Take a fresh look at your lifestyle.

‘‘వెనుకంజలో మనం’’!

‘కుటుంబం అనేది లేకుండా పేవ్మెంట్లపై, రోడ్ల పక్క, రైల్వే స్టేషన్లలో, బస్టాండులవద్ద, తిండి, బట్టలు, నీడ, కనీసం తాగేందుకు నీరు కూడా కరువై నివసించే జనం దేశ జనాభాలో(2011  జనాభా లెక్కల ప్రకారం) 17% వున్నారు. అసోం వంటి ప్రాంతంలో భారతీయులు గుర్తింపుకు నోచుకోని లక్షలాది జనం క్యాంపుల్లో వుంచబడ్డారు. వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించటం లేదు. ప్రస్తుతం వున్న ఆసుపత్రులలోనే సౌకర్యాలు అంతంత మాత్రమే!’ 

దేశ జనాభాలో 17% వున్న నిరాశ్రయులకు కొరొనా సోకకుండా తీసుకోవల్సిన బాధ్యతలను విస్మరించిన సర్కార్‌ ‌కేవలం ఎగువ, దిగువ మధ్య తరగతి మరియు సంపన్న వర్గాల మధ్య అసమానతల్ని పెంచే చర్యలకే పరిమితమయింది. డబ్ల్యూహెచ్‌ఓ ‌చేస్తున్న సూచనల్ని పెడచెవిన పెడ్తూ కోట్లాది భారతీయుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూంది. నూటాముప్పయి కోట్ల జనాభా వున్న భారత్‌లో కొరోనా నివారణకై కేంద్రప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న కార్య క్రమాలపై మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనకు ప్రజలు జేజేలంటున్నారు. ఇరవై నాలుగు గంటల జనతా కర్ఫ్యూ విధించిన తెలంగాణ సర్కార్‌ను కేంద్ర హోం శాఖే కాదు, ప్రజలు కూడా భేష్‌! అం‌టూ అభినందిస్తున్నారు, కానీ మరోవైపు డబ్ల్యుహెచ్‌ఓ ‌ప్రకటననూ పరిగణనలోకి తీసుకోక పోతే నష్టం తీవ్రతరం అయ్యే అవకాశమూ లేకపోలేదు. లాక్‌ ‌డౌన్‌లతో కరోనా నివారణ సాధ్యం కాదని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రతినిధి ప్రకటించారు. ఐసోలేషన్‌ ‌వార్డుల ఏర్పాటు, మాస్క్‌ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత, నిరంతర వైద్యసేవలు మాత్రమే దీనికి పరిష్కారమని డబ్ల్యుహెచ్‌ఓ ‌ప్రతినిధి ప్రపంచదేశాలను సీరియస్‌ ‌గానే హెచ్చరించారు.

మనదేశంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్‌ల వినియోగం, సమూహాల మరియు కరచాలనాల నిషేధం పాటించమని ఆదివారం జనతా కర్ఫ్యూ, బాల్కనీలోకి వచ్చి చప్పట్లుకొట్టమని ఇవి ఆచరించటం ద్వారా ప్రజలే స్వఛ్ఛంధంగా కొరోనాను నివారించగలరని ప్రధాని మోడీ సందేశ మిచ్చారు.  ఆరు కోట్ల జనాభా దాటని ఇటలీలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్‌ ‌వ్యాప్తి ప్రారంభమైన చైనాలో గంటల వ్యవధిలో పెద్ద ఆసుపత్రి కట్టించి, యుద్ధ ప్రాతిపదికన కోట్ల నిధుల ఖర్చుతో, దేశం యావత్తును కదిలింపజేసినా భారీ ప్రాణ నష్టం చవిచూస్తున్నది. దాని పక్కనేవున్న తైవాన్‌ ‌మరియు ఉత్తరకొరియాలు సైన్యం సహకారంతో ముందస్తు చర్యలు పాటించాయి. అనుమానితుల వైద్యపరీక్షల్లోముందున్నాయి. ఉత్తర కొరియా సైన్యం చేత కావల్సినంత మాస్క్ ‌లు తయారీచేయించింది. జనాభా మొత్తానికి కావల్సిన మాస్కులను, శానిటజైర్స్‌ను పంపిణీ చేశాయి. వైరస్‌ ‌ధాటికి అధికంగా నష్టపోయిన స్పెయిన్‌ ఆసుపత్రులన్నింటినీ జాతీయం చేసింది. ఫ్రాన్స్ ‌శానిటజైర్స్‌ని దేశ ప్రజలందరికీ ఉచిత పంపిణీ చేసింది. చైనా కార్ల ఫ్యాక్టరీనే మాస్క్‌ల తయారీ కేంద్రంగా మార్చింది. అమెరికా యూనివర్సిటీ విద్యార్థుల ఫీజులు మాఫీ, ప్రయివేట్‌ ఉద్యోగుల జీతాలుచెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ ‌చెల్లింపులు, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనలతో చురుకైన చర్యలు చేపట్టింది.

