Take a fresh look at your lifestyle.

అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు కావాలి… ఇదే అందరి నినాదం కావాలి

కడుపు నిండిన తర్వాతనే ఆధిపత్యం కోసం కలహాలు…వ్యక్తులకైనా, దేశాలకైనా ఇది వర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 135 మిలియన్‌ ‌ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొన్నారని ప్రపంచ ఆహార సంస్థ పేర్కొంది. వీరిలో 88 దేశాల్లో వంద మిలియన్‌ ‌జనాభా ఆకలిని ప్రపంచ ఆహార పోగ్రామ్‌ ‌కింద తీర్చింది. ఆకలితో ఉన్న వారు ఎవరైనా మనింటికి వస్తే వారికి కడుపు నింపడం తరతరాలుగా భారతీయ సంప్రదాయం. మనం తింటున్న దానిలో కొంత భాగాన్ని వారికి పెట్టడం ఒక అలవాటు. ఆకలి ఎంత తీవ్రమైనదో కొరోనా వేళ అన్ని దేశాల్లో అందరికీ తెలిసొచ్చింది. ముఖ్యంగా, సంపన్న దేశాల్లో. అగ్రదేశాల్లో ఈ సమస్య తీవ్రతను అంతా గుర్తించారు. అందుకే, ఈ సంస్థ ఆకలి తీర్చే కార్యక్రమానికి చేయూతనిచ్చారు. యుద్ధం, సంక్షోభ పరిస్థితుల కారణంగా ఏ పాపమూ ఎరుగని అమాయక ప్రజలు ఆకలికి గురి అవుతున్నారు. ఈ సంక్షోభాలనూ, యుద్ధాలనూ సృష్టించేవారికి అన్నార్తుల సమస్యల గురించి తెలియవు. ఆధిపత్యం కోసమే యుద్ధాలు, సంక్షోభాలు ఉత్పన్నమవుతున్నాయన్న సంగతి జగద్విదితం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆకలి బాధను తీరుస్తున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి ఈ ఏడాది నోబెల్‌ ‌శాంతి బహుమతిని ప్రకటించడం హర్షదాయకం. ఆకలి బాధను తీర్చడం శాంతి అనే పదానికి సరైన నిర్వచనం. ప్రపంచంలో యుద్దాలు, సంక్షోభాల నివారణ కోసం కృషి చేసే వ్యక్తులకు ఏటా నోబెల్‌ ‌శాంతి బహుమతిని నోబెల్‌ ‌కమిటీ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ బహుమతిని వ్యక్తులకే కాకుండా సంస్థలకు కూడా ప్రకటిస్తూ ఉంటుంది. ఈసారి ఫుడ్‌ ఆర్గనైజేషన్‌ ‌పోగ్రామ్‌కి ఈ అవార్డును ప్రకటించింది. ప్రపంచ శాంతి కోసం మన దేశం అనాదిగా కృషి చేస్తోంది. గౌతమ బుద్దుడు, స్వామి వివేకానంద, జాతిపిత మహాత్మాగాంధీ వంటి ఎంతో మంది మహనీయులు కృషి చేసి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఆర్యోక్తి. అన్నాన్ని పారవేయకూడదనీ, ఆకలిగొన్నవారికి పెట్టాలనేది భారతీయ సంస్కృతిలో భాగమే. మన దేశంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటించేవారెంతో మంది ఉన్నారు. అయితే, విందుల పేరిట సంపన్న వర్గాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆహారాన్ని వృథా చేస్తున్నాయి. ఇలాంటి విందుల్లో వదిలేసిన ఆహారాన్ని సేకరించి ఆకలి గొన్న వారికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన హైదరాబాద్‌ ‌లోనే కొందరు యువకులు కొనసాగిస్తున్నారు. అందరికీ ఆహారం, అందరికీ ఆరోగ్యం పేరిట అందమైన నినాదాలు ఇచ్చే ప్రభుత్వాలు ఆకలి గొన్న వారి కోసం చేస్తున్నది తక్కువే. హైదరాబాద్‌లో అన్నపూర్ణ ఆహార కేంద్రాల ద్వారా కార్పొరేషన్‌ ఐదు రూపాయిలకే భోజనం పేరిట నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల్లో నిరుపేద వర్గాలు ఎంతో మంది ఆకలిదప్పులను తీర్చుకుంటున్నారు. అలాగే, హరేరామ హరేకృష్ణ మిషన్‌ ‌వారు అక్షయ పాత్ర పేరిట ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అన్నానికి ఎంత ప్రాధాన్యం ఉందంటే, అణ్వస్త్రాల నిర్మూలన అంశంపై అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు ఆ సమావేశ ప్రదేశాల వద్ద నిర్వహించే ప్రదర్శనలూ, ర్యాలీల్లో అణ్వస్త్రాలు కాదు, అన్న వస్త్రాలు కావాలంటూ నినాదాలు చేయడం ఇప్పటికీ చూస్తున్నాం. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా సాటి వాణ్ణి తనతో సమానంగా చూడలేకపోవడం ఆధునిక నాగరికత ప్రభావమేమోననిపిస్తోంది. భేషజం, అనవసర హంగామా, గొప్పలకు పోవడం వంటివి తగ్గించుకుంటే సాటివారికి సాయ పడవచ్చు. అయితే, మన నాయకులు సామాజిక సేవాకార్యక్రమాలను కూడా స్వీయ ప్రతిష్ట, పలుకుబడి పెంచుకోవడానికి వినియోగించుకుంటున్నారు. అణు మాత్రం సాయం చేసి కొండంత ప్రచారం జరిపించుకోవడం చూస్తూనే ఉన్నాం. రాజకీయ ప్రయోజనం ముందు సామాజిక ప్రయోజనం మనిషి కంటికి కనిపించడం లేదు. అందుకే, ఎన్ని ఏళ్ళు గడిచినా మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన జీవించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

అభివృద్ధి, సంక్షేమం తమకు రెండు కళ్ళ వంటివని నాయకులు ప్రకటిస్తూ ఉంటారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరిదీ ఇదే కోరస్‌. అయితే, అందరూ నిజంగా చేస్తుంటే దేశంలో పేదరికం నానాటికీ ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్న తలెత్తుతుంది. సేవ చేయడం కూడా హోదాకి చిహ్నంగా, స్థాయికి గుర్తింపుగా పాటించబడుతోంది. ఈ తరహా వ్యక్తులే సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కుహనా సేవా కార్యక్రమాలు ప్రచారం కోసమేనని దశాబ్దాల చరిత్ర రుజువు చేస్తోంది. ఎవరికీ తెలియకుండా అన్నదానాలు చేసేవారు, పిల్లలకు పుస్తకాలు, ఇతర సాధనాలు అందజేసేవారు ఎందరో ఉన్నారు. వారు ఏ విధమైన ప్రతిఫలాన్నీ ఆశించకుండా సైలెంట్‌గా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఆహార కార్యక్రమాన్ని ప్రచారం కోసం కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేందుకు ప్రపంచ ఆహార సంస్థ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి గుర్తింపు లభించడం ముమ్మాటికీ హర్షదాయకం. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు సేవా కార్యక్రమలను ప్రారంభించేందుకూ, ప్రస్తుతం కొనసాగిస్తున్న సంస్థలకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఈ నోబెల్‌ ‌బహుమతి ఎంతో ఉపయోగ పడుతుంది. అన్నదాతా సుఖీభవ.. అనే ఆర్యోక్తి సార్ధకం కావాలంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగాలి.

Leave a Reply