Take a fresh look at your lifestyle.

5 వేల మందిలో ప్రత్యక్ష సాక్షులు 23 మందే దొరికారా?’

  • లఖింపూర్‌ ‌ఖేరీ  ఘటన   కేసులో యుపీ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం
  • సాక్ష్యులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశం
  • తదుపరి విచారణ నవంబర్‌ 8‌కి వాయిదా

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న లఖీంపూర్‌ ‌ఖేరీ హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసు విచారణను సుప్రీమ్‌ ‌కోర్టు మంగళవారం చేపట్టింది. విచారణ సందర్భంగా సంఘటన జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉంటే మీకు కేవలం 23 మంది మాత్రమే సాక్షులుగా కనిపించారా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది సాక్షుల స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా సాక్షులందరికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అశిష్‌ ‌మిశ్రా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి 68 మంది సాక్షులు ఉన్నారని.. వీరిలో 23 మంది ప్రత్యక్ష సాక్షులు కాగా.. మరో 30 మంది స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేశామని తెలిపారు. ఈ వాదనలపై సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధానన్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘4-5 వేలమందితో ర్యాలీ తీస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. కానీ మీకు మాత్రం 23 మంది సాక్షులే కనిపించారా.. మీ ఏజెన్సీలకు చెప్పి.. మరింత మంది స్టేట్‌మెంట్స్ ‌రికార్డు చేయమనండి.

ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా..న్యాయాధికారులు అందుబాటులో లేకపోయినా..సమీప జిల్లా కోర్టులో స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేయండి’’ అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్‌ 8‌కి వాయిదా వేశారు.

Leave a Reply