Take a fresh look at your lifestyle.

నిబంధనలు ఉల్లంఘించిన… ప్రైవేటు హాస్పిటల్స్ పై చర్చలేవీ ?

ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

‌కొరోనా నిర్ధారణ, వైద్య పరీక్షలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు హాస్పిటల్స్ పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొరోనా చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇచ్చి ఆ తరువాత పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. కొరోనా చికిత్సలు, ప్రైవేటు హాస్పిటల్స్ లలో చార్జీల వసూలుపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది శ్రీకిషన్‌ ఈ ‌పిటిషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కొరోనా వైద్య చికిత్సల పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయనీ, రోగుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు హాస్పిటల్స్ రూ.లక్షలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కొరోనా చికిత్సలు, చార్జీల్లో పారదర్శకతపై ప్రైవేటు హాస్పిటల్స్ కు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్‌ ‌హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బిల్లు చెల్లించలేదనీ డీఎంవోను డిశ్చార్జి చేయని హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో ఉల్లంఘించిన ప్రైవేటు హాస్పిటల్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తాము భావిస్తున్నామనీ, ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోనట్లయితే, ఎందుకు తీసుకోలేదో తెలపాలని ఆదేశించింది. ఈ అంశాలన్నింటిపై ఈనెల 14లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ‌కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply