Take a fresh look at your lifestyle.

తప్పుతున్న వాతావరణ అంచనాలు

దేశంలో ఇంకా విస్తరించని నైరుతి
వేసిన విత్తనాలు మొలకెత్తని వైనం..
వేయనివారు వర్షం కోసం ఎదురుచూపు

దేశ కాలమాన పరిస్థితుల వలెనే వర్షాలు కూడా దోబూచులాడుతున్నాయి. దేశంలో సకాలంలోనే రుతుపవనాలు వొచ్చినా ఇప్పటికీ గట్టి వర్షాలు పడడం లేదు. కృష్ణ, గోదావరి బేసిన్‌లో జలకళ సంతరించుకోకపోవడంతో నదుల్లోకి నీరు వొచ్చి చేరడం లేదు. అసలైతే ఈ పాటికే నదుల వద్ద నీటి  ఉధృతి కొనసాగాల్సి ఉన్నా అలాంటటిదేవి• కానరావడం లేదు. వాతావరణ అంచనాలు కూడా తప్పుతున్నాయి. దీంతో వ్యవసాయంపై ఆధారపడ్డ అన్నదాతలు విత్తనాలు వేసి నష్టపోతున్నారు. విత్తనాలు వేయని వారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా జూన్‌, ‌జూలై మాసాల్లో వర్షాలు పడి సమృద్ధిగా నీరు రావాల్సి ఉన్నా అల జరగడం లేదు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఎండవేడి తగ్గడం లేదు. భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనాల ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. రైతులు కూడా ఆ విభాగం సమాచారంపైనే ఆధారపడతారు. అయితే ఈ సారి ఐఎండీ అంచనాలు తప్పుతున్నాయి.

రుతుపవనాల రాక నుంచి విస్తరణ వరకూ అంతా అయోమయంగానే ఉంది. ముందు ఒక సూచన చేసి..ఆ తర్వాత ఇంకో సవరణ ఇస్తున్నది వాతావరణ శాఖ. అయితే ఈసారి లెక్క తప్పడానికి తూర్పు, పశ్చిమ గాలుల మధ్య పరస్పర చర్యల ఫలితాలను విశ్లేషించడంలో ఐఎండీ విఫలమవ్వడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. జూన్‌లోనే నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికింకా దిల్లీ సహా ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి జాడే లేదు. జూన్‌ 15 ‌కల్లా దిల్లీకి నైరుతి రానుందని ఆ నెల 13న తెలిపింది. ఆ తర్వాత రోజే అందుకు పరిస్థితులు సానుకూలంగా లేవంటూ తన అంచనాలను తానే సవరించుకుంది. మళ్లీ ఏడో తేదీకల్లా దేశరాజధానికి నైరుతి రావడం ఖాయమని జులై 1న పేర్కొంది. జులై 5న మళ్లీ ఇంకో ప్రకటన చేస్తూ.. పదో తేదీకల్లా విస్తరిస్తాయని తెలిపింది. పదో తేదీ గడిచిపోయింది. ఇంకా ఆ ప్రాంత వాసులు నైరుతి కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.

రుతుపవనాలు విస్తరణకు సంబంధించే కాదు.. పవనాల రాకను కూడా ఈసారి ఐఎండీ సరిగా అంచనా వేయలేకపోయింది. మే 31న కేరళ తీరాన్ని నైరుతి తాకనుందని ఆ నెల 30 వరకూ చెబుతూ వొచ్చింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం మళ్లీ తన అంచనాలను సవరించుకొని జూన్‌ 3 అం‌టూ కొత్త తేదీని ప్రకటించింది. ముందుగా మేమిచ్చిన ప్రారంభ సూచనలు తప్పాయి. మొత్తంగా అంచనాల లోపమా లేక వాతావరణంలోనే మార్పులు కలవర పెడుతున్నాయా అన్నది తెలియడం లేదు.

Leave a Reply