మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్
సమాజంలోని నిరుపేదలు, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం చివరి వరకూ పోరాడిన అమర వీరుల ఆశయ సాధనకు కృషి చేస్తామని సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. విప్లవోద్యమంలో ప్రజాస్వామిక తెలంగాణ కోసం శ్రమించి అమరుడైన కా.మ్యాదరి బిక్షపతికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు జగన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం వోడితెల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన బిక్షపతి చిన్నతనం నుంచే యువజన ఉద్యమాల్లో పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని పేర్కొన్నారు.
భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటూ నినదించాడనీ, ప్రత్యేక తెలంగాణతో ప్రజలకు వొరిగిందేమీ లేదనీ, విప్లవంతో మాత్రమే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమని నమ్మి 2018లో మావోయిస్టు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా చేరాడని చెప్పారు. పార్టీ అప్పగించిన పనులు చేస్తూ అందరి అభిమానం చూరగొని 2019లో జెఎండబ్ల్యుపి డివిజన్‌కు బదిలీ అయ్యాడనీ, ఏటూరునాగారం, మాదేపూర్ ఏరియాల్లో పనిచేస్తూ శత్రువుల దాడుల నుంచి తప్పించుకుంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషించాడని చెప్పారు. మావోయిస్టు పార్టీలో చిత్తశుద్ధితో కృషి చేసిన కామ్రెడ్ బిక్షపతి 2021 జనవరి 18న తుదిశ్వాస విడిచాడనీ, ఆయన అమరత్వం మావోయిస్టు పార్టీకి తెలంగాణ ఉద్యమానికి తీరనిలోటని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.