Take a fresh look at your lifestyle.

కొరోనా యేం జెప్పింది!?

“దాసుకున్న ముల్లెలున్నా ,డాబుసరి బతుకులున్నా, బంగ్లమీద బంగ్లలున్నా, గరీబోళ్ళ గుడిశెలున్నా కొరోనా కంట్ల బడి, కాడు పిలిషిందంటె ఎనుక ముందు జూడు ఎవలుండరు! కనిపెంచిన పేగుబంధమని జూడకుంట ముసలిదని సూడకుంట అవ్వను వూరి బాయికాడ ఇడిశిపెట్టంచ్చిండొకడు,వూరుగానూర్లె కాట గలిపచ్చిండొకడు! మనిషెనోటోడు మాయమైండని రాషిన అన్నకు మొక్కాలె! గా రాషిందే ఈడ కానత్తాంది.”

vikramarkaమనిషి లోపట్నించి మనిషిని గుంజి నిలబెట్టజూషింది కొరోనా. మనిషి లోపల మనిషి యేడున్నడు!?వున్నడంటె అది ఒల్లెక్కాల మాటే! మనిషి లోపటీకనో తొంగి జూడబోతె షీము,నెత్తురే గని మనిషి లచ్చనాలు జరంత సుత కానత్తలేవనేటి సత్తెం ఇవరంగ జెప్పింది కొరోనా! లోపటి బందాల లోతుపాతులు గుంజి బజార్న బడేషి మనిషి పోట్వో తీషింది కొరోనా! పగోనికి సుత ఇసొంటి సావద్దు దేముడా!అని మొక్కెటట్టు జేషింది.కొరోనా సావు సత్తె కన్న కొడుకే గాదు,కట్టుకున్న పెళ్ళాంసుత కాటి కాడికి రాకుంటబోయిరి. చెత్తేసుక బోయేటి బండ్లె సచ్చిన కుక్క పీన్గ తీర్గ గొరగొర గుంజుకబోయి కాల్షి బుగ్గి జేత్తిరి.దిక్కు దివానం లేని పీనుగలు కుప్పలుబోషి కట్టెకాల్షిండ్లు.కుండబట్టుడేమాయె! కర్మకాండలేమాయె! బొక్కలేరుడేమాయె!దింపుడు గళ్ళమేమాయె! అరే వారీ!మనిషీ! ఇవన్నిజేయకున్నా,జేషినా కాలే కట్టె ఆరేదిగాదు! ఎరుకైందా! అని అడిగినట్టే గొడ్తాంది.కరోనా సావత్తె అయ్యో!అనెటోళ్ళు సుట్టాలు,పక్కాలు సుత కానరారైతిరి. ఎసొంటి సావైనా సరెగని,కరోనా సావు సావద్దని వెయ్యినొక దేముల్లకు మొక్కందెవలు!కొరోనా కాలంల మనిషి బతుకుతీరే బొత్తిలెకు మారిందుల్లామనిషికి బతుకు మీది తీపిని పరీచ్చ బెట్టింది! అందరి మనుసు లోపటి గూట్లె దాసుకున్నదల్లా ఒక్కటే!  ఆశ!..బతి కుంటె సాలనే ఆశ! గా ఆశ సావకుంటుంటె దింపుడుగళ్ళం మీంకేలి కూడ లేపి కూకుండ బెడుతదంటరు! దాసుకున్న ముల్లెలున్నా ,డాబుసరి బతుకులున్నా, బంగ్లమీద బంగ్లలున్నా, గరీబోళ్ళ గుడిశెలున్నా కొరోనా కంట్ల బడి, కాడు పిలిషిందంటె ఎనుక ముందు జూడు ఎవలుండరు! కనిపెంచిన పేగుబంధమని జూడకుంట ముసలిదని సూడకుంట అవ్వను వూరి బాయికాడ ఇడిశిపెట్టంచ్చిండొకడు,వూరుగానూర్లె కాట గలిపచ్చిండొకడు! మనిషెనోటోడు మాయమైండని రాషిన అన్నకు మొక్కాలె! గా రాషిందే ఈడ కానత్తాంది.

మనిషి పానంకన్నా పైకమే యెక్కువై మనిషి  లచ్చనా లు మంట్లె గలిషినయి, మనిషికి బతుకు మీదాశ సావదని యెరుకున్నోళ్ళు గావట్టె పెద్ద దావకాన్లు, వైద్దులు పీనుగలతోని సుత యాపారం జేయబట్టిండ్లు.కానుపుకనిబోతె కరొనని జెప్పి ఆడిమనిషిని అరిగోస బుచ్చుకొని లచ్చలల్లరూపాలు పీజుల కింద గుంజిండ్లు. అనుమానంతోని బోతె నిన్న మంచిగున్నోళ్ళు ఇయాల కొరోనచ్చినోళ్ళయితరు.లచ్చలు గడితెనె  పీనుగప్పజెపుతమని, లేకుంటె లేదని ఆగం జేషిన దావకాన్లున్నయి. దావకాన్ల వైద్దుల తెల్ల కోట్లెనుక బతికున్న నెత్తురు పిండుకునే రాచ్చసులున్నరని గాళ్ళ పేపర్లే మొత్తుకున్నయి. బతికున్న మనిషైనా, సచ్చిన పీనుగైనా పైకం పిండుడొక్కటే గాళ్ళకుండేటి ఇగురమని అందరికి మాగనే యెరుకైంది. పయివేట్‌ ‌దావకాన్ల సంగతి జెప్తం! యేత్తం!తీత్తం! అనేటి సర్కార్‌ ‌పోశెట్టి కతలు వడుడం తుపాకిరాముని ఏతుల తీర్గున్నయి.పయివేట్‌ ‌పెద్ద దావకాన్లన్ని సర్కార్‌ ‌పెద్దోళ్ళ  సుట్టాలయే అయినంక దావేడిది?, పిర్యాదేడిది?. !ఒల్లెక్కాలకు ఒకటో రొండో చిల్లర మల్లర దావకాన్ల మీద కేసులునూకి షేతులు దులుపుకున్నది సర్కార్‌.  ‌పైసల కోసం పీక్క దినబట్టెనని దినాం  టీ.వీ.ల కానచ్చి సి.యెం.సారోళ్ళ సుట్టం పోస దావకానపొంటి ఒక్క పోలీసు బోలే!ఒక్క కేసు సుత గాలే! కొరోనా సునామిల గరీబోళ్ళ బతుకులే మళ్ళింత గాడి దప్పినయి.

