- ఫలవంతమైన చర్చలు కోరుకుంటే వ్యతిరేక ప్రచారం మానుకోండి
- కేంద్రానికి రైతు సంఘాల లేఖ
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగిన రైతన్నలు చర్చలకు సిద్ధమయ్యారు. ఈనెల 29న కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు సింఘి వద్ద గత నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న 40 రైతు సంఘాల నేతలు శనివారం సమావేశమయ్యారు. ఆరో విడత చర్చలకు తేదీ, సమయాన్ని రైతు నేతలే నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై స్పందించారు.
ఈనెల 29న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని లేఖ పంపినట్లు స్వరాజ్ ఇండియా ప్రతినిధి యోగేంద్ర యాదవ్ రైతు సంఘాల సమావేశం అనంతరం తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే పద్దతులు, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీకి సంబంధించిన చట్టాన్ని తీసుకువచ్చే విధానం అనేవి తమ ఎజెండాలోని తొలి రెండు ముఖ్య అంశాలని చెప్పారు. రైతుల చర్చలను మర్యాదపూర్వకంగా వినాలని ప్రభుత్వం తమకు రాసిన లేఖలో పేర్కొన్నదనీ, ప్రభుత్వం నిజంగా ఫలవంతమైన చర్చలను కోరుకుంటే తమ డిమాండ్లను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను మానేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తున్న రైతులపై వ్యతిరేక ప్రచారం కోసం ప్రభుత్వ వ్యవస్థను వినియోగించడం మానుకోవాలనీ, ఇందుకోసం ఈనెల 29 మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరినట్లు యోగేంద్ర యాదవ్ వెల్లడించారు.