your lifestyle.

ఈ హైదరాబాద్‌ ‌నగరానికేమవుతోంది?

“హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యే సమయానికి హైదరాబాద్‌ ‌నగరాన్ని చుట్టుకుని వున్న చిన్నాపెద్దా చెరువులు ఆరు వందలకు పైగానే ఉండేవి. ఇంకా బావులు అనేకం ఉండేవి. ప్రాంతాల పేర్లు కూడా వాటిని సూచిస్తూ దూద్భౌలి, పుత్లిబవులి..ఇట్లా వుండటం మనకు తెలిసిందే. 1975 లో జరిగిన సర్వే ప్రకారం చెరువుల సంఖ్య 159కు పడిపోతే, 2000 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 40-60 మధ్యకు చేరుకుంది. ఇరవయ్యేళ్ల తరువాత ఈ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టే దశకు చేరుకుంది. ఇందుకు తార్కాణం మొన్న వచ్చిన వర్షాన్ని ఇముడ్చుకునే నీటి తావులు, వాటి ప్రవాహదారులూ (కాంటూర్లు) అన్నీ భారీ నిర్మాణాలతో కబ్జా కావటమే! వర్షపు చుక్క భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసుకుపోవటమే! అద్భుతమైన రాతి కొండలన్నీ నేలమట్టమయిపోయాయి. అడుగు నేల కనిపించకుండా కప్పేసిన కాంక్రీటు నిర్మాణాలతో కోరి తెచ్చుకున్న విధ్వంసం ఇది.”

2020 అక్టోబర్‌ 13‌న కొన్నిగంటలపాటు ఎడతెగకుండా కురిసిన భారీవాన(అత్యధికం 32సెం.మీ)వల్ల హైదరాబాద్‌ ‌నగర జనజీవితం వరదనీటితో అసాధారణ విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. హిమాయత్‌ ‌సాగర్‌, ఉస్మాన్‌ ‌సాగర్‌ ‌వంటి చెరువులు నిండి అన్ని గేట్లు ఎత్తేయటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా కొన్ని ప్రాంతాల ప్రజలకు దొరకలేదు. దానితో మురుగునీటి కాలవల్లో (నాలాల్లో) వరద పొంగి అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఆరాంఘర్‌ ‌నుంచీ శంషాబాద్‌ ‌వెళ్లే దారిలో వున్న చెరువు గట్టు తెగి పాతబస్తీ లోని అనేక ప్రాంతాలను వరద ప్రవాహంలో ముంచేసింది. సురక్షిత ప్రాంతాలు అనుకునే మధ్యతరగతి ఆవాసాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్‌ ‌కమ్యునిటీల్లోకి కూడా నీళ్ళు వచ్చేసాయి. 2000 లకు పైగా కాలనీలు ముంపుకు గురయ్యాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

చార్మినార్ వద్ద వరద నీరు
చార్మినార్ వద్ద వరద నీరు

చిన్న చెరువుల కట్టలు తెగిపోయాయి. దానితో నగరం నలుమూలలా రహదారులు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులు దెబ్బతినటంతో రాకపోకలు స్తంభించాయి. కొంతమంది వరదలో కొట్టుకుపోతున్న దృశ్యాలు భయాన్ని కలిగించేవిగా వున్నాయి. గోడలు నాని పాత ఇళ్లు కూలిపోవటంతో మరి కొంతమంది చనిపోయారు. నగరం పరిస్థితి ఇలా వుంటే తెలంగాణా వ్యాపితంగా ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా పంటలు నీట మునిగిపోయాయి. చేతికంది వచ్చిన పంట నీటిపాలు కావడంతో వ్యవసాయదారులు కోలుకోలేని నష్టానికి గురయ్యారు. సహాయం కోరుతూ అనేక ప్రాంతాల నుంచీ హెల్ప్ ‌లైన్లకు ఫోన్లు వస్తూనే వున్నాయి. సాయం అందించే వ్యక్తులు, సంస్థలు నిర్విరామంగా వివిధ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయి వున్నారు. బస్తీలలో నివసించే పేదప్రజల ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. జీవనోపాధులు దెబ్బతిన్నాయి. వాహనాలు, వస్తువులు కొట్టుకుపోయాయి. కొంతమంది కట్టుబట్టలతో మిగిలారు. వారు తిరిగి తమ జీవితాల్ని పునర్నిర్మించుకోవటానికి ప్రభుత్వం  నుంచీ మద్దతు అందించేలా ప్రయత్నించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద వుంటుంది.