పనిజేసుకోని బతికేటి కులాల బతుకు లేకుంట జేషింది. ఊర్లె ఉత్పత్తి కులాల బతుకు మీద కొరోనా కత్తి దూషింది. మంగలి లచ్మయ్య మైలపోలు దీయబోలె!గడ్డం గీయబోలె! సాకలి యాకయ్య బట్టలుతుక బోలె!ఇస్త్రి పెట్టె తెర్వబోలె! మేర మల్లేశం కుట్టుమెషీన్‌ ‌గిర్ర గింత సుత తిరగకపాయె! ఊల్లె యే కులపోల్లకు సుత పనులు లేవాయె! ఊర మూగవోయి సావైన యింటి తీర్గున్నది.పట్నం మొగాన  ప్రయివేట్‌.‌బళ్ళు ఆన్‌ ‌లైన్‌ ‌సదువులు నడుపుతనే వుండె,పంతుళ్ళ బతుకులు ఆగంజేయబట్టె!ఇంట్లె పైసలేక మొగం జెల్లక, చేసిన అప్పులకు వడ్డీలు గట్టే టందుకు కొత్తలు లేకమస్తు మంది ప్రయివేట్‌ ‌బడి పంతుళ్ళు జీవిడిషిండ్లు. మందు దుకాండ్లు, రిజస్ట్రేషన్లు మాగనే నడిశినయి సర్కార్‌ ఆమ్దానికి లోటు లేదు.పెద్ద దందాలల్ల సంపాయించుకోని బతికేటోళ్ళకు రికాం లేదు. కొరోనా బుగులు సల్లవడి, సావుల లెక్క జరింత గెరువైందని మెల్లంగ జనం పనుల జాడకు బయలెల్లెటాలకు వాన లు బగ్గగొట్టె! బతుకు మళ్ళ చెయిజారె! నెత్తి నోరు గొట్టుకోని దుక్కపడేటాలకు సర్కార్‌ ఎల్లారెస్‌ ‌పేరుమీద కొత్తంగ వసూళ్ళకు దిగింది. మనిషి తనకు తాను కాపాడుకునుడెట్లరా దేముడా! అనుకుంటె బూమిని కాపాడుకునె కొత్త తిప్పలెదురాయె! ఛలో! బూముల లెక్కల్‌ ‌దీయిమనుకుంట సర్కారే కొత్త రకం దందాకు దిగింది. గీ బూముల ఎల్లారెస్‌ ‌దందా జూడబోతె  రాజుల కాలం యాదికి రాబట్టె!బూమి వున్నదంటె శిస్తు గట్టాలె! లేకుంటె బూమి మీద హక్కుదారు గోల్పోవుడేనటని వూల్లెల్ల పుకారే లేశింది. ఇంకో ఐదారేండ్ల దాంక యాది మర్వకుంట మనిషి బతుకులనాగం జేషింది కరోనా!అదే సందుల సడేమియాని సర్కార్‌ ‌సుత కరోనా కన్న జరింత యెక్కువనే దోసుకున్నది.

సూడ్రా !బయ్‌!ఇ‌క్రమార్క్’’!
‘‘ఇప్పటిదాంక యింటివి గదా! కొరోనా సంక్షోభం మనిషి బతుకును ఆగంజేషిందంటిరిగదా! సంక్షోభాన్ని సొంతలాభానికి మల్సుకున్నదెవరు!?జవాబు జెప్పినంకనే కదలాలె! లేకుంటె ఇంగ మళ్ళ బోయో చెట్టెక్కుడే! అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! ‌సంక్షోభాన్ని సొంతలాభానికి మల్సుకున్నదెవలో జనానికి యెరుకైంది. రైతు,కార్మిక వ్యతిరేక చట్టాలు జేషిన పై సర్కారున్నది. సంక్షోభంల జనాన్ని కాపాడేటందుకు ముందస్తు జాగ్రత్త లేకపోయింది,పెరిగి ప్రమాద ఘంటికలు మోగినంక నిధులు ఖర్చు చేయలేదు.  లాక్‌ ‌డౌన్‌ ‌కాని లాక్‌ ‌డౌన్‌ ‌బెట్టి ప్రయివేట్‌ ‌యాపారాలు మూతేసి ,కార్మికుల ఉపాధిని దెబ్బతీసిండ్లు.  నడుస్తున్న ఔషధ పరిశ్రమల మార్కెట్‌ అం‌తర్యుద్ధంల జనం బలిపశువులయిండ్లు అని జెప్పుకుంట నడ్వ బట్టిండు…నడ్వ బట్టిండు…
 – ఎలమంద, తెలంగాణ

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply