
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే నిరుపేదలైన రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం రూ.10 లక్షల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఆప్తమాలజీ ఆపరేషన్ థియేటర్, రూ.10లక్షలతో కంటి పరీక్షలు నిర్వహించే మిషనరీలను, రూ.20లక్షలతో సింగిల్ పర్సన్ ప్లేట్ లెట్ సెంటర్ మిషనరీని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… రూ.10 లక్షలతో ఆప్తలమాలజీ సెంటర్, మరో రూ.10లక్షలతో కంటి పరీక్ష మిషనరీలను ప్రారంభించుకున్నామనీ, గతంలో సిద్ధిపేట జిల్లాలో కంటి ఆపరేషన్ థియేటర్ ఎక్కడ లేకుండా కంటి చూపుతో బాధపడే వారికి సమస్యలు ఎదురయ్యేవన్నారు. ఈ కంటి పరీక్ష మిషనరీని ప్రారంభించుకోవడంతో ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయిందన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో కంటి ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి తెచ్చామనీ, వీటితో కంటి చూపుతో బాధపడే వారు, కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో సమస్యను గుర్తించిన వారిని ఆపరేషన్ చేస్తామనీ, అలాగే, సిద్ధిపేటలో రూ.20 లక్షలతో సింగిల్ పర్సనల్ ప్లేట్లెట్స్ సపరేటర్‌ను ప్రారంభించామన్నారు.
డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్ ఉన్నవారికి ఈ సింగిల్ పర్సనల్ ప్లేట్ లెట్స్ సపరేటర్ ఎంతో మేలు, ఉపయోగకరంగా ఉంటుందనీ, దీనిని కూడా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గతంలో ప్లేట్‌లెట్స్‌తో ఇబ్బంది పడేవారు కరీంనగర్, హైదరాబాద్ వెళ్లేవారు. కానీ, ఇప్పుడా ఆ పరిస్థితి కూడా ఉండదు. సిద్ధిపేట ప్రభుత్వ దవాఖానకు వచ్చి ప్లేట్ లెట్స్ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ మాత్రమే ఉండేదని, ప్రజల అవసరం మేరకు, ప్రజాప్రయోజన దృష్ట్యా మరో 10 పడకల ఆసుపత్రిని విస్తరించామనీ, మరో 40 వరకు డయాలసిస్ పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైద్య సేవలు మెరుగ్గా అందటానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్ధిపేటలో 10 పడకల ఐసీయూ సెంటర్ ఉన్నదని, దానిని 20 పడకల ఐసీయూ సెంటర్‌గా త్వరలోనే అందుబాటులోకి తేనున్నామనీ హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు.