Take a fresh look at your lifestyle.

మా నిధులు మాగ్గావాలె ..!

  • అధికారంలోకొచ్చి ఆరేళ్లు…
  • విభజన హామీల సాధనకు ఇంకెన్నాళ్లు ?
  • కేంద్రంపై పోరాటం నామమాత్రమే
  • ఇంకా ఏర్పాటు కాని కృష్ణా గోదావరి జలాల బోర్డులు
  • కొలిక్కి రాని ఉద్యోగుల పంపిణీ
  • మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న విపక్షాలు, తెలంగాణవాదులు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి ఆరేళ్లు గడుస్తున్నా… విభజన హామీల సాధన మాట ఏమైందని ప్రతిపక్ష పార్టీల నేతలు, మేధావులు ,తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. 2014లో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజి•చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సమయంలో విభజన చట్టాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించింది. ఇందులో మొత్తం పది షెడ్యూళ్లు ఉండగా వాటిలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ, ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల బదలాయింపు, పబ్లిక్‌ ‌రంగ సంస్థల విభజన, కృష్ణా గోదావరి జలాల నీటి పంపిణీకి సంబంధించి వేర్వేరుగా బోర్డుల ఏర్పాటు, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు వంటి ప్రధాన అంశాలున్నాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లవుతున్నప్పటికీ విభజన హామీల అమలును కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టింది. మరోవైపు, రాష్ట్రంలో వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ‌కూడా వాటి సాధనకు కేంద్రంపై ఏమాత్రం వొత్తిడి పెంచడం లేదని విపక్ష పార్టీలు, మేధావులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విభజన హామీల సాధనకు చిత్తశుద్ధితో పోరాటం చేయని కారణంగా ప్రజలే మరో ఉద్యమానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో విభజన చట్టాన్ని రూపొందించినప్పుడు కేంద్రంలో జైపాల్‌రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో విభజన చట్టంలోని హామీల అంశం అటకెక్కింది. ఈ చట్టంలోని ఉద్యోగుల విభజనకు సంబంధించి ఆంధ్రా ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు తెలంగాణకు రావాల్సి ఉండగా, ఉద్యోగుల విభజన నేటికీ కూడా పూర్తికాలేదు. అలాగే, తక్షణమే పబ్లిక్‌ ‌రంగ సంస్థల విభజన జరగాలని విభజన చట్టంలో ఉంది.

అయినప్పటికీ… ఇంకా అనేక కేంద్ర సంస్థలు విభజనకు నోచుకోలేదు. ఇక సాగునీటి విషయానికి వస్తే తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గోదావరి నీళ్లు వాటాలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కృ•ష్ణా జలాల పంపిణీ విషయంలో మాత్రమే మన వాటా కోల్పోయే ప్రమాదం ఉంది•. నీటి వాటా విషయంలో క్రిష్టా బోర్డు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.. ఇక విభజన చట్టంలో పొందుపరచిన మరో ముఖ్యమైన అంశమైన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో స్పష్టంగా చెప్పింది. దీనిపై ఏ ఒక్క టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నిరసన వ్యక్తం చేయలేదు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉండగా తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విభజన చట్టంలోని ఈ హామీ కూడా అటకెక్కినట్లేనని తెలంగాణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విభజన చట్టం ప్రకారం ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఉంది. అలాగే, తెలంగాణలోని బహుళార్థ సాధక ప్రాజెక్టయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి దాని నిర్మాణానికి అయ్యే వ్యయంలో అధికశాతం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రూ.వేల కోట్ల అప్పులు తెచ్చి దాని నిర్మాణ బాధ్యతను భుజానికెత్తుకుంది. అయితే,కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను సమర్పించకపోవడమే కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణమని కేంద్రం ఎన్నోసార్లు ప్రకటించినప్పటికీ సీఎం కేసీఆర్‌ ఈ ‌విషయంపై రాష్ట్ర ప్రజలకు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, తెలంగాణను ముంచి పోలవరం కడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఉమ్మడి ఏపీ విభజన జరిగి ఆరేళ్లు గడచినప్పటికీ ప్రత్యేకంగా కృష్ణా, గోదావరి బోర్డులు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేక పోయిందని…కేంద్రం ద్వారా జరగాల్సిన హామలు ఏవీ అమలుకు నోచుకోలేదని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు నుంచి మొదటి 33 జిల్లాలు ఏర్పాటు అయ్యాయి కానీ జిల్లా కోర్టులు, కన్జూమర్‌ ‌కోర్టులు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయాం..విభజన చట్టంలో పొందుపరచిన హామీ మేరకు తెలంగాణలో జాతీయ స్థాయిలో సూపర్‌ ‌స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రితో పాటు మెడికల్‌ ‌కళాశాల ఏర్పాటు కావాలి. దీనికి సంబంధించి కేంద్రం ప్రస్తుతం బీబీనగర్‌లో ఉన్న నిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్‌గా మార్చనున్నట్లు పలుమార్లు హామీ ఇచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్రం ప్రభుత్వంపై సరైన విధంగా వొత్తిడి తేవడంలో విఫలమైన కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోవడంతో అనేక ప్రాజెక్ట్ ‌లు ఆగిపోయాయనీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ఇప్పటివరకు స్పందించడంలేదనీ, దీంతో విభజన అంశంలోని హామీలకు మోక్షం లభించడం లేదని విపక్ష నేతలు, తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. రెండు రాష్ట్రాలలో ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో సమావేశాలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటం లేదు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అధికారంలోకి వొచ్చి ఆరేళ్లు గడచినప్పటికీ టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ‌పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై సరైన రీతిలో వొత్తిడి తేవడంలో విపలమవుతున్నందున తెలంగాణ సాధన తరహా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణవాదులు యోచిస్తున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రత్యేక కార్యాచరణను రూపొందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో రెండు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీల నేతల, ప్రజాస్వామ్యవాదుల, తెలంగాణ వాదుల అభిప్రాయాలను సేకరించారు. మరో రెండుమార్లు ఈ తరహా సమావేశాలను నిర్వహించి అప్పటి నుంచి కార్యాచరణను ప్రారంభించే యోజనలో వారున్నారు.

Leave a Reply