Take a fresh look at your lifestyle.

సంక్షేమ పథకాలను పరిగెతో పోల్చుతారా..?

పేద ప్రజల కష్టాల్లో అండగా ఉండేందుకే పథకాలు
పేద ప్రజలను, పథకాలను అవహేళన చేయడంపై మంత్రి హరీష్‌రావు మండిపాటు
పేద ప్రజలను చులకన చేసేలా మాట్లాడొద్దనీ ప్రతి పక్షాలకు హితవు
వోట్ల కోసం కాదు…ప్రజల సంక్షేమం కోసమే పని చేశామన్న మంత్రి
రాష్ట్రంలో పేదలకు లిబరల్‌ ‌రేషన్‌ ‌కార్డులు పంపిణీ చేస్తున్నాం : గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు

పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు పరిగెతో పోల్చడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. ఆర్థికంగా భారమైనప్పటికీ పేద ప్రజలకు కష్టాల్లో అండగా ఉండేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. పేద ప్రజలను, పథకాలను పరిగెతో పోల్చుతూ అవహేళన చేయడం సరికాదని అన్నారు. ఇకనైనా పేద ప్రజలను చులకనగా చేసేలా మాట్లాడవద్దని ప్రతి పక్షాలకు మంత్రి హితవు పలికారు. బుధవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌మహతి ఆడిటోరియంలో ఆహార భద్రత కార్డులు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ‌చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై గజ్వేల్‌ ‌నియోజవర్గంలోని గజ్వేల్‌ ‌మునిసిపాలిటీ సహా 6 మండలాలు చెందిన 1543 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు, 452 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ ‌చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు మంజూరు చేశారన్నారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83కుటుంబాలకు రేషన్‌ ‌కార్డులు మంజూరు చేశామన్నారు. తద్వారా 8,65,430 మంది లబ్దిదారులు నూతనంగా ప్రతీ నెలా 6కిలోల బియ్యాన్ని పొందనున్నారని మంత్రి తెలియజేశారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెలా 14 కోట్ల రూపాయల లెక్కన సంవత్సరానికి దాదాపు 168 కోట్ల రూపాయల్ని అదనంగా వెచ్చించనుందన్నారు. తెలంగాణలో పాతవి దాదాపు 87 లక్షల 41 వేల కార్డులకుగానూ 2కోట్ల 79 లక్షల 23 వేల మంది లబ్దిదారులు రేషన్‌ ‌పొందుతున్నారని తెలిపారు. కొత్త కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రకాల కార్డులు దాదాపు 90.50 లక్షలు ఉన్నాయన్నారు. లబ్ద్దిదారులు 2కోట్ల 88లక్షల మంది ఉన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 90.5 శాతం జనాభాకు రేషన్‌ ‌బియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రతినెలా దాదాపు 231 కోట్లతో సంవత్సరానికి 2766 కోట్ల రూపాయల్ని ప్రజాపంపిణీ కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సమైక్య పాలకుల రేషన్‌ ‌కార్డుపై 20 కిలోల బియ్యం సీలింగ్‌ను ఎత్తి వేసామన్నారు. యూనిట్‌కు 4 కేజీల నుంచి 6 కేజీలకు బియ్యంను పెంచామన్నారు.

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నదే సిఎం కేసీఆర్‌ ఉద్దేశ్యమన్నారు. 70 ఎండ్లలలో చేయని అభివృద్ధి పనులను 7 ఎండ్లలో సిఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అలాగే రాజకీయ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల అవహేళన చేసిన ప్రభుత్వాలను చూసామన్నారు. సిఎం కేసీఆర్‌ ‌రైతు బంధుగా మారి రైతన్నలకు వెన్నుదన్నుగా ఉంటున్నాడన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు, బీమా, కల్యాణ లక్ష్మీ, ఆరోగ్య లక్ష్మీ, మిషన్‌ ‌భగీరథ అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ నేనని మంత్రి పేర్కొన్నారు. కొరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజల కష్టాల పరిష్కారమే ఎజెండా పని చేస్తున్నానమని మంత్రి స్పష్టం చేశారు. కొద్ది మంది నాయకులు విమర్శిస్తున్నట్టు వోట్ల కోసమే పని చేయడం లేదని..ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్నామని అన్నారు. అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని పేర్కొన్నారు. కొరోనాతో ఇబ్బందులు పడకుండా ప్రజలందరూ టీకా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ‌పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ పారుఖ్‌ ‌హుస్సేన్‌, ‌రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌పి.వెంకట్రామరెడ్డి, గడా ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీవో విజయేందర్‌ ‌రెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజమౌళి, ఏఎంసి ఛైర్‌పర్సన్‌ ‌మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, ఎం‌పిపిలు, జడ్పిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Leave a Reply