Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తం ఉద్యమం నిర్వహిస్తాం

  • ఆవేదనతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
  • టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌

2014‌లో రాష్ట్రంలో లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం సాధ్యం కాదని చెప్పడం విడ్డూరంగా ఉండని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. విద్య మీద తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం నాంపల్లిలోని టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త పాఠశాలలను నిర్మించకపోగా ఉన్న వాటిని సైతం మూసివేస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్‌ ‌పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ వస్తే వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువకులు, నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి కొట్లాడారనీ, అయితే, పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా వారంతా నిరాశా నిస్ప•హలతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఎన్నో కొత్త పోస్టులు వచ్చాయనీ, అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 35 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసిందని చెప్పారు.

నిరుద్యోగుల సమస్యల మీద టీజేఎస్‌ ‌ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, వారి కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో యువకులు అంధకారంలో ఉన్నారనీ, అశోక్‌నగర్‌లో వేల మంది నిరుద్యోగులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని డిమాండ్‌ ‌చేశారు, ఈసారి బడ్జెట్‌లో భారమంతా ప్రజల మీద మోపారనీ, ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపేణా రూ. 43 వేల కోట్లు వసూలు చేస్తూ కేవలం రూ. 23 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నదని ఆరోపించారు.

Leave a Reply