ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల ప్రకటన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టులు స్పందించారు. ముందుగా పోలీసులు తమపై దాడి చేశారనీ, అందుకు ప్రతిగానే తాము ఎదురు దాడికి పాల్పడ్డామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేశారు. 2020 ఆగస్టులో ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో తమపై భారీ దాడులకు పథకం రచించారని పేర్కొన్నారు. ఆ తరువాత రాయ్‌పూర్ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్ అనే పోలీస్ అధికారి అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపురంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తమపై దాడులు జరిపేందుకు ఉద్దేశించిన కార్యాచరణలో ఐదు రాష్ట్రాల పోలీసు అధికారులు పాల్గొనాలని నిర్ణయించారని తెలిపారు.
ఇందులో భాగంగానే ఐదు రాష్ట్రాల పోలీసులు తమపై దాడికి తెగబడ్డారని అందులో పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా తాము చేసిన ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోయారనీ, ఒక పోలీసు అధికారి తమకు బందీగా చిక్కారని పేర్కొన్నారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసు అధికారిని అప్పగిస్తామనీ, పేర్లు ప్రకటించే వరకూ ఆయన తమ వద్ద క్షేమంగా ఉంటారని స్పష్టం చేశారు.
పోలీసుల దాడిలో తమ సభ్యులు నలుగురు మృతి చెందారని పేర్కొంటూ పోలీసులు తమకు శత్రువులు కాదనీ, చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. 2022 ఏడాది చివరికల్లా అయితే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.