Take a fresh look at your lifestyle.

ఐదు గ్రామాల ప్రజలను అన్ని విధాల అదుకుంటాం

  • గ్రామస్తుల్లో ధైర్యం నింపేందుకు
  • ఇక్కడే రాత్రి బస చేశాం
  • ధైర్యం చెబుతూ పర్యటించిన
  • మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం,మే 12 : పద్మనాభపురంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌మంగళవారం పర్యటించారు. రాత్రి బస చేసిన ఆయన ఉదయం గ్రామంలో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను మంత్రికి తెలియజేశారు. బాధితులను, ఎల్జీ పాలిమర్స్ ‌కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలను అన్ని విధాల అదుకుంటామని మంత్రి చెప్పారు. అవంతి వెంట ఎమ్మెల్యే అదిప్‌ ‌రాజు, కార్యకర్తలు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో పరిస్థితి బాగుందన్నారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ప్రజల్లో కొంత భయం ఉంటుందని, గ్రామస్తుల్లో ధైర్యం నింపేందుకు నలుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రాత్రి గ్రామాల్లోనే బస చేశామన్నారు. నీళ్లు కూడా బాగున్నాయన్నారు. రాత్రి గ్రామస్తులకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రజలు పూర్తి స్థాయిలో కోలుకునేవరకు ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అవంతి శ్రీనివాస్‌ ‌స్పష్టం చేశారు. ఇదిలావుంటే బాధిత గ్రామాల్లో ప్రజలు ఇళ్లను కడుక్కుంటూ..ఉన్న సామాన్లను చెత్తలో పోస్తూ నానా యాతన పడుతున్నారు. కూలి పనులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ, పిల్లల్ని చదివించుకుంటున్న వీరు…నాలుగు నెలల కిందట వరకూ ఇసుక కొరత కారణంగా పనుల్లేకపోవడంతో ఇంటి పట్టునే ఉండిపోయారు. రోజువారీ ఫైనాన్స్ ‌ద్వారా అప్పు తీసుకుని జీవనం నెట్టుకొచ్చారు. ఆ అప్పులు తీర్చడంతోపాటు రోజువారీ జీవనానికి కూలిపనులే ఆధారం.

గత 45 రోజులుగా పనుల్లేకపోవడంతో అప్పులు కట్టలేక…ఆహారం కోసం ఖర్చులు పెట్టుకోని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇంటి అద్దెల కోసం మళ్లీ అప్పులు చేసుకుంటున్నారు. కరోనా దెబ్బకు భవన నిర్మాణ రంగం కూలీలు ఉపాధి కోల్పోయారు. కొంతకాలం కిందటి వరకూ ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోవడంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు కరోనా రూపంలో మళ్లీ సమస్య వచ్చిపడింది.వేగంగా విస్తరిస్తున్న విశాఖ నగరంలో భవన నిర్మాణ రంగం ప్రధానమైనది. ఉపాధి కోసం ఎంతోమంది నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.నిర్మాణ కూలీలు, మేస్త్రీలు, రాడ్‌ ‌బెండర్లు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించడంతో భవన నిర్మాణాలను కూడా అర్దాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో కూలీలు రోడ్డున పడాల్సి వచ్చింది. నెలల తరబడి లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుందని తెలియక కొంతమంది, దశాబ్దాల క్రితం ఇక్కడకు వచ్చి స్థిరపడిపోయినందున స్వస్థలాలకు వెళ్లినా వుండేందుకు ఇల్లు లేదనే భావనతో మరికొందరు నగరంలోనే ఉండిపోయారు. ఈ దశలో ఎల్జీ పాలిమార్స్ ‌గ్యాస్‌ ‌లీక్‌ ‌వీరిని మృత్యు ముఖంలోకి తీసుకుని వెళ్లింది. దీంతో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని వార్తలు రావడంతో పలువురు మంత్రి అవంతి ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!