Take a fresh look at your lifestyle.

సంపద పరుగులు ఒకవైపు.. ఆకలి కేకలు వేరొక వైపు…..

కొన్ని నెలల క్రితం ఆక్స్ ‌ఫామ్‌ ‌సంస్ధ ఇన్‌ ఈక్వాలిటీ కిల్స్ ‌పేరిట విడుదల చేసిన నివేదికలో దేశంలోని 84 శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గడం, జీవనోపాధి పడిపోవడం, ద్వారా పేదరికం విజృంభించడమే కాకుండా అనేక ఆకలి మరణాలు కూడా సంభవించాయని స్పష్టం చేసింది. గత ఏడాదిలో 46 మిలియన్ల పేద ప్రజలు కడు పేదరికంలోకి నెట్టబడ్డారని, ధనికులు అత్యంత ధనికులుగా మారారని స్పష్టం చేసింది.

(‌హురున్‌ ‌గ్లోబల్‌ ‌రిచ్‌ ‌లిస్ట్ ‌తాజా నివేదిక)

కొరోనా మహమ్మారి వలన గత రెండు సంవత్సరాలు నుండి పేద మధ్యతరగతి వర్గాల వారు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఆ మహమ్మారి ప్రభావం నుండి ఇప్పు డిప్పుడే ప్రజానీకం కోలుకుంటున్న తరుణంలో మరొక పక్క తాజాగా రష్యా – ఉక్రెయిన్‌ ‌యుద్ధం ఆరంభం అయ్యింది.ఇంకొక పక్క కోవిడ్‌ ‌నాలుగవ తరంగం రానుందని హెచ్చరికలు ఆరంభం అయ్యాయి.దేశీయంగా అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఎన్నో వెంటాడుతూ ఉన్నప్పటికీ ధనవంతుల సంపదపై మాత్రం ఆ జాడే లేకుండా పోయింది.పైగా సౌభాగ్య దశలో కన్నా వాళ్ళ సంపదలో వృద్ధి మరింత మెరుగయ్యింది. అయితే ఈ ప్రతికూల ప్రభావాలు మాత్రం పేదవారిని పీల్చి పిప్పి చేస్తున్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీని ప్రభావం వలన మధ్యతరగతి వాళ్ళు పేద వాళ్లుగా మారారు పేదవాళ్ళు మరింత కటిక దారిద్య్రాన్ని అనుభవించే స్దితికి చేరుకుంటున్నారు. ఇటువంటి పరిస్ధితులలో ధనవంతుల సంపద మాత్రం అప్రతిహతంగా పెరిగిపోతు ధనవంతులు కుబేరులు అవుతున్నారు. మిలియనీర్లు బిలియనీర్లు గా అవతరిస్తున్నారు. ఈ తరహా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ భారత్‌ ‌లో మాత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ధోరణలు పరిశీలించిన హురున్‌ ‌గ్లోబల్‌ ‌రిచ్‌ ‌లిస్ట్ ‌తన 11వ ఎడిషన్‌ ‌ను తాజాగా ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.ఈ నివేదికలో ఆశ్చర్య పోయే అంశాలు బయట పడ్డాయి.2022 ఈ తాజా పరిశీలనలో ప్రపంచవ్యాప్తంగా 3,381 మంది బిలియనీర్లు ఉన్నట్లు లెక్క తేలారు. వీరంతా 69 దేశాల్లోని 2557 కంపెనీలకు చెందిన వారుగా ఈ పరిశీలనలో తేలింది.గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఈ బిలియనీర్ల జాబితాకు కొత్తగా 153 మంది వచ్చి చేరారు. మొత్తం వీరందరి సంపద లెక్క కడితే 15.2 ట్రిలియన్‌ ‌డాలర్లుగా తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిరుద్యోగం పేదరికం వంటి సమస్యలతో అతలాకుతలం అవుతున్న మన దేశం మాత్రం ప్రపంచంలోనే బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో 215 మంది బిలియనీర్లతో మూడవ స్ధానాన్ని దక్కించుకుంది. మనకన్నా ముందు స్ధానాల్లో 1133 మందితో చైనా ప్రధమ స్ధానం దక్కించుకోగా..716 మందితో అమెరికా ద్వితీయ స్ధానాలను దక్కించుకున్నాయి.

