Take a fresh look at your lifestyle.

‌ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎపిసోడ్‌కు తెరపడేనా ..!

మరో వారం రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడెవరన్నది తేలనున్నట్లు దిల్లీ నుంచి ఊహాగానాలు మొదలయినాయి. . మరోసారి వాయిదా పడకుండా ఇప్పటికైనా ఈ ఎపిసోడ్‌కు తెరపడితే చాలంటున్నారు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందిన తర్వాత ఇక తాను అధ్యక్ష స్థానంలో కొనసాగలేనని నేటికీ అదే పదవిలో కొనసాగుతున్న కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2020 డిసెంబర్‌ 4‌న కాంగ్రెస్‌ అధిష్టానానికి రాజీనామ లేఖను పంపించినప్పటినుండీ, కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అనేక తర్జనబర్జనలు, చర్చలు, హైదరాబాద్‌ ‌టు దిల్లీ, దిల్లీ టు హైదరాబాద్‌ ‌నాయకుల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌లో కార్యకర్తలకన్నా అందరూ నాయకులే అన్న నానుడి మొదటి నుండీ ఉంది . దానికి తగినట్లుగా ఈ పదవిని ఆశిస్తున్నవారు అనేకులుండడంతో ఎవరిని ఆ స్థానంలో కూర్చోబెట్టాలన్నది కేంద్ర అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటికే పార్టీ క్షీణ దశలో ఉంది. కొందరు అలిగి, మరికొందరు తమకేమిటన్నట్లు పట్టించుకోవడం మానివేయడంతో పార్టీలో పటిష్టత లోపించింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో పార్టీ అధమ స్థాయికి చేరుకుంటూ వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీకి జవసత్వాలను కలిగించే వ్యక్తికి అధ్యక్ష పదవిని ఇవ్వాలని అధిష్టానం భావన. కాని, ఇద్దరు ఎంపీలతోపాటు పలువురు సీనియర్లు ఆ పదవికోసం చాలా కాలంగా ఆశ పెట్టుకుని ఉన్నారు. పిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నా, పార్టీలోని సీనియర్లు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, వి. హనుమంత రావు, జీవన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, ‌జగ్గారెడ్డి, రాములు నాయక్‌, ‌బలరాం నాయక్‌ ‌లాంటివారంతా ఆశిస్తున్నారు. ఈ నాయకుల సామర్థ్యాలపై దిల్లీ స్థాయి నాయకులు పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. వారిలో ఒకటి రెండు పేర్లను ఎంచుకున్నారన్న వార్తలు కూడా వొచ్చాయి. అయితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు, వరంగల్‌, ‌ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉండడంతో ఎప్పటికప్పుడు అధ్యక్షుడి ప్రకటనను అధిష్టానం వాయిదా వేస్తూ వొచ్చింది.

రాష్ట్రంతో పాటు దేశంలో మరెక్కడా ఇప్పట్లో ఎన్నికలు లేవు. తిరిగి 2022లో దేశంలోని ఆరేడు రాష్ట్రాల్లో ఎన్నికలు మొదలయ్యే నాటికి సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరుచుకోవా లన్నది కేంద్రంలోని కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న టిఎస్‌పిసిసి అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధిష్టానం చొరవ చూపుతున్నది. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ పదవి ఎవరిని వరిస్తుందా అన్నదే ఇప్పుడు టిఎస్‌టిపిసిసి వర్గాలమధ్య చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తమకే ఈ పదవి వరిస్తుందన్న ఊహల్లో ఉండగా, మరికొందరు తమ గాడ్‌ ‌ఫాదర్స్‌తో మరోసారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశిస్తున్న వారి పేర్లలో ప్రధానంగా రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు మాత్రమే గట్టిగా వినిపిస్తున్నాయి.. తెలుగుదేశం నుండి వొచ్చిన రేవంత్‌రెడ్డి కేసిఆర్‌ను ఎదుర్కోటంలో చాలా గట్టిగా వ్యవహరిస్తున్నందున పార్టీ ఇమేజ్‌ ‌పెంచే అవకాశం ఉందన్న భావన ఉంది. అంతే కాకుండా ఆయన పార్టీ మారినప్పుడే కాంగ్రెస్‌లో గౌరవప్రదమయిన పదవిని కట్టబెట్టనున్నట్లుగా పార్టీ వర్గాలు అభయమిచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి టిఎస్‌పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి కోమటిరెడ్డి బ్రదర్స్ అయిష్టతను వ్యక్తం చేస్తూ వొచ్చారు. చాలా కాలం తమ ఇద్దరిలో ఎవరికి పదవిని కట్టబెట్టినా పార్టీని పూర్వ స్థాయికి తీసుకొస్తామని అనేక సార్లు చెప్పుకొచ్చారు.

ఇప్పుడైతే ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కడే తనకా పదవిని ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు దిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ ‌పెద్దలను కలిసి వొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధానంగా వీరిద్దరిలో ఒకరికి ఈ పదవి ఖాయమను కుంటున్నారు. అయితే అధిష్టానం మరో వ్యక్తి ఎవరికైనా ఇస్తే, అతను ఎవరై ఉంటారన్న విషయంలో పార్టీ వర్గాల మధ్య తర్జనభర్జన జరుగుతున్నది. తమ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అంచనా వేసుకుంటున్న మరికొందరు సీనియర్లు అప్పుడే తమ సహాయ నిరాకరణను పరోక్షంగా వ్యక్తపరుస్తున్నారు.. సీనియర్‌ ‌నాయకుడు, ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి ఈ విషయంలో ముందున్నాడు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం తనకు ఇష్టమైన వ్యక్తిని ఎంపిక చేస్తే ఆయనకు తన సంపూర్ణ మద్దతునివ్వడమేకాకుండా రాష్ట్రం అంతా పార్టీ కోసం తిరుగుతానని, కాని పక్షంలో తన నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ ముందుగానే తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. హనుమంతరావు, జానారెడ్డి లాంటివారు కొత్తగా కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యత పదవి ఇవ్వడాన్ని ముందునుండే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఒకరు బహిరంగంగానే విమర్శిస్తుంటే, మరొకరు నర్మగర్బంగా మాట్లాడుతున్నారు.. మొత్తానికి రాష్ట్ర అధ్యక్ష పదవి వార్త మరోసారి కాంగ్రెస్‌లో దుమారాన్ని లేపబోతున్నదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Leave a Reply