Take a fresh look at your lifestyle.

ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌
‌మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20: ‌గడిచిన ఏడు సంవత్సరాల నుంచి కొనుగోలు చేసినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ వానాకాలంలో కూడా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌, ‌కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెరిగిందని, గత ఏడాది వానాకాలంలో 51 లక్షల ఎకరాల్లో వరి పంటసాగు అయితే, ఈ సారి 62 లక్షలకు చేరుకుందని అన్నారు. వానాకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌరసరఫరాల సంస్థకు తగిన ఆదేశాలు కూడా జారీ చేశారని, ఇందుకు కావాల్సిన నిధులను కూడా సమకూర్చారని తెలిపారు.

వానాకాలం ధాన్యం కొనుగోలుకు ఎలాంటి సమస్యలు లేవని సమస్యలన్ని రాజకీయపార్టీలే సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 5,100 కొనుగోలు కేంద్రాల ద్వారా 14 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గత ఏడాది వానాకాలంలో ఇదే సమయానికి 12 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పై పీసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పక్రియ సాఫీగా సాగుతుంటే కాంగ్రెస్‌ ‌నాయకులు ముఖ్యంగా రేవంత్‌ ‌రెడ్డి తన ఉనికిని చాటుకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు.

గడిచిన ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతాంగం అభివృద్ధికి ఏ చేశారని అడిగితే చిన్నపిల్లాడు కూడా చెబుతారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, ‌టిడిపి పాలనలో కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది కాదన్నారు. మద్దతు ధర కోసం రైతులు ఆందోళన చేశారు. గన్నీ సంచుల కోసం ధర్నాలు చేశారు. విత్తనాల కోసం లాఠీ దెబ్బలు తిన్నారని, పోలీసు కాల్పుల్లో రైతులు మరణించారని అన్నారు. సాగునీరు, త్రాగునీరు ఇవ్వలేని దుస్థితిలో ఆనాడు ఆ రెండు ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఇప్పడు రాష్ట్రంలో ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? ఎంత ఆర్థిక భారం అయినా కూడా లెక్కచేయకుండా రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చరిత్రను మరిచి రేవంత్‌ ‌మాట్లాడుతున్నారని విమర్శించారు.

Leave a Reply