Take a fresh look at your lifestyle.

‘కృష్ణం వందే జగద్గురుమ్’‌

‘‌వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ సర్వ పుణ్య పురుష నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కలంక’ అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని అనన్యభావంతో సేవించేవారికి, ఆయన్ని ప్రసన్నం చేసుకునే మార్గాలు అనేకమున్నాయి . వాటి అన్నింటికీ కూడా, అనవరతస్మరణమనేది ప్రధానం. ఆ స్మరణకు మూలం దైన్యం కావచ్చు.. బాంధవ్యం కావచ్చు. దంభం కావచ్చు. ఆర్తి కావచ్చు. ఆనందం కావచ్చు. వైరానుబంధం కావచ్చు. రాగం కావచ్చు. ద్వేషం కావచ్చు. ఎవరేవిధంగా తన్ను స్మరించుకున్నా, ఆయన వారిని అనుగ్రహించి తీరుతాడు.గోపికలు శ్రీకృష్ణుని తమ హృదయేశ్వరునిగా భావించారు.ఆయన సన్నిధినాశించారు.ఆయన అనురాగాన్ని వాంఛించారు. ఆయన్నే అనన్యభావంతో ఆశ్రయించారు. అది కారణంగానే, ఆ పరమ పురుషుడు వారిపట్ల ప్రసన్నుడు కావటం జరిగింది. వారిది దివ్యమైన ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిఫలాపేక్ష అనేది లేదు. ఆ ప్రేమ ముందు వారికి ప్రపంచమే కనిపించేది కాదు. దానివల్ల వారు స్వర్గాధిపత్యాన్ని కూడా లక్ష్యం చేసేవారు కాదు.అవధి లేని పరమానందానుభవమే వారి చరమ లక్ష్యంగా ఉండేది. కృష్ణ ప్రేమను మించిన మత్తు పదార్థం ప్రపంచంలో లేనేలేదు. శ్రీకృష్ణుని ప్రేమించినవారికి ఆయన వినా అన్యమేదీ కనిపించదు.

ప్రపంచమంతా వారికి కృష్ణమయంగా తోస్తుంది. చివరకు వారు కూడా శ్రీకృష్ణుని మాదిరిగా మారిపోతారు. పరపూర్ణమూ, పరిశుద్ధమూ అయిన పరిణతి స్థితి. పరమాత్ముని ప్రేమించి, సేవించి, ఆయన దైన వాత్సల్యామృతాన్ని ఆస్వాదించిన వారికి ప్రపంచంతో ఏవిధమైన సంబంధమూ ఉండదు. శ్రీకృష్ణపరమాత్మ లీలలు అనంతం, అద్భుతం, అనిర్వచనీయం.శ్రీవిష్ణువు అవతారాల్లో తాను పరమాత్మనని పలువురికి ఎరుక పర్చిన లీలా మానుషరూపం గోవిందుడిది. శ్రావణకృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వదినం. శ్రీకృష్ణుడి జన్మదినం కావడం వలన జన్మాష్టమి అనడం కూడాకద్దు. కృష్ణుడు గోకులంలో పెరిగాడు కావున గోకులాష్టమి అయింది. కొందరు కృష్ణ జయంతి అనీ శ్రీజయంతి అని కూడా అంటారు. శ్రీకృష్ణుడి పుట్టుక రెండు యామీముల రాత్రి సమయాన కారాగారంలో జరిగింది. కొందరు శ్రీకృష్ణుడికి పూజ చేసి ఆ రాత్రి జాగరణ చేస్తారు. స్వామికి పెట్టే నైవేద్యం కూడా ప్రత్యేకంగా వుంటుంది. బాలింత రాండ్రు తినే కాయం నైవేద్యంగా పెడతారు. మినపపిండిలో పంచదార కలిపి కాయం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో శొంఠి ని కూడా కలుపుతారు. తర్వాత బెల్లంతో పాకం పట్టి దానిలో నేయి కలిపి చేస్తారు. దక్షిణ భారత దేశంలో ఈ పండుగనాడు రోజంతా ఉపవాసం వుండి, ఇంటి నిండా పిండితో కృష్ణ పాదాలను ముగ్గులుగా పెడతారు. బాలకృష్ణుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ, మువ్వగజ్జెలు మ్రోగించుకుంటూ ఇంట్లో ప్రవేశిస్తాడని నమ్మకం. తమ ఇంట్లోని చిన్న పిల్లల చేత అడుగులు వేయిస్తారు.. ముద్దుముద్దుగా. బాలకృష్ణుడిలాగా వేషధారణ చేయిస్తారు. వెన్న ముద్దలు ప్రసాదంగా పెడతారు స్వామికి.

రవికెల పండుగ…
శ్రీకృష్ణ జయంతినాడు కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు రాత్రిపూట కొందరు భక్తులు దంపతులుగా ఒక్కోచోట చేరి బాగా మధుపానం గావించి, కంచుక్రీడ సాగిస్తారట. ఈ క్రీడకు రవికలే ముఖ్యంగా చెబుతారు. ఈ పండుగనే రవికెల పండుగ అనికూడా అంటారు. ఆడవారందరూ దేవాలయంలోకి చేరి, పూజలు చేసాక వారి వారి రవికలను తీసి ఒక్కచోట కుప్పగా పోస్తారు. ఇక మగవారు తర్వాత ప్రవేశించి ఒక్కొక్కరూ ఒక్కొక్క రవికను తీసుకుంటారు.ఇంతకు ఏమిటంటే ఆ రవిక ఎవరిదైతే ఆ మహిళ రాత్రంతా ఆ మగవాడితో స్వేచ్ఛగా గడపాలన్నమాట. తెల్లవారితే ఎవరిదారి వారిది. ఎవ్వరి సంసారం వారిది. అలా చేస్తే వారికి పుణ్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు కూడాను. అందుకే తెలుగులో ఒక సామెత కూడా వాడుకలోకి వచ్చింది. పండుగనాడు కూడా పాత మొగుడేనా అని. ఈ సామెతకు రవికెల పండుగే మూలం అంటారు. ఇదిలా వుంటే అన్ని ప్రాంతాల్లోనూ నేటి రోజుల్లో ఉట్ల పండుగను ఉత్సాహభరితంగా జరుపుకుంటూ వున్నారు. బాగా ఎత్తులో ఉట్టిని కట్టి ఆ ఉట్టిని క్రింద నుండి ఎగిరి కొడతారు. అలా కొట్టిన వారు విజేతలుగా నిలుస్తారు. అయితే ఆ ఉట్టి వారికి అందకుండా కిందనుండి తాడుతో పైకీ కిందికీ లాగుతూ వుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో యాదవులు పాలిచ్చే గేదెలనూ ఆవులనూ ఇంటింటికీ తీసుకువస్తారు. వైష్ణవ ఆలయాల్లో సందడి నెలకొంటుంది. భజనలూ,కీర్తనలూ, సంగీత కచేరీలూ, నాటక ప్రదర్శనతోబాటు అనేక కార్యక్రమాలతో కృష్ణతత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శిస్తారు. శ్రీకృష్ణపరమాత్మ తన తల్లి యశోదమ్మ ప్రేమను యుగయుగాలుగా మరిచిపోకుండా, ఈ కలియుగంలోనూ తల్లిని వకుళామాతగా సేవించుకుంటున్నాడు. ఆమె చేతుల మీదుగానే శ్రీశ్రీనివాసుడిగా తన వివాహం జరిపించుకున్నాడు. అంతటి మహోన్నతమైన ప్రేమనురాగాలు ఆ తల్లీ కొడుకులవి. ఈ కృష్ణాష్టమి రోజున ఆ చిన్ని కృష్ణునికి వెన్న, పాలూ, పెరుగూ పుష్కలంగా పెడితే, సంతృప్తిపరిస్తే ఆ ఇంట ప్రేమానురాగాలు వర్ధిల్లుతాయి. కృష్ణ భక్తులైనవారు తమ పిల్లలకు బాలకృష్ణుని వేషం వేసి, రాధాకృష్ణలుగానూ, యశోదా కృష్ణులుగానూ వేషధారణ గావించి మురిపిస్తారు. పిల్లన గ్రోవీ నెమలిపించమూ, నామాలూ, మువ్వగజ్జెలూ, మెడలో రంగు రంగుల పూదండలతో చిన్నారులు ముచ్చట గొల్పుతూ పెద్దల ఆనందానికి హద్దులేకుండా చేస్తారు.ఇక హరే రామ హరే కృష్ణ. బృందాల వారి భజన కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే శ్రీకృష్ణాష్టమి రోజున మన మందరం మన హృదయాలను ప్రేమమయం గావించుకుందాము. ‘కృష్ణం వందే జగద్గురుమ్’‌ అం‌టూ జగద్గురువుకు, ప్రేమ మూర్తికి హృదయ పూర్వక నమస్సులర్పిద్దాము.

– డా।। పులివర్తి కృష్ణమూర్తి.

Leave a Reply