Take a fresh look at your lifestyle.

కొరోనా థర్డ్‌వేవ్‌ ‌కోసం భారీగా పడకలు పెంచుతున్నాం

  • వైద్యంపై అధిక వ్యయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
  • వనస్థలిపురంలో 100 పడకల వార్డు, ఆక్సీజన్‌ ‌ప్లాంటు ప్రారంభం
  • వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి :
రాష్ట్రంలో కొరోనా మూడో వేవ్‌ను ఎదుర్కునే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ దవాఖానాలలో భారీగా పడకల సంఖ్యను పెంచుతున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు వెల్లడించారు. ఇందులో భాగంగా 21 లక్షల హోం ఐసోలేషన్‌ ‌కిట్లు, ఆక్సీజన్‌, ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా దవాఖానాలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సీజన్‌ ‌ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌సందర్భంగా నగరంలో అదనపు పడకలు ఏర్పాటు చేయాలనీ సీఎం కేసీఆర్‌ ఆదేశించారనీ, ఇందులో భాగంగా థర్డ్‌వేవ్‌ ‌వచ్చినా తట్టుకునే విధంగా హైదరాబాద్‌ ‌నగరంలో 1600 పడకలు హైదరాబాద్‌ ‌నగరంలో ఏర్పాటు చేయాలన్నారు. నీలోఫర్‌లో 800 పడకలు, మరో 6 దవాఖానాలలో 100  పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వైద్యం మీద అధిక వ్యయం చేస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. పేదలకు కూడా కార్పొరేట్‌ ‌స్థాయి వైద్యం అందాలన్నదే కేసీఆర్‌ ‌లక్ష్యమనీ, త్వరలో ఫ్రూట్‌ ‌మార్కెట్‌ ‌వద్ద 1000 పడకల సూపర్‌ ‌స్పెషాలిటీ దవాఖానా అందుబాటులోకి రానుందన్నారు. ఈ దవాఖానాకు సీఎం కేసీఆర్‌ ‌త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మన బస్తీ దవాఖానాలు దేశానికే ఆదర్శమనీ, నగరంలో ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతాలలో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమనీ, వీటిని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అందరూ కోవిడ్‌ ‌జాగ్రత్తలు పాటించాలనీ, ఒమిక్రాన్‌ ‌తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదని సూచించారు. ప్రతీ ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలనీ, పండుగల వేళ మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply