Take a fresh look at your lifestyle.

సీఏఏని వాయిదా వేస్తే నష్టమేమిటి?

పౌ రసత్వ సవరణ చట్టానికి(సీఏఏకి) వ్యతిరేకంగా ఢిల్లీలో జామియా యూనివర్శిటీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని బలవంతంగా రుద్దేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ-2 ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై దేశ మంతటా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు చైనా నుంచి కరోనా వైరస్‌ ‌భారత్‌లోకి ప్రవేశించిందన్న వార్త, మరో వైపు జామియాలో విద్యార్థులపై కాల్పుల వార్త గురువారం నాడు యావత్‌ ‌దేశాన్ని ఉలికి పాటుకు గురి చేశాయి. పౌరసత్వం సమస్య కొత్తగా వొచ్చింది కాదు. దేశంలో అనేక ప్రధాన సమస్యలు ఉండగా, బీజేపీ నాయకులు దీనిపైనే ఎందుకు ఇంత పట్టుదలతో వ్యవహరిస్తున్నారో మేథావులకు సైతం అర్థం కావడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్‌ ‌కీ బాత్‌ ‌కార్యక్రమాల్లో ప్రజల జీవన విధానానికి సంబంధించిన అన్ని అంశాలను స్పృశిస్తున్నారు. ఖేలో ఇండియా, పరీక్షాపే చర్చ వంటి అంశాలన్ని ప్రస్తావిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అర్జంట్‌గా సీఏఏని అమలు జేసి తీరాలని ఎందుకంత పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులకు మొండి బకాయిలు పెరిగి పోయాయి. ఉద్యోగావకాశాలు పూర్తిగా సన్నగిలాయి. ఈ పరిస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితిపై దృష్టిని కేంద్రీకరించాల్సిన ప్రభుత్వం సీఏఏని పట్టుకుని వేళ్ళాడుతోంది. గణాంకాల సేకరణ అనేది ఎప్పుడూ జరుగుతున్నదే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ వివరాల సేకరణలో కులం, మతం వంటి అంశాల గురించి ఆరా తీస్తోందన్న వార్తలు జనానికి అనుమానాలను కలిగిస్తున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా కేరళ, బెంగాల్‌ ‌ప్రభుత్వాలు ఇప్పటికే అసెంబ్లీల చేత తీర్మానాలను ఆమోదింపజేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సీఏఏని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు.

అంతేకాక, ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యమానికి అవసరమైతే నాయకత్వం వహిస్తానని కూడ ప్రకటించారు. ఢిల్లీలో కాల్పులు జరిపిన విద్యార్థి ఉత్తరప్రదేశ్‌కి చెందిన వాడని నిర్ధారణ కావడంతో ఈ కాల్పుల వెనుక బీజేపీ హస్తం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీయే చేయించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఏఏని దేశంలో మేథావులు, విద్యా వంతులు, లౌకిక, ప్రజాస్వామ్య వాదులు వ్యతిరేకిస్తున్నారు. సీఏఏని అమలు జేస్తే కొత్త సమస్యలు ఉత్పన్న మవుతాయని అందరూ ముక్త కంఠంతో స్పష్టం చేస్తున్నా ప్రధానికి పట్టించుకోకపోవడం శోచనీయం. కరోనా వైరస్‌ ‌ప్రజలను వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో సీఏఏ వివాదాన్ని కనీసం కొంత కాలం పాటైనా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం బాధ్యతగల ప్రభుత్వం విధి. బడ్జెట్లో కొత్త పన్నులు ఏం వేస్తారోనన్న ఆందోళన ఒక వైపు, కరోనా కలకలం మరో వైపు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇవేమి పట్టనట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రధానమంత్రి సీఏఏ అమలును కొంతకాలం వాయిదా వేయించడం జాతి ప్రయోజనాల దృష్ట్యా అత్యవసరం., దేశానికి శ్రేయస్కరం.

Leave a Reply