- ప్రధాని మోడీతో చర్చలకు సిద్ధమన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- లాహోర్‌లోనే దావూద్ ఉన్నట్లు ఎన్ఎఎకు సమాచారం
లాహోర్, జనవరి 17 : భారత్‌తో జరిగిన మూడు యుద్ధాల తర్వాత పాక్ గుణపాఠం నేర్చుకుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. స్వాతంత్య్రానంతరం జరిగిన మూడు యుద్దాలతో పేదరికం, నిరుద్యోగం పెరిగిందే తప్ప తమ దేశానికి ఒరిగిందేమి లేదన్నారు. అల్ అరేబియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాము భారత్‌తో శాంతి కోరుకుంటున్నట్లు చెప్పారు. పాక్ శాంతి కోరుకుంటుందని, కశ్మీర్ పరిణామాలను భారత్ నియంత్రించాలని షెహబాజ్ షరీఫ్ ప్రధాని మోడీని కోరారు. నిత్యం రగులుతున్న కశ్మీర్ అంశంపై రెండు దేశాలు కూర్చుని మాట్లాడుకోవాలని అన్నారు. ఈ విషయంలో మోడీతో చర్చలకు సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాలు పురోగమిస్తాయని ఆకాంక్షించారు. బాంబులు, ఆయుధాలు, అణుబాంబులపై నిధుల్ని వృథా చేయాలనుకోవడం లేదని పాక్ ప్రధాని స్పష్టంచేశారు. ఇదిలావుంటే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీ షా పార్కర్.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు వెల్లడించారు. అంతేకాకుండా.. పాకిస్థాన్ పఠాన్ మహిళను దావూద్ రెండో పెళ్లి చేసుకున్నట్లు అలీ షా పార్కర్ పేర్కొన్నాడు. అయితే దావూద్ తన మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వలేదని తెలిపాడు. ఈ మేరకు టెర్రర్ ఫండింగ్ కేసులో విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు అలీ షా పార్కర్‌ను గతంలోనే ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను అధికారులు తాజాగా దాఖలు చేశారు. అందులో అలీషా వెల్లడించిన వివరాలను పొందుపరిచారు. ’దావూద్ ఇబ్రహీం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అతని రెండో భార్య పాకిస్థానీ పఠాన్. నేను 2022 జులైలో దుబాయ్‌లో దావూద్ మొదటి భార్య మైజాబిన్‌ను కలిశా. దావూద్ పాకిస్థాన్‌కు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నట్లు ఆమే నాకు చెప్పింది. ప్రస్తుతం అతను కరాచీలోని డిఫెన్స్ కాలనీలో ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడు’ అని అలీ షా ఎన్ఐఏ అధికారుల విచారణలో వెల్లడించాడు.