నివారణ చర్యల కోసం భారీ ఎత్తున అత్యవసరంగా బిలియన్ల, ట్రిలియన్ల నిధులు విడుదల చేశాయి.భారత్‌ ‌వంటి అధిక జనాభా గల దేశం హైరిస్క్‌గా గుర్తించిన ప్రాంతాల్లో కనీసం మాస్క్‌ల పంపిణీ కూడా చేయలేక పోతుంది. ప్రయివేట్‌ ‌మార్కెట్లో మాస్క్‌ల లభ్యత ప్రశ్న్ణార్ధకమైంది. ప్రయివేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవల్ని ఖచ్చితంగా అందించే చర్యలు లేవు. కుటుంబం అనేది లేకుండా పేవ్మెంట్లపై, రోడ్ల పక్క, రైల్వే స్టేషన్లలో, బస్టాండులవద్ద, తిండి, బట్టలు, నీడ, కనీసం తాగేందుకు నీరు కూడా కరువై నివసించే జనం దేశ జనాభాలో(2011  జనాభా లెక్కల ప్రకారం) 17% వున్నారు. అసోం వంటి ప్రాంతంలో భారతీయులు గుర్తింపుకు నోచుకోని లక్షలాది జనం క్యాంపుల్లో వుంచబడ్డారు. వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించటం లేదు. ప్రస్తుతం వున్న ఆసుపత్రులలోనే సౌకర్యాలు అంతంత మాత్రమే! అయితే అవే ఆసుపత్రులపై ఆధారపడుతున్న ప్రభుత్వం వైరస్‌ ‌నుంచి కాపాడే వైద్యసేవల కోసం కొత్తగా చేసిందేమి లేదు. కొరోనా వైరస్‌ ‌భారత్‌లో రెండవ దశను చేరుకుంటున్న నేపథ్యంలో మరో మూడు వారాలు ప్రమాదకరమని తెలిసినా వాటి ఫలితాలను ఎదుర్కొనేందుకు నిధుల విడుదల కానీ, ఇతర అత్యవసర సేవల వినియోగంపై మార్గదర్శకాలు కానీ లేవు. ప్రయివేట్‌ ‌రంగ ఉద్యోగులు ఉపాధి కూలీలు వారికి ఈ నెల చివరి వరకు గల లాక్‌ ‌టైంలో ఎలాంటి ఆర్థిక సహకారం అందించటంపై ముందుకు రావటం లేదు.

లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో ఇళ్ళ లోంచి బయటికి రావద్దని, శానిటజైర్స్ ‌వినియోగించి కొరోనా చైన్‌ ‌తెంపడని ప్రజలకే నివారణ బాధ్యతలను అప్పగించటం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు మాస్క్‌లు, శానిటజైర్స్ ఉచితంగా పంపిణీ చేయాల్సివుంది. కొరానా వ్యాప్తికి రాబోయే రెండు వారాలు చాలా కీలకమైన సమయం అని తెలిసినా, యుద్ధప్రాతిపదికన చేసిన వైద్య సంబంధిత చర్యలేవి కనిపించటం లేదు. పైగా ‘‘కొరొనాను అదుపులో వుంచుతున్న భారత్‌’’ అని ప్రపంచ దేశాల ముందు ప్రచారం చేసుకోవటం వెనుక ‘‘ఏ ప్రయోజనాలు’’ దాగి వున్నాయనేది, కొరోన చుట్టు అల్లుకుపోతున్న మతరాజకీయాలు ఇప్పుడు అప్రస్తుత చర్చనే కావచ్చు కానీ రేపవి ప్రధాన కారకాలుగా, వెలుగు చూడకపోవు. వైరస్‌ ‌వ్యాప్తి, నివారణ, వైద్య సేవల విస్తృతి విషయంలో ప్రజల ముందు మరింత పారదర్శకంగా, క్రియాశీలకంగా వుండాల్సిన తక్షణ అవసరం పాలకులకు వుంది.
 – ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డేస్క్ 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!