- రైతులు పండించిన ధాన్యంను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే
- మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, జూన్ 1 (ప్రజాతంత్ర బ్యూరో): రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణనేననీ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో 85 శాతంపైగా ధాన్యంను రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. వర్ష కాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిగతా 15 శాతం ధాన్యాన్ని సాధ్యమైనంత తొందరగా కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మంగళవారం సిద్ధిపేట కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ధాన్యం కొనుగోలుపై మంత్రి హరీష్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….జిల్లాలో గన్ని బ్యాగ్‌ల కొరతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మంత్రి తెలిపారు. రేపటిలోగా 7 లక్షల గన్ని బ్యాగ్‌లను జిల్లా కు ఇచ్చేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారనీ తెలిపారు. రేపు గన్ని బ్యాగ్‌లు జిల్లాకు రాగానే జిల్లాలో అవసరం ఉన్న అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల కు తరలించి అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే జిల్లాలో ధాన్యం తరలించేందుకు లారీలు, ఇతర వాహనాల కొరత ఉండగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకుని ధాన్యాన్ని తరలించడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇంకా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం పేరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
ఈ ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేసేందుకు వీలుగా జిల్లా పరిధిలో నుండి వెళ్లే ఇసుక లారీలను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకొని వాటిని ధాన్యం లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించుకోవాలన్నారు. దాంతో పాటు రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, ఏఎంసి ఛైర్మన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులతో మాట్లాడి స్థానికంగా అందుబాటులో ఉన్న ట్రాక్టర్ల ద్వారా రైతులు తూకం వేసిన ధాన్యంను రైస్ మిల్లుల వద్దకు తరలించేందుకు వీలుగా వారిని ప్రోత్సాహించాలన్నారు. హుస్నాబాద్ డివిజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే చాలా వరకు క్లోజ్ చేసినందున అక్కడ ఉన్న హమాలీలను సిద్దిపేట,దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని లోడింగ్, అన్‌లోడ్ చేసేందుకు ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు. వచ్చే మూడు రోజులకు ధాన్యం సేకరణకు అత్యంత కీలక మని క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రైతు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.
సిద్దిపేట జిల్లా ట్యాబ్ ఎంట్రీలో పాటు రైతులకు డబ్బులు చెల్లింపుల్లో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని అదే స్ఫూర్తితో పంట మొత్తం కొనుగోలు చేసేవరకు అధికారులు అంకితభావంతో పని చేసి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డిఆర్వో బి.చెన్నయ్య, ఆర్డీవోలు, డిఆర్‌డివో, క్లస్టర్ ఇంఛార్జీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.