215 మంది బిలియనీర్లు, 58 మంది కొత్త పారిశ్రామికవేత్తలతో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బిలియనీర్‌ ‌మేకర్‌గా అవతరించింది.అంతే కాదు ఈ 215 మందికి విదేశాలలో స్ధిరపడిన భారతీయులను కలిపితే మొత్తం భారతీయ బిలియనీర్ల సంఖ్య 249 ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.బిలియనీర్ల తయారీలో ప్రపంచ ఖ్యాతి ఆర్జించడానికి భారత్‌ ‌నిత్యం కృషి సల్పుతూనే ఉంది.ఎందుకంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి బిలియనీర్ల సంఖ్య మన దేశంలో రెట్టింపు అవుతూ ఉంది.గడచిన పదేండ్లలో భారతీయ బిలియనీర్ల సంపద దాదాపు 700 బిలియన్‌ ‌డాలర్ల వరకూ వృద్ధి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ 700 బిలియన్‌ ‌డాలర్ల భారత బిలియనీర్ల ఉమ్మడి సంపద మొత్తం స్విట్జర్లాండ్‌ ‌జీడీపీకి సమానం కాగా, యూఏఈ జీడీపీకి రెండింతలుగా ఉంది.ఈ నివేదికలో మరొక గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 18 శాతం కాగా ప్రపంచ బిలియనీర్లలో 8 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని తెలిసింది. అదే అయిదేళ్ల కిందట చూస్తే అంతర్జాతీయ కుబేరుల్లో మన దేశం వాటా కేవలం 4.9 శాతమే.దీనిని బట్టి మన దేశంలో బిలియనీర్ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కారణంగానే ఆదాయ సంపదల అసమానతలు తీవ్రతరమైపో తున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ బిలియనీర్లు కూడా మన దేశంలో ప్రత్యేకించి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం అనేది గమనించదగ్గ విషయం. ఈ బిలియనీర్లలో ముంబై కేంద్రంగా 72 మందితో ప్రధమ స్ధానంలో ఉంటే, దిల్లీలో 51 మంది, బెంగళూరులో 28 మంది తో ద్వితీయ తృతీయ స్ధానాలు కలిగి ఉన్నారు.ఇక పోతే వ్యాపారాలు నిర్వహణ ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ ప్రభుత్వ సంస్ధలను గంప గుత్తగా ప్రైవేటు సంస్ధలకు అప్పగిస్తున్న నేటి సమయంలో పోర్టుల నుంచి ఎనర్జీ వరకు ప్రభుత్వం అధిక సంస్ధలను వివిధ వ్యాపారాలును కట్టబెడుతున్న అపర కుబేరుడు ఆదానీ సంపద మాత్రం అనూహ్యంగా అత్యంత వేగంగా పెరిగి పోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.ఎందుకంటే గౌతమ్‌ అదానీ సంపద ఏకంగా 153 శాతం వృద్ధి చెంది 81 బిలియన్‌ ‌డాలర్లు గా ఉందని తాజాగా విడుదలైన 2022 ఎం3ఎం హురున్‌ ‌గ్లోబల్‌ ‌రిచ్‌ ‌లిస్ట్ ‌పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం ఆదానీ సగటున ఒక రోజు ఆదాయం రూ.1,000 కోట్ల రూపాయిలుగా ఉంది. అంతర్జాతీయ కుబేరుల జాబితాలో పరిశీలిస్తే అదానీ 12వ స్థానంలో ఉండటమే కాకుండా ప్రపంచంలో టాప్‌-3 ‌గ్లోబల్‌ ‌బిలియనీర్లుగా చెప్పబడే వ్యాపార దిగ్గజాలైన ఎలన్‌ ‌మస్క్, ‌జెఫ్‌ ‌బెజోస్‌, ‌బెర్నార్డ్ ఆర్నాల్ట్ ‌కంటే ఆదానీ సంపదలో వచ్చిన వృద్ధి అనేది అధికం అనేది ఈ నివేదిక స్పష్టమయ్యింది.ముఖ్యంగా మన దేశంలో గౌతమ్‌ అదానీ సంపద విలువ అయితే రాకెట్‌ ‌వేగంతో దూసుకుపోతున్నది.

(మిగతా రేపటి సంచికలో ..)

రుద్రరాజు శ్రీనివాసరాజు లెక్చరర్‌, ఐ.‌పోలవరం, 9441239578.
రుద్రరాజు శ్రీనివాసరాజు
లెక్చరర్‌, ఐ.‌పోలవరం, 9441239578.

Leave a Reply