Hyderabad and Bengaluru NH-44
హైదరాబాద్, బెంగళూరు NH-44

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూస్తుంటే పరిస్థితి ఎంత బీభత్సంగా వుందో కళ్ళకు కడుతున్నాయి.  ఎందుకిలాంటి పరిస్థితి ఏర్పడుతోంది? ఎవరైనా ఈ ప్రశ్న వేసుకోకుండా అసలు వాస్తవం ఎలా అర్థం అవుతుంది? 2000 సంవత్సరం నాటి దృశ్యాలు, పరిస్థితులే మళ్లీ ఎందుకు పునరావృతం అయ్యాయి? అప్పటి విధ్వంసం నుంచీ, పర్యావరణ వేత్తలు, అనుభవ ఇంజినీర్లు చెప్పిన పరిష్కార మార్గాల గురించి, చెప్పిన అంశాలు కార్యాచరణ లోకి ఎందుకు రాలేదు? విశ్వనగరం అంటే ఆధునిక కట్టడాలు, ఆకాశహర్మ్యాలను తలపించే అపార్ట్మెంట్లు, విశాలమైన ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్లు, పెద్ద పెద్ద షాపింగ్‌ ‌మాళ్ళు, కళ్ళు మిరుమిట్లు గొలిపే వంతెనలు, పరిశ్రమలు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు మాత్రమేనా? సహజ వనరుల మాటేమిటి? వాటికి వున్న స్థానం ఏమిటి? వాటిని రక్షించే విధానమేమిటి? ప్రకృతి ప్రకోపిస్తే తీసుకోవాల్సిన జాగ్రతలు ఏమిటి? ఏఏ వ్యవస్థలు దీనికోసం పనిచేస్తున్నాయి? ఇందులో ప్రభుత్వాల బాధ్యత ఎంత ? ప్రజల భాగస్వామ్యం ఎంత? వీటన్నిటి మధ్యా ఉండాల్సిన సంబంధం ఏమిటి? చరిత్ర ఏం చెబుతోంది? దీనికి పూర్తి కారణం మురుగునీటి కాలవల సమీపంలో నివాసం వుంటున్న పేదవర్గాల ప్రజలవల్లనే అని అనుకోవటం అంటేనే వాస్తవాలను అంగీకరించటానికి సిద్ధంగా లేమని అర్థం. వీటన్నిటి గురించి మాట్లాడటమంటేనే స్థిరంగా నిలబడి పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవటం.

floodwater following heavy rains, at Falaknuma, in Hyderabad
హైదరాబాద్ లోని ఫలక్నుమా వద్ద

ఇలాంటి సందర్భాలలో, ఎప్పుడో వందేళ్ళనాటి వరదలతో పోల్చి చూస్తుంటాము. నిజమే, 1908 లో వచ్చిన వరద వాతావరణ పరిస్థితే ఇప్పుడూ వుంది. కానీ, ఆనాటి విధ్వంసం ప్రకృతి పరమైనది. అయినా, అప్పటి నిజాం నవాబు భవిష్యత్తులో వరద ముంపుకు గురికాకుండా తీసుకున్న అనేక రక్షణ వ్యవస్థల గురించి ప్రస్తావించుకుని తీరాలి. అయితే, ఇప్పుడు జరిగినది కేవలం ప్రకృతి మీద మాత్రమే నెపం నెట్టేయటానికి లేదు. అత్యంత తీవ్రమైన మహా మానవ తప్పిదం ఇది. వందేళ్ల వెనక్కి కూడా వెళ్ళనవసరం లేదు. 2000 సంవత్సరంలో వచ్చిన వరద గుణపాటాలను పరిశీలిస్తే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పిదం ఎక్కడ జరుగుతోందో, మళ్లీ అవే సంఘటనలు ఎందుకు పునరావృతమవుతున్నాయో అర్థం చేసుకోవటం పెద్ద సమస్య కాదు.
హైదరాబాద్‌ ‌నగరం అంటేనే కోట్లాది సంవత్సరాలనాటి రాతి కొండలు, వాటిని చుట్టుకుని వుండే చిట్టడవులు, సమృద్ధిగా నీళ్ళతో వుండే చెరువులు. ఇది ఒకప్పటి రూపు. కానీ అవన్నీ ఇప్పుడు మనం ఫోటోలలో చూసుకోవాల్సిందే. 1948లో హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యే సమయానికి హైదరాబాద్‌ ‌నగరాన్ని చుట్టుకుని వున్న చిన్నాపెద్దా చెరువులు ఆరు వందలకు పైగానే ఉండేవి. ఇంకా బావులు అనేకం ఉండేవి. ప్రాంతాల పేర్లు కూడా వాటిని సూచిస్తూ దూద్భౌలి, పుత్లిబవులి..ఇట్లా వుండటం మనకు తెలిసిందే. 1975 లో జరిగిన సర్వే ప్రకారం చెరువుల సంఖ్య 159కు పడిపోతే, 2000 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 40-60 మధ్యకు చేరుకుంది. ఇరవయ్యేళ్ల తరువాత ఈ సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టే దశకు చేరుకుంది. ఇందుకు తార్కాణం మొన్న వచ్చిన వర్షాన్ని ఇముడ్చుకునే నీటి తావులు, వాటి ప్రవాహదారులూ (కాంటూర్లు) అన్నీ భారీ నిర్మాణాలతో కబ్జా కావటమే! వర్షపు చుక్క భూమిలోకి ఇంకే మార్గాలన్నీ మూసుకుపోవటమే! అద్భుతమైన రాతి కొండలన్నీ నేలమట్టమయిపోయాయి. అడుగు నేల కనిపించకుండా కప్పేసిన కాంక్రీటు నిర్మాణాలతో కోరి తెచ్చుకున్న విధ్వంసం ఇది.

floodwater following heavy rains at Falaknuma in Hyderabad
హైదరాబాద్ లోని ఫలక్నుమా వద్ద భారీ వర్షాల తరువాత వరద నీరు

ఇక్కడ, నిజాం కాలంలో నిర్మించిన కొన్ని పెద్ద చెరువులు, వాటి ప్రత్యేకతల గురించి చెప్పుకుందాం. వ్యవసాయంతో పాటు కంటోన్మెంట్‌ ఏరియా తాగునీటి అవసరాల కోసం జీడిమెట్ల దగ్గర వున్న ఫాక్స్ ‌సాగర్‌ (‌నక్కల చెరువు)ని 1897 లో నిర్మించి, దాని రక్షణ కోసం పకడ్బందీ వ్యవస్థను ఏర్పరచారు. 1897లోనే నిర్మించిన మిరాలం చెరువు నగరానికి నీరందించడమే కాకుండా, చెరువు చుట్టూ ఆనకట్టని మట్టితోనే చెక్కుచెదరకుండా కట్టారు. తర్వాతి కాలాల్లో వీటి విస్తీర్ణం కబ్జాలతో తగ్గిపోయింది. 1920లో నగర శివార్లలో మూసీ నదీ పరివాహకం కింద 219 చదరపు మీటర్లలో నిర్మించిన ఉస్మాన్‌ ‌సాగర్‌(‌గండిపేట), 1926లో ఈసీనది పరివాహకం కింద 505 చదరపు మీటర్లలో నిర్మించిన హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయాలు వివిధ రకాల నిర్మాణాలతో (ప్రధానమైనది ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌) ‌తమ వైశాల్యాన్ని కోల్పోతున్నా కూడా ఇప్పటికీ ఇంకా నగర ప్రజల దాహార్తిని తీరుస్తూనే వున్నాయి. 15వ శతాబ్దిలో హుస్సేన్‌ ‌షావలి చే నిర్మించబడిన హుస్సేన్‌ ‌సాగర్‌ ఇప్పటి ట్యాంక్‌ ‌బండ్‌. ఒకప్పుడు స్వచ్చమైన తాగునీటిని అందించిన ఈ సరస్సు కాలక్రమేణా మురికి కూపంగా మారిపోవటం ఎవరి పాపం! ఇంకా నగరం చుట్టూ వున్న అనేక చెరువులన్నీ కూడా రియల్‌ ఎస్టేట్‌ ‘అభివృద్ధి’ రథచక్రాల కింద పడి కనుమరుగు అయిపోయాయి. హిందూ ముస్లింల సమైక్యతకు గుర్తుగా ‘బౌలీ’ లుగా ప్రత్యేకపేరు పడ్డ బావులన్నీ ఏనాడో మాయమయి పోయాయి.

