Take a fresh look at your lifestyle.

“బడి చదువులు” ఏం కానున్నవి!?

“రాష్ట్రంలోని 6 నుండి పది తరగతులకు చెందిన  లక్షలాదిమంది పాఠశాల విద్యార్థులు, ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్ లైన్ విధానానికి సంసిద్ధం కావాలని ప్రభుత్వం అన్యాపదేశంగా సూచనలు చేస్తుంది.ఆన్ లైన్ విద్య పైనే ఆధారపడి జూన్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని లీక్ లు వదులుతూంది.ప్రతి తరగతికి చెందిన పాఠ్యపుస్తకాలలోని వివిధ పాఠాలకు ప్రత్యేకంగా “క్యూ ఆర్ కోడ్” లపు ముద్రించిన కొత్త పాఠ్యపుస్తకాలు అందచేయనున్నారు.  ఇందుకోసం గత ఆరు నెలలుగా ఎస్.సి.ఇ.ఆర్టి. కేంద్రంగా పకడ్భందీగా కార్యశాల నిర్వహిస్తున్నట్టు తెలుస్తూంది “

  • నిర్వీర్యమయిన విద్యా సంవత్సరాలు
  • ఆచరణలో విఫలమైన ఆన్ లైన్ ప్రణాళిక
  • లక్షలాది పేద విద్యార్థులు విద్య కు దూరమయ్యే ప్రమాదం
  • భౌతిక మౌలిక వసతుల కల్పనలో సర్కార్ అశ్రద్ధ

వాడపల్లి అజయ్ బాబు…’ప్రజాతంత్ర ‘ప్రత్యేకం

కొరోనా సృష్టించిన సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోలేని ప్రభుత్వాల అవగాహనారాహిత్యం,అశాస్త్రీయ ఆచరణల ఫలితంగా లక్షలమంది పేద విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమయ్యారు.కొరోనా విజృంభణతో అన్ని రంగాలతో పాటు విద్యారంగానికి కూడా సవాళ్ళు ఎదురయ్యాయి.రెండు విద్యాసంవత్సరాల్లో ఒకటి పాక్షికంగా,రెండవది పూర్తిగా నిర్వీర్యమైంది. పదిహేను నెలల కాలంగా విధ్వంసానికి గురవుతున్న విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు రేపటి నూతన విద్యా సంవత్సరాన్ని మెరుగైన ప్రణాళికలతో ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం విద్యారంగ మేధావులు, విద్యాబోధనా కార్యక్షేత్రంలో ప్రత్యక్షంగా పాల్గొనే ఉపాధ్యాయులు,ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ సంఘాల నేతలు,తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వాలు అందరికీ ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపొందించాల్సి వుంది.ఆ కార్యాచరణ పేదవిద్యార్థుల,ప్రభుత్వబడుల సంక్షేమం ఆశించేదిగా వుండాల్సింది.

ఇటీవల ఆచరణలో విఫలమైన ఆన్ లైన్ ప్రణాళికలనే మెరుగులు దిద్ది,తిరిగి ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అది పూర్తిగా కార్పోరేట్ పాఠశాలలలకు, ఆన్ లైన్ విద్య వ్యాపార కేంద్రాలకు అనుకూలంగా మారుతుంది.కొరోనా విపత్తు విలయం సృష్టిస్తున్న అంశాన్ని కాదనలేం కానీ అదే సాకుతో సర్కార్ ఏకపక్షంగా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష వంటి ఆన్ లైన్ ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే అన్నివర్గాల నుండి వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు.కొరోనాను ఎదుర్కొనలేక విద్యా విధానాన్ని మర్చితే అది విద్యార్థులకు,భవిష్యత్తు సమాజానికే నష్టాదాయకం అవుతుంది.కొరోనా మూడవ వీచిక భయాందోళనలు ఈ విద్యా సంవత్సరం కూడా ప్రత్యక్ష తరగతులకు అడ్డుపడనున్నాయి.ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరై కొరోనా కు బలై చనిపోయిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా రేపటి విద్యా సంవత్సరం ప్రారంభం పై ప్రభావం చూపనుంది.

గత కార్యాచరణ ప్రణాళిక ఫలించిందా!
కొరోనా సవాల్ ను ఎదుర్కొనేందుకు గత విద్యా సంవత్సరం జూమ్ ఆప్,గూగుల్ ఆప్ ద్వారా,యూట్యూబ్ లింక్ ల ద్వారా ఆన్ లైన్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలుచేసింది.అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే లక్షలాది మంది విద్యార్థులకు అవి చేరాయనేది సందేహమే! నూటికి పదహారుమంది కూడా ఈ ఆన్ లైన్ తరగతుల వలన ప్రయోజనం పొందలేక పోయారు.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు డిష్ కనెక్షన్లకు డబ్బులు కట్టే పరిస్థితుల్లో లేరు.ఇంట్లో స్మార్ట్ ఫోన్ సౌకర్యం వుంటే అది విద్యార్థులకు అందుబాటులో లేదు.బాలికల పరిస్థితి మరింత దయానీయం.కొరోనా లాక్ డౌన్ కాలం కావటంతో విద్యార్థులు ఉపాధి పనులకు కూలీ పనులకు వెళ్ళక తప్పలేదు.ఆన్ లైన్ తరగతుల మానిటరింగ్ రికార్ఢుల తయారీ కోసమే నిర్వహించబడింది కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా వున్నాయి.ఆన్ లైన్ తరగతులు ఎంతో క్వాలిటీగా సిద్ధం చేశామని,ఎంతో పక్కాగా అమలు చేశామని ప్రభుత్వం భావించినప్పటికినీ అవి ప్రత్యక్ష తరగతులకు ప్రత్యమ్నాయం కాలేకపోయాయి.

ప్రతి తరగతిలోనూ విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ లలో సాధిం చాల్సిన సామర్ధ్యాలను సాధించకుండా పైతరగతికి వెళ్ళటం వలన పై తరగతి లో సాధించాల్సిన సామర్ధ్యాల సాధనలో వెనుకబడతారు.అయితే రెండు విద్యా సంవత్సరాలు ఈ ప్రక్రియ అమలులో విఘాతం కలిగింది.విద్యార్థులు భాషా,గణితాలకు సంబంధించిన ప్రవేశం లేకుండానే మూడవ తరగతికి చేరుతున్న పిల్లలకు ప్రాథమిక తరగతులు స్థాయిలో ఇతర సబ్జెక్టులు అవగతం కావటం క్లిష్టమవుతుంది.ఏడవ తరగతి. విద్యార్థులు ఎనిమిది,తొమ్మిది తరగతుల ఆంగ్ల,మాతృభాషల,గణిత సామర్ధ్యాల పరిచయం లేకుండానే పదవతరగతి లోకి చేరబోతున్నారు.

అదే సమయంలో ప్రయివేట్ పాఠశాలల్లో నర్సరీ ,ఎల్.కే.జీ. స్థాయి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు కూడా ఆన్ లైన్ చదువులు పకడ్భందీగా నిర్వహించారు.వారికది వ్యాపారం కాబట్టి, అది నిర్వహణలో వైఫల్యం కాలేదు. ప్రైవేటు విద్యార్థులు కూడా ఎంతో కొంత ఆర్ధిక వెసులు బాటు వున్న కుటుంబాలకు చెందిన వారే అవటం చేత విద్యార్థుల వైపు నుండి కూడా అది విజయవంతమైంది.ప్రత్యక్ష తరగతులకు ప్రత్యామ్నాయం కాకపోయినా ఫీజుల పేరిట వేలాది రూపాయలు తల్లిదండ్రులను ముక్కు పిండి వసూలు చేసినది విద్యా వ్యాపారమే అయినా విద్యార్థులు ఎంతోకొంత లాభపడ్డారని అంగీకరించాలి. ఆన్ లైన్ తరగతుల నిర్వహణ ఫలితాలను విశ్లేషించినా,పోల్చినా ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలల్లోని. విద్యార్థులకు మధ్య భూమ్యాకాశాలంత తేడా వుంది.పరీక్షలు నిర్వహిస్తే ఈ తేడా బయటపడేది కానీ అవి లేకుండానే పాస్ ఫలితాలు,మెమోలు వెలువడ్డాయి.

కొత్త విద్యా సంవత్సరం ప్రణాళిక ఏమిటి!?
బడులు తెరిచేందుకు సర్కార్ భౌతిక మౌలిక వసతుల ప్రకల్పన వంటి విద్యేతర కార్యాచరణ పై మొదట కసరత్తు చేయాల్సి వుంది. జూన్ మొదటి వారం లోగా కొరోనా రెండవ వీచిక ప్రమాదం తగ్గుతుందని విన్పిస్తుంది. ప్రత్యక్ష తరగతులను నిర్వహించేందుకు కొరోనా నిరోధక సౌలభ్యంతో తరగతి గదులను పునర్వ్యవస్థీకరించాలి. పాఠశాలపై తల్లిదండ్రులకు సమాజానికి నమ్మకం కల్గించాలి. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య కార్యకర్తను నియమించి ఐసోలేషన్ గదిని నిర్వహించాలి. ప్రతి మండల వనరుల కేంద్రం పరిధిలో ఆక్సీజన్,వెంటిలేటర్ సౌకర్యం గల అంబులెన్స్ ను నిర్వహించాలి. గత సంవత్సరం గురుకులాల నిర్వహణ లో జరిగిన వైఫల్యం విద్యా సంవత్సరం పై తీవ్ర ప్రభావం చూపింది. పాఠశాల ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి.కొరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ,ఎంప్లాయిస్ హెల్త్ స్కీంలో చేర్చాలి.ఇరవై మంది విద్యార్థులకు ఒక తరగతి గది అన్న భౌతిక దూరం నియమావళి ఆచరించాల్సి వుంది ఈ నేపథ్యంలో తరగతి,సెక్షన్ల ఆధారంగా కాల్సిన ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేయాలి.తక్కువ బడే ఉపాధ్యాయుల స్థానంలో విద్యా వాలంటీర్ల పునర్నియామకం చేయాలి.ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక హెల్త్ వర్కర్(స్కావేంజర్) ను నియమించి వారికి హానరోరియం నెలకు పదివేల రూపాయలు చెల్లించాలి.

తరగతి బోధన ప్రణాళికల పై శాస్త్రీయ దృక్పథంతో కార్యాచరణ రూపొందించాలి. ఇందుకు విద్యారంగ మేధావులు,ఉపాధ్యాయులు అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలి. రెండు విద్యా సంవత్సరాలనుండి విద్యార్థులు కోల్పోయిన వివిధ తరగతుల్లో సబ్జెక్టుల వారీ సామర్ధ్యాలను విద్యార్థులకు అందచేయాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించాలి.ఇందు కోసం యుద్ధ ప్రాతిపదికన మాడ్యూల్స్ రూపొందించాలి. వాటి మేరకు ఉపాధ్యాయులకు విర్చువల్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాలి. కొరోనా మూడవవీచిక ప్రభావం పిల్లలపై అధికంగా వుంటుదన్న వైరాలజీ నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలపై కొరోనా దాడి చేయకముందే పిల్లలకు వాక్సిన్ ఇచ్చేందుకు గల అవకాశాలను ప్రయత్నించాలి.ఇది సాధ్యమైతే కనుక విద్యార్థులు,తల్లిదండ్రులు పూర్తి ఆత్మవిశ్వాసంతో బడి నిర్వహణకు మరింతగా సహకరించే ఆవకాశముంది.

