Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ ‌తొలిదశలో ఉన్నాం

  • భారత్‌, ‌బ్రెజిల్‌లో పెరుగుతున్న కొరోనా కేసులు
  • వారం రోజులుగా అన్ని దేశాల్లోనూ డెల్టా వేరియంట్ల విజృంభణ
  • 111 దేశాల్లో డెల్టా ఉనికి
  • ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యుహెచ్‌ఓ ‌చీఫ్‌ ‌టెడ్రోస్‌ అథనమ్‌
  • అ‌ప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు హెచ్చరిక

ప్రపంచం ప్రస్తుతం కొరోనా మూడో వేవ్‌ ‌తొలి దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ‌టెడ్రోస్‌ అథానమ్‌ ‌గురువారం హెచ్చరించారు. దురదృష్టవశాత్తూ..మనం ప్రస్తుతం కొరోనా మూడో వేవ్‌ ‌తొలి దశలో ఉన్నామని ఆయన కామెంట్‌ ‌చేశారు. అంతకుమునుపు..కొరోనా వ్యాప్తికి సంబంధించి టెడ్రోస్‌ ‌పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో కొరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నదని ఆయన తెలిపారు. కొద్ది కాలం క్రితం టీకాకరణ కారణంగా ఐరోపా అంతటా కేసుల సంఖ్య తగ్గుతూ వొచ్చిందని, ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు వ్యతిరేకదిశలో వెళుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వైరస్‌లో పలు మార్పులు వొస్తుండటంతో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్‌ ‌పేర్కొన్నారు. ఇప్పటికే 111 దేశాల్లో కాలు పెట్టిన డెల్టా వేరియంట్‌ ‌రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తమవుతుందని హెచ్చరించారు.

పలు దేశాల్లో కొరోనా వైరస్‌ ‌మరోమారు విజృంభిస్తుందని, డెల్టా రకంతో ముడిపడి కొవిడ్‌-19 ‌వ్యాప్తి చెందుతున్న కారణంగా కొరోనా కేసులు అన్ని ప్రాంతాల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన రిపోర్టు ప్రకారం గడచిన వారంలో ప్రపంచవ్యాపంగా కొరోనా కేసుల సంఖ్య పెరిగింది. 9 వారాల నుంచి గణనీయంగా కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, గడచిన వారంలో కొరోనా వేగంగా వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా కొరోనా కేసులు ఉన్నాయి. తక్కువ సంఖ్యలో టీకా పూర్తయిన్న కారణంగా ఆరోగ్య వ్యవస్థపై వొత్తిడి పెరుగుతుందని తన నివేదికలో హెచ్చరించింది. ఈ నెల 13 నాటికి కనీసం 111 దేశాల్లో డెల్టా ఉనికి ఉందని, రాబోయే నెలల్లో ఇది మరింతగా విస్తరించనుందని తెలిపింది. ఆల్ఫా రకం 178 దేశాలు/ ప్రాంతాల్లో, బీటా 123 దేశాల్లో, గామా 75 దేశాల్లో కనిపించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు గుర్తించిన ‘ఆందోళనకర రకం’ వైరస్‌లలో డెల్టా వ్యాప్తి వేగం అత్యధికమని తెలిపింది.

కొత్తకొత్త రకాలు పుట్టుకుని వొస్తుండడం, ప్రభుత్వాలు వివిధ ఆంక్షల్ని సడలించడం, ప్రజారోగ్య చర్యల్ని తగిన రీతిలో చేపట్టకపోవడం, సామాజిక కార్యకలాపాలు పెరగడం వంటివి అనేక దేశాల్లో కేసులు, మరణాలను పెంచేస్తున్నాయని వివరించింది. వైరస్‌ ‌వ్యాప్తి తీరుతెన్నులను గమనించే వ్యవస్థే చాలాచోట్ల లేదని తేల్చింది. ‘ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మందికి కనీసం కొరోనా మొదటి డోసు అందింది. ఆ పంపిణీలోనూ తీవ్ర అసమానతలు ఉన్నాయి. సంపన్న దేశాలే ఎక్కువ టీకాలను పొందాయని పేర్కొంది. జూలై 5 నుంచి జూలై 11 మధ్యకాలంలో కొరోనాకు సంబంధించిన అత్యధిక కేసులు బ్రెజిల్‌, ‌భారత్‌లలో నమోదయ్యాయి. ఈ సమయంలో బ్రెజిల్‌లో 3.33 లక్షల కేసులు నమోదు కాగా, భారత్‌లో ఇదే సమయంలో 2.91 లక్షల కేసులు నమోదయ్యాయి.

అయితే బారత్‌ ‌విషయానికొస్తే అంతకుముందు వారం కన్నా గడచిన వారంలో కేసుల సంఖ్యలో 7 శాతం తగ్గుదల కనిపించింది. బ్రెజిల్‌, ‌భారత్‌ల తరువాత కొరోనా కేసుల విషయంలో ఇండోనేషియా ఉంది. ఇక్కడ గడచిన వారంలో 2.43 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు వారం కన్నా 44 శాతం అధికం. కాగా ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్‌ ‌కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొరోనా ఆంక్షలు సడలించిన దేశాలలో కేసులు తిరిగి పెరుగుతున్నాయని, అందుకే ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ క్రమంలో కట్టడి చర్యలు మరింత కఠినంగా ఉండాని పేర్కొంది. అంతేగాకుండా ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలని పేర్కొంది. ఇవి ఆచరించినంత కాలం వేరియంట్లను అడ్డుకోవొచ్చని పేర్కొంది.

Leave a Reply