Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ ‌సన్నద్దతపై ఏం చర్యలు తీసుకున్నారు

  • ప్రైవేట్‌ హాస్పిటల్స్  ల్లో ఒకేరకమైన ధరలపై ఏం చేశారు
  • కొరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు
  • ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు
  • నివేదికపైనా తీవ్ర అసంతృప్తి.. విచారణ నేటికి వాయిదా

కొరోనా  థర్డ్‌వేవ్‌కు సన్నద్దత ఏ విధంగా ఉందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొరోనా పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోవిడ్‌ ‌విషయంలో తమ ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణలో కొరోనా  పరిస్థితులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌ల్లో చికిత్సల ధరలు ఒకే విధంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా అని ప్రశ్నించింది. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్  ‌ల్లో చికిత్సలకు గరిష్ట ధరలు సవరిస్తూ కొత్త జీవో ఇచ్చారా అని, 14 కొత్త ఆర్‌టీపీసీఆర్‌ ‌ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని నిలదీసింది. రెండోదశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

కొరోనా పై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. మహారాష్ట్రలోని ఒకే జిల్లాలో 8 వేలమంది చిన్నారులు కొరోనా  బారిన పడ్డారని గుర్తుచేసిన హైకోర్టు.. థర్డ్ ‌వేవ్‌కు ఏ విధంగా సన్నద్ధమయ్యారని అడిగింది. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేవి• చేయడం లేదా అని ప్రశ్నించింది. నీలోఫర్‌ ‌హాస్పిటల్‌ ఒక్కటే సరిపోతుందా?. మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారని, లైసెన్స్ ‌రద్దుచేసిన హాస్పిటల్స్  ‌లకు బాధితులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చారా అని నిలదీసింది. బంగారం తాకట్టుపెట్టి బాధితులు హాస్పిటల్స్ ‌కు ఫీజులు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపడింది.

అయితే డీహెచ్‌ ‌ఖమ్మం వెళ్లినందున విచారణకు హాజరుకాలేదని  ఏజీ బీఎస్‌‌ప్రసాద్‌ ‌కోర్టుకు తెలిపారు. హైకోర్టు ప్రశ్నలకు వివరాలు అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు.  హెల్త్ ‌సెక్రటరీ, డీహెచ్‌, ‌డీజీపీలో హైకోర్టులో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కొరోనా  పరిస్థితులపై విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అయితే పిటిషన్‌పై ఆరోగ్య శాఖ కౌంటర్‌ ‌దాఖలు చేసింది.  కొరోనా  పరిస్థితులపై హైకోర్టుకు సమగ్ర  నివేదికను అందజేసింది.రాష్ట్రంలో కొరోనా  పరీక్షలు పెంచుతున్నామని… ఏప్రిల్‌ 29‌న లక్ష పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 10 ప్రైవేటు హాస్పిటల్స్ ‌కు కొరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపింది.  79 హాస్పిటల్స్‌కు 115 షోకాజ్‌ ‌నోటీసులు జారీ చేశామని పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో 744 బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌కేసులు నమోదు అయ్యాయని… బ్లాక్‌ ‌ఫంగస్‌ ఔషధాలకు దేశవ్యాప్తంగా కొరత ఉందని తెలిపింది. కొరోనా  థర్డ్ ‌వేవ్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

ప్రజలకు అవసరమైన మందుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని…ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆరోగ్య శాఖ కౌంటర్‌లో పేర్కొంది. కొరోనా  పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌, ‌డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్‌ఎం‌సీ వేర్వేరుగా హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. డీజీపీ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్‌ 1 ‌నుంచి మే 30వ తేదీ వరకు కొరోనా  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 7.49 లక్షల కేసులు నమోదు అయ్యాయని కోర్టుకు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 35.81 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు.

జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్‌ ‌డౌన్‌, ‌కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. బ్లాక్‌ ‌మార్కెట్లో ఔషధాలను విక్రయించిన వారిపై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే లాక్‌డౌన్‌ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.

Leave a Reply