Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం

  • 27 వేల ఆక్సీజన్‌ ‌బెడ్లు సిద్ధంగా ఉన్నాయి
  • తెలంగాణలో ఒమిక్రాన్‌ ‌కేసులు లేవు
  • ఓల్డ్ ‌బోయిన్‌పల్లిలోని బస్తీ దవాఖానాను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు
  • షేక్‌పేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : కొరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌ ‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్‌ ‌కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని తెలిపారు. శుక్రవారం ఓల్డ్ ‌బోయిన్‌పల్లిలోని శాంతినికేతన్‌ ‌కాలనీలో మంత్రి బస్తీ దవాఖానాను ప్రారంభించి సంచార కోవిడ్‌ ‌టీకా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరోనా కొత్త వేరియంట్‌ ‌నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, కొరోనా ఏ వేరియంట్‌ను ఎదుర్కోవడం అయినా మన చేతిలోనే ఉంటుందనీ, స్వీయ జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని తెలిపారు. కొరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదనీ, ఇప్పటికే 27వేల ఆక్సీజన్‌ ‌బెడ్లను సిద్ధం చేసిందని తెలిపారు.ప్రతీ ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవడంతో పాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్రిటన్‌ ‌నుంచి వచ్చిన ఒక మహిళకు కొరోనా పాజిటివ్‌గా వొస్తే టిమ్స్ ‌హాస్పిటల్‌కు పంపామనీ, జినోమ్‌ ‌సీక్వెన్స్‌కు శాంపిల్స్ ‌పంపిచామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల డోసుల టీకా సిద్ధంగా ఉందనీ ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‌బంగారు తెలంగాణ కల సాకారం అవుతున్నదని చెప్పారు.

కోవిడ్‌ ‌టీకా తీసుకున్నారా ? రోడ్డు పక్కన ప్రజలకు మంత్రి పలకరింపు
బాలానగర్‌ ‌ఫిరోజ్‌గూడ, ఓల్డ్ ‌బోయిన్‌పల్లిలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన అనతరం మంత్రి హరీష్‌ ‌రావు రోడ్డు పక్కన ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఓల్డ్ ‌బోయిన్‌పల్లిలో కారు దిగి గుంపుగా ఉన్న చోట ఆగి ప్రజలను పలకరించి కోవిడ్‌ ‌టీకా పడిందా ? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇంకా టీకా వేసుకోని వారిని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించి కోవిడ్‌ ‌బారిన పడకుండా కాపాడుకోవాలంటే రెండు డోసుల టీకా తీసుకోవడం తప్పనిసరి అనీ, ఏమాత్రం అలసత్వం వహించకుండా మాస్క్ ‌తప్పనిసరిగా ధరించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

షేక్‌పేటలో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
ఇం‌దులో భాగంగా జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గం, షేక్‌పేట్‌లోని రాజీవ్‌ ‌గాంధీ నగర్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్‌ ‌శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ‌సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో ఓపీడీ కన్సల్టేషన్‌, ‌టెలీ కన్సల్టేషన్‌, ‌బేసిక్‌ ‌ల్యాబ్‌ ‌డయాగ్నోసిస్‌, ‌సాధారణ అనారోగ్య చికిత్సలకు వైద్యం అందించనున్నారు. శుక్రవారం నగర వ్యాప్తంగా 32 బస్తీ దవాఖానాలను ప్రారంభించారు.

Leave a Reply