- డాక్టర్ మరణంపై తొలగని అనుమానాలు
- బయటకు చెప్పలేకపోతున్న అధికారులు
- కరోనా మరణం అని తెలిసి జనం బెంబేలు
కర్నూలు జిల్లాలో ఇంటినుంచి బయటకు వచ్చేవారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్ వీరపాండియాన్ ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించారు. అలాగే ఒక టర్ భౌతిక, సామాజిక దూరం పాటించాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల కోసం కుటుంబం నుండి ఒక్కరికి ఉదయం 6 నుండి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలులో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కరోనా మరణాలు కర్నూలు జిల్లాలో కలవరం పుట్టిస్తున్నాయి. పాణ్యం కేసు తర్వాత మరో పాజిటివ్ మరణం ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కలవర పెడుతోంది. మృతి చెందిన వ్యక్తి ఓ అల్లోపతి వైద్యుడు కావడమే ఇందుకు కారణం. ఈ నెల 14న కోవిడ్-19 వైరస్ సోకి అల్లోపతి వైద్యుడు మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్దారించింది. ఆయన మృతదేహాన్ని మంగళవారం రాత్రి రహస్యంగా ఖననం చేశారన్న వార్తలు సోషల్ డియాలో వైరల్ అయ్యాయి. ఖననం చేసేందుకు మృతదేహాన్ని తీసుకువెళుతున్న ఫొటోలు, వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఆ వైద్యుడు కరోనాతోనే మృతిచెందినట్లు కలెక్టర్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, కాంటాక్ట్ అయిన కొందరు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఆయన అనారోగ్యం బారిన పడక మునుపు వందలాది మందికి వైద్య సేవలు అందించారు.
పలువురు సిబ్బందితో కలిసి పని చేశారు. ఆయనతో కాంటాక్ట్ అయిన వారి జాబితా కోసం ప్రయత్నించిన అధికారుల చేతికి ఇప్పటికే 1,150 మంది పేర్లు వచ్చాయని తెలిసింది. థర్డ్ కాంటాక్ట్ లిస్ట్ కింద వేలాది మంది ఉన్నారన్న వార్త అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది.ఇప్పటికే 115 పాజిటివ్ కేసులతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. రెండో పాజిటివ్ మరణం వివరాలను జిల్లా అధికారులు బహిర్గతం చేయడం లేదు.మృతి చెందిన ఆ వైద్యుడితో పరిచయమున్న, అతని సేవలు పొందిన వారిలో కలవరం మొదలైంది. జిల్లా అధికారులు బయటకు చెప్పకపోయినా,అది కరోనా పాజిటివ్ మరణమే’అని జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీంతో కాంటాక్ట్ అయినవారు కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఆ వ్యక్తి వద్ద పనిచేసిన వర్కర్లను బుధవార పేట నుంచి పరీక్షల నిమిత్తం అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. వర్కర్లు, పరిచయస్తుల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తే కేసులు వేలల్లో ఉంటాయన్న భయం వెంటాడుతోంది. ఈ వ్యవహారం జిల్లా అధికార యంత్రాంగానికి నిద్రలేకుండా చేస్తోంది. పరిస్థితి చేయి దాటక ముందే అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్లను ఐసొలేషన్‌కు తరలించాలని, కాంటాక్ట్ అయినవారి వివరాలను సేకరించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. చనిపోయిన వైద్యుడికి కరోనా పాజిటివ్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించడంతో జిల్లా అధికారుల దోబూచులాట మరోమారు విమర్శలకు తావిచ్చింది. మృతుడి అల్లుడు ఓ జిల్లాకు ఉన్నతాధికారిగా ఉన్నారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న ఆయన.. అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ తరపున పాజిటివ్ మరణం వివరాలను బహిర్గతం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.