- వోట్లప్పుడే కాంగ్రెస్, బిజెపి నేతలొస్తారు ఆర్థిక మంత్రి హరీష్ రావు
- టిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బిజెపి నేతలు
తామెప్పుడూ ప్రజల్లోనే ఉంటాం… ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటాం…వారి సమస్యలను పరిష్కరిస్తామనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధిపేటలోని మంత్రి హరీష్రావు నివాసంలో మంత్రి హరీష్రావు సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు. టిఆర్ఎస్లో చేరిన వారందరికీ మంత్రి హరీష్రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ…కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు ప్రజల వద్దకు వోట్ల కోసం వస్తారన్నారు. కాంగ్రెస్ , బిజెపి పార్టీల నేతలన్నీ అబద్దపు మాటలు, అసత్య ప్రచారాలు చేస్తారనీ వాటి మాటలు, ప్రచారాలు నమ్మి ప్రజలెరవూ మోసపోవద్దన్నారు.
60 ఏండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 6ఏళ్లలో చేసిందనీ, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు, మోసపూరిత మాటలు దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అందుకే టిఆర్ఎస్కు అపూర్వ స్పందన ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో తొగుట మండలం మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో ఆ ప్రాంతమంత సస్యశ్యామలం కాబోతోందనీ, ఇది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరుగుతుందన్నారు. ప్రాజెక్టులు కడుతున్నం అంటే అడ్డుకున్న వారు ఇప్పుడు వోట్లు ఆడిగేందుకు వస్తున్నారనీ, వోట్లు అప్పుడే మీ ముందుకు వచ్చేది కాంగ్రెస్, బిజెపి పార్టీలు అన్నారు.