అయినా రోడ్డున పడేశారు
బండి సంజయ్‌కు గాంధీ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొర
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం చేయాలని కోరుతూ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కొరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారని పేర్కొంటూ గాంధీ హాస్పిటల్ 4వ తరగతి ఔట్ సోర్సింగ్ సిబ్బంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వొచ్చిన పలువురు సిబ్బంది ఈ మేరకు బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో ఏ ఒక్కరూ గాంధీ హాస్పిటల్‌లో సేవలందించేందుకు సిద్ధంగా లేని సమయంలో తాము ముందుకు వొచ్చి ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరి సేవలందించామని పేర్కొన్నారు. అయినప్పటికీ తమ సేవలు అవసరం లేదని చెబుతూ గత నెలాఖరు నుండి తమను ఉద్యోగాల నుండి తొలగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 244 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు.