Take a fresh look at your lifestyle.

అం‌తరాష్ట్రాల జల వివాదంపై.. విచారించే అధికారం మాకు లేదు: హైకోర్టు

  • కృష్ణా జలాల వివాదంపై తేల్చి చెప్పిన హైకోర్టు
  • 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయండి
  • కృష్ణాబోర్డు యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
  • 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

అం‌తరాష్ట్రాల జల వివాదంపై విచారించే అధికారం సుప్రీమ్‌ ‌కోర్టుకు గానీ, తమ పరిధిలో గానీ లేదని తెలంగాణ హైకోర్టు తెలిపింది. కృష్ణా జలాల వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునల్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్‌ 11 అం‌తరాష్ట్రాల జల వివాదం ప్రకారం.. ఈ పిటిషన్‌ అర్హతపై పిటిషనర్‌లను ప్రశ్నించింది. సుప్రీమ్‌ ‌కోర్టు 2008లో జల వివాదాలపై ఇచ్చిన తీర్పును చదువుకుని మంగళవారం రావాలని వారికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఇదిలావుంటే తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌మరో లేఖ రాశారు.

ఈ నెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలన్న ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రజత్‌ ‌కుమార్‌ ‌తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అజెండాను లేఖలో పొందుపరిచారు. తెలంగాణ అంశాలను 20వ తేదీ తర్వాత జరిగే బోర్డు సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు. ప్రధానంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలపై పునఃసమిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ, ఆర్డీఎస్‌ ‌కుడి కాల్వ పనులు ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా బేసిన్‌ ‌వెలుపలకు ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు లభించడంతో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాలని ప్రతిపాదించారు. తాగునీటి జలాలను 20 శాతంగానే లెక్కించాలని చెప్పారు. తెలంగాణ మిగులు జలాల లెక్కింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలని రజత్‌ ‌కుమార్‌ ‌తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply