Take a fresh look at your lifestyle.

మే 8 నాటికి పూర్తి స్థాయిలో కోలుకుంటాం

  • కొత్తగా 6 కేసులు, మొత్తంగా 1009కి చేరిన పాజిటివ్‌
  • ‌పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారనడం అవాస్తవం
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటామనీ, రాష్ట్రంలో మరణాలు లేకుండా కొరోనా అంతమవుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా 6 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయనీ, ఇవన్నీ జీహెచ్‌ఎం‌సి పరిధిలోనివేనని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరిందని వెల్లడించారు. . మంగళవారం కోఠిలోని కంట్రోల్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారనీ, టెస్టులు చేసేందుకు వెనుకాడటం లేదనీ, ఐసీఎంఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఎప్పుడూ తప్పుడు లెక్కలు చెప్పడం లేదనీ, పారదర్శకంగానే వచ్చిన కేసులు చూపెడుతున్నామని పేర్కొన్నారు.

టెస్టుల వివరాలన్నీ డైనమిక్‌గా ఉంటాయని చెప్పారు. పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్‌ ‌చేయాలని కేంద్రం చెబుతోందనీ, కేంద్ర కొత్త నిబంధనల ప్రకారం గాంధీ ఆసుపత్రిలో 10 మంది కంటే ఎక్కువ మంది ఉండరని తెలిపారు. అత్యవసరమైన వారికే చికిత్స అందించాలని ప్రపంచమంతా నిర్ణయించిందనీ, ఇందులో భాగంగానే లక్షణాలను లేని వారిని డిశ్చార్జి చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌గా నిర్ధారణ పొంది వైద్య చికిత్సలతో కోలుకుని 374 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో 50 శాతానికి పైగా జీహెచ్‌ఎం‌సి పరిధిలోనివేనన్నారు. ఈనెల 21 నుంచి రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. కొరోనా మృతుల్లో దాదాపు 12 మంది బీపీ, క్యాన్సర్‌ ‌వంటి ఇతర వ్యాధుల కారణంగానే చనిపోయారని వెల్లడించారు. తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయనీ, రాష్ట్రంలో కొరోనా నియంత్రణకు చేపడుతున్న చర్యల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. మే 7 వరకూ లాక్‌డౌన్‌ ‌తప్పనిసరిగా పాటించాలనీ, రాష్ట్రంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వారు లక్షల్లో ఉంటారనీ, వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే డబ్బులు దండుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy