Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో ఏం జరిగింది.. ?

ఎంతో హడావిడిగా ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వరంలో, నిర్ణయాల్లో ఎందుకు మార్పువొచ్చిందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ. ఢిల్లీ సర్కార్‌తో అమీతుమీ తేల్చుకుంటామంటూ చేసిన ప్రకటనకు మౌనమే సమాధానమైంది. ఢిల్లీలో ప్రధాని మోదీ సమ్మోహనాస్త్రమేదైనా సంధించాడేమోగాని అంతవరకు చెలరేగిన మాటలకు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. కాగా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తమ బాట పట్టినందుకు బిజెపి హర్షం వ్యక్తం చేస్తుంటే, కేంద్రానికి అంత భయపడి తన నిర్ణయాలను ఎందుకు మార్చుకోవాల్సివొచ్చిందో బహిరంగ పర్చాలని కాంగ్రెస్‌ అం‌టోంది. నిన్నటి వరకు రైతు పక్షపాతిగా, రైతే సర్వస్వం అన్నట్లుగా ప్రవర్తించిన ముఖ్యమంత్రికి, సాక్షాత్తు దేశరాజధానిలో నెలరోజులుగా అనేక బాధలకు ఓర్చుకుని కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నవారి గోష ఎందుకు వినిపించలేదంటూ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రైతుకు ఏమాత్రం నష్టం కలిగించమని నిన్నటివరకు చెప్పిన ముఖ్యమంత్రి ఇవ్వాళ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేసేదిలేదని ప్రకటించడమేంటన్నదే ఎవరికీ అంతుబట్టని ప్రశ్న.

ఎప్పుడో 2004లోనే కాంగ్రెస్‌ ‌హయాంలో పంట ఉత్పత్తులను కళ్ళాల వద్దే కొనుగోలు చేయాలన్న లక్ష్యంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్లనిప్పుడు ఎత్తివేయాలని సిఎం నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే రైతులపై ఆయనకేపాటి ప్రేమ ఉందన్నది స్పష్టమవుతున్నదంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో ముందు వరుసలో నిలబెడుతానని, ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకం అయ్యేలా తీర్చిదిద్దుతానంటూ, అందులో భాగంగా పంట మార్పిడిని ప్రోత్సహించి మంచి ఫలితాన్ని సాధించానని చెప్పుకున్న ముఖ్యమంత్రికిప్పుడేమైందన్నదే ప్రధాన చర్చనీయాంశం.

రైతులు ద్విగిణీకృత లాభాలను ఆర్జించే దిశకు తీసుకుపోతానన్న వ్యక్తి ఇప్పుడు పంట కొనుగోల్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వేల అయిదు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రకటించడం చూస్తుంటే, ప్రభుత్వం రైతులను ఆదుకోవటమన్నది వ్యాపార దృష్టితో చూస్తున్నట్లు కనిపిస్తున్నదని, అలా అయితే ఇక ప్రభుత్వమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు నష్టంకలిగించే విధంగా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రూపొందించడాన్ని తానే ముందస్తుగా వ్యతిరేకించానని చెప్పుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఈ విషయంలో విపక్షాలతో విశాలమైన సమావేశాన్ని నిర్వహిస్తానని చేసిన ప్రకటనను ఎందుకు విస్మరించారన్నదానికి ప్రతిపక్షాలు సమాధానాన్ని వెతుకుతున్నాయి. కేవలం విస్మరించడమే కాకుండా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఎదో రహస్యం దాగి ఉందంటున్నారు.

దుబ్బాక, జీహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న టిఆర్‌ఎస్‌, ‌బిజెపి దూకుడుకు బెంబేలు పడిపోయినట్లు కనిపిస్తున్నది. రాజకీయ వ్యూహరచనలో అందెవేసిన చెయ్యిగా పేరున్న కెసిఆర్‌ ‌బిజెపి దూకుడును అడ్డుకునేందుకే కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా మొదటినుండి ఢిల్లీలో దోస్తీ, గల్లిలో వివాదంలా బిజెపితో టిఆర్‌ఎస్‌ ‌వైఖరి ఉన్నవిషయం తెలియంది కాదు. అందుకే ఢిల్లీ దోస్తీని మరోసారి పటిష్టంచేసుకునేందుకే ఆయన ఇటీవల ఢిల్లీ పర్యటన అయి ఉండవొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పాలకుల మెప్పు పొందేందుకే ఆయన తనకిష్టం లేకపోయినా కేంద్రం పాలసీలను అమలు ర్చాలన్న నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తోందంటున్నారు. అందుకే కేంద్ర చట్టాన్ని అమలు చేయకతప్పదన్న భావన వొచ్చే విధంగా ఆయన తన మాటల్లో, చేతల్లో మార్పు తీసుకువొస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో రైతాంగ వ్యతిరేకతను టిఆర్‌ఎస్‌పైన కాకుండా బిజెపివైపుకు మళ్ళించే ఎత్తుగడగా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండవొచ్చన్న విశ్లేషకుల అబిప్రాయాన్ని కాదనలేము.

kcr meets pm modi in delhi

ఏదిఏమైనా కెసిఆర్‌ ‌నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ‌తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తాము మొదటినుండీ చెబుతున్నట్లు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య రాజకీయ అవగాహన ఉందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా కాంగ్రెస్‌ ఎత్తిచూపుతోంది. అందుకే కేంద్ర అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్న కెసిఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఈ నెల 30నుండి కొత్త సంవత్సరం జనవరి ఏడవ తేదీవరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే జిల్లా కేంద్రాల్లో ఈ నెల 11న నిరసనలు చేపట్టి, 18న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, బుధవారం ఢిల్లీ సర్కార్‌ ‌రైతు నాయకులతో సమావేశం కానుంది. ఇదే చివరి సమావేశం అవ్వాలని, రైతులకు అనుకూలంగా ఈ చర్చలు జరుగాలని ఆకాంక్షను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

Leave a Reply