Take a fresh look at your lifestyle.

జలం జనాన్ని బతికించే ఇంధనం

పరిమితమైన వనరుల వలన ప్రపంచంలోని పేద దేశాలు భవిష్యత్తులో నీటి సమస్యతో సతమతమయ్యే సూచనలు కానవస్తున్నాయి. భవిష్యత్తులో  నీటి అవసరాలు మరింత పెరగనున్న దృష్ట్యా, నీటి  వనరులను పొదుపుగా వాడుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. 1992వ సంవత్సరంలో ఐరాస బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో నిర్వహించిన ఒక సదస్సులో నీటి ఆవశ్యకత గుర్తించి ఒక తీర్మానం ఆమోదించింది. ప్రజలకు స్వచ్ఛమైన జలాన్ని అందించడం, నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం, వృథాగా కడలిలో కలుస్తున్న నీటిని ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా వినియోగంలోకి తీసుకురావడం మన ముందున్న తక్షణ కర్తవ్యం. వ్యవసాయంలో శాస్త్రీయ దృక్పథం పెంచుకుని, బిందుసేద్యాన్ని  అందుబాటులోకి తీసుకురావాలి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలి. ప్రజలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో ప్రజలంతా సంఘటితమై వ్యవసాయ క్షేత్రాల్లో కుంటలను తవ్వి భూగర్భసంపదను పెంచడం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. కనుమరుగవుతున్న నాగానది  సంరక్షణలో భాగంగా తమిళ ప్రజలు బావులు తవ్వి వర్షపు నీటిని వృథాగా పోకుండా చేసి, భూగర్భ జలాలను పెంచి నాగానదిని పునర్జీవింపచేయడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ రాబోయే తరాలను దృష్టియందుంచుకుని, నీటి ఆవశ్యకత గురించి వివరించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వాటర్‌ ‌హార్వెస్టింగ్‌ ‌వంటి పద్దతులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు నీటి కొరతకు పరిష్కారమార్గాలు చూపాలి.

ప్రపంచదేశాలన్నీ తగు విధి విధానాలతో నీటి కొరతను నిర్మూలించాలి. వివక్షతకు తావులేకుండా అందరికీ సురక్షిత జలం అందించాలి. ఆర్థిక అసమానతలతో పాటు  భవిష్యత్తులో నీటి పంపకాల విషయంలో కూడా అసమానతలు తలెత్తే అవకాశం ఉంది. నీటి వినియోగంతో పాటు పర్యవేక్షణ కూడా అవసరం. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా నీటిని వాడడం వలన నీటి దుబారా పెరిగి, నీటి కొరత ఏర్పడుతున్నది. రాబోయే సంవత్సరాల్లో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. నీటిని పొదుపుగా వినియోగించుకుని, ప్రజలందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలి. రాబోయే త్రాగునీటి కొరతను దృష్టిలో పెట్టుకుని, నీటి పర్యవేక్షణలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే సదుద్దేశ్యంతో అమెరికాకు చెందిన  ‘‘క్లీన్‌ ‌వాటర్‌ ‌మేనేజ్మెంట్‌  ‌ఫౌండేషన్‌’’ ‌ప్రపంచవ్యాప్తంగా అవగాహనా సదస్సులు నిర్వహిస్తూ ప్రతీ ఏటా సెప్టెంబర్‌ 18‌న ‘‘వరల్డ్ ‌వాటర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌డే’’ను జరపడం ఆనవాయితీ.

అన్ని దేశాలలోని ప్రజలు సెప్టెంబర్‌ 18 ‌వ తేదీని ప్రపంచ జల పర్యవేక్షణ దినోత్సవంగా జరుపుకుంటూ, రాబోయే తరానికి నీటి కొరత లేని ప్రపంచాన్ని బహుమానంగా అందించాలని  ప్రయత్నాలు చేయడం శ్లాఘనీయం. ప్రజలంతా ఈ మహత్తర మైన యజ్ఞానికి సహకరించి, నీటి ఎద్దడి లేని ప్రపంచాన్ని సృష్టించాలి.

– సుంకవల్లి సత్తిరాజు.
ఫోన్‌ : 9704903463.

Leave a Reply