Take a fresh look at your lifestyle.

రైతులకు అన్యాయం జరగకుండా చూస్తాం

జాతీయ బీసీ కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌లోకేష్‌ ‌కుమార్‌
‌తాడిపర్తిలో ఫార్మాసిటీ ప్రజాభిప్రాయ సేకరణ
హాజరైన  ‌సభ్యులు ఆచారి, కౌశిలేంద్రపటేల్‌

ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని జాతీయ బీసీ కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌లోకేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో ఫార్మాసిటీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రైతులతో సమావేశమై వారితో ఫార్మాసిటీపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌లోకేష్‌కుమార్‌ ‌ప్రభుత్వం, అధికారులు రైతులను ఫార్మాసిటీ పేరుతో తప్పుదోవ పట్టించారని అన్నారు. రైతుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికి ఫార్మాసిటీ ఏర్పాటు సరైంది కాదని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రజలు, రైతులకు సరైన సమాచారం ఇవ్వనందున తప్పు వారి పక్షాన ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేస్తూ ఎప్పటికప్పుడు తప్పుడు సమాచారం, మోసపూరిత మాటలతో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని తెలుస్తోందని అన్నారు. రైతులకు తప్పుడు సమాచారం ఇచ్చి భూములు లాక్కునేందుకు చూసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విధంగా బీసీ కమిషన్‌ ‌పనిచేస్తుందని వివరించారు. భూములు కోల్పోతున్న రైతులు వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారని వారిని ఈ విధంగా మోసం చేయడం సమంజసం కాదని చెప్పారు.

National BC Commission‌ ‌Vice‌ ‌Chairman‌ Lokesh‌ ‌Kumar‌

రైతులకు జీవనోపాధి కల్పించడంపైనా ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవఢం దారుణం అన్నారు. కమిషన్‌కు ఇచ్చిన నాలుగు పత్రాలలో ఇచ్చిన జీవోల ప్రకారం రైతులకు సరైన సమయంలో నోటీసులు, పబ్లికేషన్‌ ఇవ్వకపోవడాన్ని అధికారుల తప్పుగా గుర్తించామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఫార్మాసిటీ భూముల పక్కగా ఉన్న భూముల ధరలు కోటి నుండి కోటిన్నర ఎకరానికి పలుకుతుండగా రైతులకు కేవలం రూ.16, 12 లక్షల చొప్పున ఇవ్వడం సమంజసం కాదని ఇది తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజలు, రైతులకు అన్యాయం చేస్తున్నదన్న ఫిర్యాదులు వచ్చాయని దీనిపై సమగ్రంగా చర్చించి రైతులను ఆదుకునే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.జాతీయ బీసీ కమిషన్‌ ‌సభ్యులు తల్లోజు ఆచారి, కౌశిలేంద్ర పటేల్‌లు మాట్లాడుతూ డిల్లీలో తిరిగి ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న రైతులను పిలిపించి మరోమారు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని తెలిపారు. కొంత మంది ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులను తప్పుదోవ పట్టించి మోసగించి భూములను ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను నమ్మవద్దని సూచించారు. రైతులకు న్యాయం జరిగే విధంగా, భూములకు నష్టపరిహారం పెంపుపై ప్రభుత్వానికి నివేధిక ఇస్తామని, ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వం స్పందించకుంటే ఫార్మాసిటీని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫార్మాసిటీలో భూములు కోల్పోతున్న కందుకూరు, ముచ్చర్ల, యాచారం మండలాల్లోని గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply