Take a fresh look at your lifestyle.

‘‌వీళ్ల జాతకాలు ఎట్లున్నయ్‌…’

  • శృంగేరి పీఠానికి భారాస ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా?
  • 45 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్?
  • ‌వీరి స్థానంలో కొత్త వారికి, యువతకు, వారసులకు ఛాన్స్ ఇచ్చే యోచనలో సిఎం కేసీఆర్‌

(ఎ.‌సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్‌ / ‌ప్రజాతంత్ర): భారత రాష్ట్ర సమితి(భారాస) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)‌కు జ్యోతిషం, ముహూర్తాలు, జాతకాలపై ఉండే అపారమైన నమ్మకం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాస్తు, జ్యోతిషం, జాతకాలపై కేసీఆర్‌కు ఉన్నంత విశ్వాసం మరే రాజకీయ నేతకు, ముఖ్యమంత్రికి ఉండదని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. అయితే, కేసీఆర్‌కు వాస్తు పిచ్చి ఎక్కువని..వాస్తు భయంతోనే సచివాలయానికి వెళ్లడం లేదని విపక్షాలు ఎంతగా విమర్శించిన ఆయన పట్టించుకోని సంగతి విధితమే. జ్యోతిషం, జాతకాలను అపారంగా నమ్మే సిఎం కేసీఆర్‌…‌రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారాస తరపున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి జాతకాలకు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలనుకున్న అభ్యర్థులకు సంబంధించిన పేర్లతో కూడిన ఓ జాబితాను శృంగేరి పీఠానికి పంపించినట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు గురువారమిక్కడ ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి. సహజంగానే వాస్తు, దోషాలు, యజ్ఞయాగాలను ఎక్కువగా నమ్మే కేసీఆర్‌…‌వొచ్చే ఎన్నికల్లోనూ తిరిగి ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.

ఎక్కడ కూడా చిన్నపాటి పొరపాటుకు కూడా తావులేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలను చాలా పకడ్బందీగా తీసుకుంటూ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యేల అభ్యర్థుల జాతకాలను తెలుసుకోవడానికి పోటీలో దింపే అభ్యర్థుల పేర్లను శృంగేరి పీఠానికి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో నియోజకర్గం నుంచి ఒక్కరు, ఇద్దరేసి పేర్లతో కూడిన జాబితాను శృంగేరి పీఠానికి పంపించారనీ, ఎవరి జాతకం ఎట్లుంది? ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుస్తారనే దాని గురించి జాతకాలు చెప్పాల్సిందిగా శృంగేరి పీఠాన్ని సిఎం కేసీఆర్‌ ‌కోరినట్లు సమాచారం.  రాష్ట్రంలో 119అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే…2018లో జరిగిన ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 88మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగా…తర్వాత ఇతర పార్టీలకు చెందిన మరి కొంత మందిని బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 103కు చేరింది. అయితే, రానున్న ఎన్నికల్లోనూ ఈ సంఖ్యకు తగ్గకుండా ఉండేందుకు ఇప్పటికే సిఎం కేసీఆర్‌ ‌తనదైనశైలిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నియోజకవర్గాలు, అభ్యర్థుల వారీగా ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఉంటే గెలుస్తారనే అనే దానిపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే తెప్పించుకున్న సిఎం కేసీఆర్‌…‌టికెట్‌ ఇచ్చే అభ్యర్థి జాతకం ఎలా ఉందో తెలుసుకునే నిమిత్తం ఎమ్మెల్యేల అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను శృంగేరి పీఠానికి పంపించినట్లు, సిఎం కేసీఆర్‌ ‌పంపించిన జాబితాను కూడా శృంగేరి పీఠం పరిశీలించినట్లు తెలుస్తుంది. అయితే, శృంగేరి పీఠం సూచించిన దాని ప్రకారం వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చే ఆలోచనలో సిఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం.

ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో…45 మంది సిట్టింగ్‌లకు నో ఛాన్స్?
‌వొచ్చే అసెంబ్లీ ఎన్నికలను సిఎం కేసీఆర్‌ ‌చాలా ప్రతిష్టగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సాధించాలన్న  గట్టి పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. వొచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నం చేస్తుంటే సిఎం కేసీఆర్‌ ‌మాత్రం వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగవలసిన బలమైన అభ్యర్థులు ఎవరు? ఎవరిని రంగంలోకి దింపితే విజయం సాధిస్తాం? ఏ ఎమ్మెల్యేల మీద ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది? అంగబలం, అర్థబలం ఉన్న నాయకులు ఎవరు? ఎవరిని అభ్యర్థిగా చూపిస్తే వోటర్లు ఈజీగా వోట్లు వేస్తారు?  వంటి వివరాలను ఇప్పటికే  తెలుసుకున్నట్లు సమాచారం. సర్వేలు, ఇంటెలిజెన్స్ ‌నివేదికల ఆధారారంగా  ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులకు ప్రజలలో ఉన్న మద్దతును బేరీజు వేసుకుని వొచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని •కేసీఆర్‌ ‌చెప్పినప్పటికీ…పనితీరు సరిగా లేని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చి, ఆ స్థానంలో స్థానికంగా పట్టున్న, బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కేసీఆర్‌ ఓ ‌నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల జాతకాలను, నియోజకవర్గాలలో వారి పరిస్థితిని, ప్రజలలో వారికి ఉన్న పట్టును అధ్యయనం చేసినట్లు తెలుస్తుంది.  ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 45మంది  పని చేయని ఎమ్మెల్యేల చిట్టా సిఎం కేసీఆర్‌ ‌వద్ద ఉన్నట్టు పార్టీ శ్రేణులలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనుల్లో బిజీగా ఉన్న, ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైన ఎమ్మెల్యేల జాబితా సిఎం కేసీఆర్‌ ‌వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. వీరిని పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరించినప్పటికీ వీరిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో…ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వొచ్చే ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెట్టానే కఠిన నిర్ణయానికి కేసీఆర్‌ ‌వొచ్చారని సమాచారం. బిఆర్‌ఎస్‌కు ఉన్న 103మంది ఎమ్మెల్యేలలో వొచ్చే ఎన్నికల్లో 45మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ ‌దక్కకపోవచ్చని సమాచారం. వారి స్థానంలో కొత్తగా యువతకు, కుల సమీకరణల ఆధారంగా, మరికొన్ని చోట్ల వారసుల(ఇప్పుడున్న ఎమ్మెల్యేల కొడుకులు, కూతుళ్లు, భార్యలు)కు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

చావో రేవో…
టిఆర్‌ఎస్‌ ‌పార్టీని సిఎం కేసీఆర్‌ ‌భారత రాష్ట్ర సమితి(భారాస)గా మార్చిన విషయం విధితమే. భారాసను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సిఎం కేసీఆర్‌ ‌తనకున్న రాజకీయ అనుభవాన్ని మొత్తంగా రంగరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారాస విస్తరించాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌మరోసారి తన సత్తాను చాటి తిరిగి అధికారంలోకి రావాలి. దీంతోనే వొచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సిఎం కేసీఆర్‌  ‌ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ..ముచ్చటగా మూడవసారి మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించాలని భావిస్తున్నారు. వొచ్చే ఎన్నికల నేపథ్యంలో గతానికి భిన్నంగా చాలా సీరియస్‌గా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడంతో పాటు జాతకాలను కూడా చూపెడుతున్నట్లు తెలుస్తుంది. మరో ఐదారు నెలల్లో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చావో రేవో అన్నట్టుగా ఉండనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంపై కేసీఆర్‌ ‌నివేదికలు తెప్పించుకొని, వొచ్చే ఎన్నికల అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితులను లోతుగా పరిశీలిస్తే సిఎం కేసీఆర్‌ ‌వొచ్చే ఎన్నికలకు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు,  అందుకే ఒకటికి నాలుగుసార్లు సర్వేల ద్వారా అభ్యర్థుల జాతకాలు తెలుసుకుంటున్నట్లు సమాచారం.  ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వొస్తామన్న ధీమా ఉన్నప్పటికీ విజయం అంత ఈజీ కాదని గులాబీ బాస్‌ ‌గ్రహించారనీ, ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం జాతకాల మంత్రం జపిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వొచ్చే అసెంబ్లీ ఎన్నికలను సిఎం కేసీఆర్‌ ‌చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు అభ్యర్థుల జాతకాలు చూపెడుతుండటంతోనే తెలుస్తుంది.

Leave a Reply