“క్యూ ఆర్ కోడ్” లే రేపటి పాఠాలా!
రాష్ట్రంలోని 6 నుండి పది తరగతులకు చెందిన లక్షలాదిమంది పాఠశాల విద్యార్థులు, ఈ విద్యా సంవత్సరం కూడా ఆన్ లైన్ విధానానికి సంసిద్ధం కావాలని ప్రభుత్వం అన్యాపదేశంగా సూచనలు చేస్తుంది.ఆన్ లైన్ విద్య పైనే ఆధారపడి జూన్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని లీక్ లు వదులుతూంది.ప్రతి తరగతికి చెందిన పాఠ్యపుస్తకాలలోని వివిధ పాఠాలకు ప్రత్యేకంగా “క్యూ ఆర్ కోడ్” లపు ముద్రించిన కొత్త పాఠ్యపుస్తకాలు అందచేయనున్నారు. ఆయా పాఠాల కోసం క్యూ ఆర్ కోడ్ లను స్మార్ట్ ఫోన్ లతో స్కాన్ చేయగానే ఆయా పాఠాలకు సంబంధించిన వీడియో లింక్ లభ్యమవుతుంది. పాఠ్యబోధన,బోధనానంతర చర్చ,పాఠ్యాంశాలపై మూల్యాంకనాలతోసహా ఈ వీడియో లింక్ ఆధారిత ఆన్ లైన్ విధానం సిద్దం చేయనున్నారు. ఇందుకోసం గత ఆరు నెలలుగా ఎస్.సి.ఇ.ఆర్టి. కేంద్రంగా పకడ్భందీగా కార్యశాల నిర్వహిస్తున్నట్టు తెలుస్తూంది. ప్రతి తరగతికి,ప్రతి సబ్జెక్ట్ కు దాదాపు డెభ్భై మంది లెక్కన వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు‌ ఈ కార్యశాలలో పాల్గొన్నట్టు తెలుస్తూంది.తుది రూపానికి చేరినట్టుగా భావిస్తున్న ఈ బృహత్తర కార్యాచరణ ప్రణాళిక పై ఉపాధ్యాయ సంఘాలకు, విద్యారంగ మేధావులకు ఎలాంటి ప్రాథమిక సమాచారం కూడా లేదు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.

ఒక తరం నిర్వీర్యమైన చదువుల సారంతో, జ్ఞాన శూన్యమైన పాస్ సర్టిఫికెట్ లతో సమాజంలోకి అడుగు పెట్టబోతున్న ప్రధానాంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రమాదకరంగా భావించక పోవటం శోచనీయం.ఆచరణలో వైఫల్యం చెందిన ఆన్ లైన్ బోధన ప్రయోగం భవిష్యత్ సమాజ ఉనికికి తప్పుడు మార్గదర్శకాలు అందచేస్తుందన్న విద్యారంగ మేధావుల ఆభిప్రాయాలను గౌరవించాలి. ప్రభుత్వం విద్యలో ఏకపక్షంగా చేసే సంస్కరణలు విజయం సాధించలేవు. పాఠశాల విద్యారం గంలో ప్రభుత్వ బడులు మూతబడేందుకు,లక్షలమంది పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు దోహదపడే కార్యాచరణలను ప్రభుత్వం అమలు చేయబూనటాన్ని పౌరసమాజం,విద్యార్థుల తల్లిదండ్రులు హర్షించక పోవచ్చును. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు విద్యారంగం ప్రథమ ప్రాధాన్యత కాకపోవడం ప్రభుత్వం విద్యలో చేసే సంస్కరణలను పౌరసమాజం వ్యతిరేకించక పోవడం కూడా విజ్ఞాన సమాజాన్ని దేశానికి దూరం చేసినట్లే అవుతుంది.దేశ విద్యావిధానం తోనే భవిష్యత్ జాతి అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తయారుచేసుకోవాలి.ఇందుకోసం విద్యారంగానికి నిధులు పెంచాలి, సంస్కరణ లో అందరిని భాగస్వాములను చేయాలి.

-వాడపల్లి అజయ్ బాబు – 8919260409

Leave a Reply