Take a fresh look at your lifestyle.

సీఎం ఇప్పటికైనా అహంకారాన్ని వీడాలి

  • అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు తిరగబడతారు
  • పథకం ప్రకారమే జీహెచ్‌ఎం‌సికి ముందస్తు ఎన్నికలు
  • అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తాం
  • హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాలని డిమాండ్‌ ‌చేస్తాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా అహంకారాన్ని వీడి ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేయడం, ఒక వర్గం ప్రజలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలనీ, గడీల నుంచి బయటికి రావాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్‌ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, పార్టీ నేతలు ప్రకాశ్‌ ‌రెడ్డి, ప్రదీప్‌కుమార్‌, ‌ప్రేమేందర్‌రెడ్డితో కలసి •ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు,. గత ఎన్నికలతో పోలిస్టే బీజేపీ వోటింగ్‌ ‌శాతం బాగా పెరిగిందనీ, జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు తమ పార్టీకి మధ్య కేవలం 9 వేల వోట్ల వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం, ఈసీ, డీజీపీ సమావేశమై జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను హడావుడిగా నిర్వహించారనీ, కొంత సమయం ఇచ్చి ఉంటే తమ పార్టీ 100కు పైగా స్థానాలలో విజయం సాధించి ఉండేవారమని చెప్పారు. హైదరాబాద్‌ ‌ప్రజలు వరదలతో నష్టపోయి ఇబ్బంది పడుతుంటే అవేమీ పట్టించుకోకుండీ సీఎం కేసీఆర్‌ ‌రాజకీయ ప్రయోజనం కోసం ముందస్తుగా జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను నిర్వహించారని అందుకే ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

దుబ్బాక ఎన్నికల తరువాత సీఎంకు బీజేపీ భయం పట్టుకుందనీ, ఉద్యమ సమయంలోనూ జిమ్మిక్కులు చేసిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాటినే కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈసీ పూర్తిగా సీఎం చెప్పుచేతల్లో పనిచేసిందనీ, అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ అవినీతి, కుటుంబ, గడీల పాలనను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందని గుర్తించిన ప్రజలు జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో భారీ విజయాన్ని ఇచ్చారని చెప్పారు. ఏ ఎన్నికలైనా బీజేపీకి ఒక్కటేననీ, అవి గల్లీ ఎన్నికలా ? ఢిల్లీ ఎన్నికలా ? అని తమ పార్టీ చూడదని చెప్పారు. జాతీయ నాయకుల ప్రచారం కూడా తమ పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసొచ్చిందని చెప్పారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను ఈవీఎం)తో నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తే కోవిడ్‌ ‌పేరుతో బ్యాలెట్‌ ‌పద్దతిలో నిర్వహించారనీ, చివరికి వోట్ల లెక్కింపులోనూ టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘం, పోలీసుల సాయంతో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చిన పక్షంలో హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చే వారమనీ, ఇప్పటికీ ఇదే డిమాండ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఎదగకుండా అడ్డుకుంటామన్న ఎంఐఎం అధినేత ఒవైసీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ముందుగా ఒవైసీ ఆయన పార్టీని కాపాడుకోవాలనీ హైదరాబాద్‌లో మొత్తం సీట్లకు పోటీ చేసే సత్లాలేని ఎంఐఎం తమను అడ్డుకుంటామని పేర్కొనడం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. మంచి ముహూర్తం చూసుకుని జీహెచ్‌ఎం‌సిలో గెలిచిన కార్పొరేటర్లతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం ఢిల్లీ వెళుతున్నామనీ, పార్టీ జాతీయ అధ్యక్షుని సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి విషయంలో బీజేపీ ప్రభుత్వానికి సహకరిస్తుందనీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తీసుకురావాలో ప్రభుత్వం తమతో చర్చిస్తే ఆ దిశగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply