Take a fresh look at your lifestyle.

వైద్య రంగంలో నం.1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

  • త్వరలో జిల్లా కేంద్రంలో 900 పడకల హాస్పిటల్‌కు సిఎంచే శంకుస్థాపన
  • అన్ని హాస్పిటళ్లలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా కొరోనా వార్డులు
  • యుద్ధ ప్రాతిపదికన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు

ప్రజాతంత్ర ప్రతినిధి, మహబూబ్‌నగర్‌, ‌జనవరి 18 : విద్య, వైద్య రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌ ‌జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్‌లో 4 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 40 డయాలసిస్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేశామని, అదే విధంగా తాలూకా స్థాయిలో ఐసియు బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో 3 మెడికల్‌ ‌కళాశాలను మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చేతుల మీదుగా మహబూబ్‌ ‌నగర్‌లో 900 పడకల హాస్పిటల్‌ ‌పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బాలనగర్‌ ‌సామాజిక ఆరోగ్య కేంద్రానికి ట్రామా కేంద్రాన్ని మంజూరు చేస్తామని, నవాబ్‌ ‌పేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయి పెంపుకు కృషి చేస్తామని తెలిపారు. కొరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలని, నూటికి నూరు శాతం టీకా తీసుకోవాలని, 15-17 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వేయించాలని, రెందో డోసు పూర్తి చేసుకున్న వారు బూస్టర్‌ ‌డోసు కూడా వేసుకోవాలని చెప్పారు.

రాష్ట్రంలో రెండు కోట్ల కొరోనా టెస్టింగ్‌ ‌కిట్లు సిద్ధంగా ఉన్నాయని, కోటి ఐసోలేషన్‌ ‌కిట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. 2 లక్షల 50 వేల రేమిడివిసి ఆర్‌ ఇం‌జెక్షన్లు, ఐసియు బెడ్‌లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధులు కూడా తాము జాగ్రత్తలు తీసుకుంటూనే, ప్రజలలో కొరోనా పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. రాబోయే 15 రోజులు కేసులు పెరిగేందుకు అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండి పూర్తి జాగ్రత్తలు పాటించాలని కోరారు. అన్ని హాస్పిటళ్లలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా కొరోనా వార్డులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలోనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు చేపట్టడం జరిగిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. వైద్య రంగంతో పాటు, విద్యారంగంలో కూడా రాష్ట్రాన్ని ముందువరుసలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే అంగన్వాడి స్థాయి నుండి ఇంగ్లీష్‌ ‌మీడియంలో బోధన చేసేందుకు, రాబోయే రోజుల్లో అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ ‌మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించి 7289 కోట్ల రూపాయలతో మన ఊరు-మనబడి కార్యక్రమానికి ఇటీవలే క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు.

పాఠశాలల్లో అన్ని వసతులతో కార్పొరేట్‌ ‌తరహాలో విద్యను అందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో నెంబర్‌ ‌వన్‌ ‌స్థాయిలో ఉందని, అదే విధంగా తలసరి ఆదాయంలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నామని వెల్లడించారు. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి డాక్టర్‌ ‌వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ..గతంలో తండాలు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నాయని, ముఖ్యంగా తాగునీరు, విద్య, వైద్యం కోసం ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ రాష్ట్రం వొచ్చిన తర్వాత ఎంతో ప్రగతిని సాధించాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత విద్యుత్‌ ఇవ్వడం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. రైతులకు రైతు బంధు, రైతు బీమాతో పాటు, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, రైతులతో పాటు, అన్ని వర్గాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్‌ ‌సి. లాక్ష్మారెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు మన్నే శ్రీనివాస్‌ ‌రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి, జిల్లా ఎస్‌పి ఆర్‌.‌వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ‌తేజస్‌ ‌నందలాల్‌ ‌పవర్‌, ‌డిఎంఈ రమేష్‌ ‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సహకార సంస్థ అధ్యక్షుడు సాయిచంద్‌, ‌రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు బాద్మి శివ కుమార్‌ ,‌జిల్లా పరిషత్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌యాదయ్య, డీఎంహెచ్‌ఓ ‌డాక్టర్‌ ‌కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply