- సేంద్రియ వ్యవసాయం బలపడాలి
- రైతు బజారులో రైతులకు స్టాల్స్ పెట్టండి : మంత్రి హరీష్రావు
ఆర్గానిక్ రైతులకు.. మేలు జరగాలి. ఆ రైతులకు ఇంకా ఏదైనా చేయాలి.సేంద్రీయ వ్యవసాయం బలపడాలి. లాభాలు తెచ్చేలా ఏం చేద్దాం.? ఆర్గానిక్ పంటలు విక్రయాలు జరిపేందుకు రైతు బజారులో స్టాల్స్ పెట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సుడా కార్యాలయంలో శుక్రవారం నియోజక వర్గ పరిధిలో ఆర్గానిక్ పంటలు పండించే గ్రామాల వారీగా ఏం పంటలు వేశారని రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించారు. ఆర్గానిక్ రైతులు పండించిన పంటలు ఎక్కువ ధరలకు విక్రయాలు జరిపేలా అవకాశాలు ఏమున్నాయని.., సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు, మున్సిపల్, సుడా, మార్కెట్ కమిటీ చైర్మన్లతో మంత్రి చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు బజారులో స్టాల్స్ ఇంకా ఎందుకు తెరువలేదని, వెంటనే బియ్యం, కూరగాయలకు ప్రత్యేక ఆర్గానిక్ స్టాల్స్ పెట్టాలని ఏఎంసీ చైర్మన్ కు సూచించారు. రసాయనిక ఎరువులు వాడి కూరగాయలు, ఆకుకూరలు పండించడం నిత్యం మనం చూస్తుంటాం. తప్పని పరిస్థితుల్లో వాటిని కొనుగోలు చేసి వాడుతూ అనారోగ్యాలకు గురవుతుంటారని., అందుకు భిన్నంగా నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట రైతు బజారులో సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించిన ఆర్గానిక్ కూరగాయలు లభ్యమయ్యేలా చూడాలని అవగాహన కల్పించారు. రైతు బజార్ లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి ఇతర కూరగాయల ధరలతో పోలిస్తే వీటి రేటు ఎక్కువ. అయినప్పటికీ వీటి ప్రాముఖ్యం తెలిసినవారు ఆర్గానిక్ కూరగాయలనే కొనుగోలు చేస్తారని వివరించారు. సిద్ధిపేట నియోజక వర్గం పరిధిలోని మైసంపల్లి, ఓబులాపూర్, లక్ష్మీదేవిపల్లి, తిమ్మాయిపల్లి, వెంకటాపూర్ ప్రాంతాల నుంచి రైతులు తీసుకువచ్చి విక్రయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా నియోజక వర్గ పరిధిలోని ప్రతిపాదిత 8 గ్రామాల ఆర్గానిక్ రైతుల కోసం రూ.75 లక్షలు మంజూరు చేయించినట్లు, వాటిని 5 యూనిట్లుగా విభజించినట్లు వివరిస్తూ., జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ సహకారం, వారి సమన్వయంతో ఆయా గ్రామాలలో యూనిట్లు పెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. అయితే సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులతో ముచ్చటిస్తూ.. వారు పండించే పంటలకు ఏ మేర గిట్టుబాటు ధరలు వస్తున్నాయో.. ఆరా తీయగా పాలీ హౌస్ ద్వారా 7 పంటలు, 90 శాతం సబ్సిడీతో పందిరి సాగు ద్వారా ఎస్సీ రైతులకు లాభాలు వచ్చాయని, కీర, ఆకు కూరలు, బీరకాయ పంటలు పండించానని రెట్టింపు ఆదాయం వచ్చిందని సేంద్రీయ రైతులు సంబురంతో మంత్రికి చెప్పుకున్నారు.