flood-hit Meerpet area on the city outskirts
మీర్పేట్ ప్రాంతం

సహజ వనరులను ప్రత్యేక విధానాలతో రక్షించవలసిన ప్రభుత్వాలు అత్యంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్‌ ‌రాష్ట్రాన్ని ఆంధ్రప్రాంతంతో కలిపి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్‌ ‌రాష్ట్రంగా మార్చటం వల్ల కూడా ఈ ప్రాంతపు ప్రత్యేకతను వలస పాలకులు గుర్తించకపోగా కొండలు, చెరువులు, భూమి, వాటి చూట్టూ పెనవేసుకున్న సంస్కృతి..ఇలా అన్నిటి విధ్వంసానికి కారణమయ్యారు. అయితే, ఇది కేవలం పాలకుల వల్ల మాత్రమే జరిగిన నష్టం కాదు. సహజ వనరుల ఉనికి పట్ల గౌరవాన్ని, వాటిని రక్షించటంలో తమ పాత్ర కూడా ఉంటుందన్న స్పృహ కోల్పోయిన ఉన్నత, మధ్య తరగతి ఆధిపత్య మనస్థత్వం కూడా దీనికి కారణం. ఇందుకు బలమైన ఉదాహరణ పెరిగిన రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం. పంట పొలాల్లో, నీటి పరీవాహక ప్రాంతాల్లో, చెరువులను కూడా పూడ్చివేసి వెలసిన నివాస ప్రాంతాలు. కానీ, ఈ అంశాన్ని వొప్పుకోవటానికి అంగీకరించని ఈ వర్గాలు నివాస హక్కులకు దూరమై, కనీస ఆవాసం కోసం కాలవల పక్కన, లోతట్టు ప్రాంతాల్లో నివసించే పేద, శ్రామిక ప్రజల వల్లనే ఈ విపత్తు ఏర్పడుతోందని నెపం వారిమీద వేస్తూ  విరుచుకు పడుతూ వుంటారు. ఆక్రమణలతో నాలాలు, పరీవాహక ప్రాంతాల్లో వెలసిన పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాల్ని, మల్టీ ప్లెక్స్ ‌నిర్మాణాలనీ పట్టించుకోని అధికార యంత్రాంగం, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు పేదప్రజలను వారి అతిచిన్న నివాస ప్రాంతాల నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతారు. బుల్డోజర్లతో వారి నివాసాలను నేలమట్టం చేస్తారు. పోలీసు బలగాల సహాయంతో నిర్బంధ పూరితంగా ఇలాంటి సందర్భంలో వీరికి హటాత్తుగా పర్యావరణం, ప్రకృతి అనే అంశాలు గుర్తుకు వచ్చి వాటి రక్షణ తమ భుజస్కందాల మీదే వున్నట్టు భావిస్తారు.

Hyderabad and Bengaluru NH-44
హైదరాబాద్, బెంగళూరు NH-44

తెలంగాణా ప్రత్యెక రాష్ట్రమైన తర్వాతైనా జరిగిన నష్టాన్ని అరికట్టే దిద్దుబాటు చర్యలకన్నా, విద్వంసాన్ని మరింత పెంచే విధానాలే ముందుకు వెళుతున్నాయి. వేలాది పంట భూములు పారిశ్రామిక పార్కులుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. పైపైన సుందరీకరణకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆయా సహజ వనరుల రక్షణకు ఇవ్వడం లేదు. నగర నిర్మాణంలో అత్యంత బరువుని, భారాన్ని మోసే పేద ప్రజల జీవితాలకు ఏ నివాస హక్కులూ వుండటం లేదు. ఫలితం మన కళ్ళ ముందే వుంది. కనీసం ఇప్పటికైనా ప్రకృతి, సహజ వనరులు, సామాన్య ప్రజల మనుగడను నగర అభివృద్ధిలో తప్పనిసరి బాధ్యతగా, హక్కుగా చూసే హైదరాబాద్‌ ‌మహానగర ప్రణాళికను సర్వ సమగ్రంగా ముందుకు తీసుకురావటానికి సిద్ధపడతారా?? లేకపోతే, ప్రకృతి ఇలా సూటిగానే తిరిగి సమాధానం ఇస్తుంది.

Leave a Reply