తరుగుతున్న భూగర్భ జలాలు:
నానాటికీ తరిగి పోతున్న ఉపరితల జలరాశులను కళ్లారా చూస్తున్న మానవ సమాజం తగు ముందు జాగ్రత్తలను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పారిశుద్ధ్య వ్యవస్థలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణ మార్పులకు భూగర్భ, ఉపరితల జలాలు ఆధారమని తెలుసుకోవాలి. భూగర్భ జలనిధులు తరిగిన కొలది నీటి కొరత, నీటి నాణ్యతకు తూట్లు పడడం జరుగుతున్నది. మే-2022లో నిర్వహించనున్న ‘గ్రౌండ్ వాటర్, కీ టు ది సస్టేనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్’ అనబడే అంతర్జాతీయ సదస్సుతో పాటు 08 డిసెంబర్ 2022న జరిగిన ‘యూయన్ – వాటర్ సమ్మిట్ ఆన్ గ్రౌండ్ వాటర్’తో పాటు మార్చి 23-24లో నిర్వహించిన ‘‘యూయన్ వాటర్ కాన్ఫరెన్స్-2023’’ నేపథ్యంలో భూగర్భ జల అంశానికి మరో సారి ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రపంచ దేశాల్లో భూగర్భ జలాల మీద ఇండియా అత్యధికంగా ఆధారపడి ఉన్నది. 2017లో 248.69 బిలియన్ క్యూబిక్ మీటర్స్ నీరు అందుబాటులో ఉండగా, ఇండియాలో వాడబడే భూగర్భ నీటి నిధుల్లో 89 శాతం వ్యవసాయ రంగానికి, 9 శాతం గృహ అవసరాలకు, 2 శాతం పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నాం.
భూగర్భ జలాలు తరిగితే…!
‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్’ అంచనాల ప్రకారం వార్షికంగా అందుబాటులో ఉండే భూగర్భ జలాల్లో 70 శాతం వరకు మాత్రమే వాడుకోవచ్చని నిర్ణయించారు. భారత దేశం 2004లో 58 శాతం, 2017లో 63 శాతం వరకు భూగర్భ జలాలను వినియోగించడం గమనించారు. దేశంలోని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, చంఢీఘర్, హిమాచల్, తమిళనాడు, పుడుచ్చెరి రాష్ట్రాలు దాదాపు 70 శాతం వరకు వాడడం జరిగింది. భారతంలోని 22 రాష్ట్రాలు/యూటీల్లోని 534 జిల్లాల్లోని 202 జిల్లాలు దాదాపు 71 నుంచి 385 శాతం వరకు వినియోగించుకోవడం మరింత భయానికి కారణమవుతున్నది. 2030 నాటికి దేశంలోని అన్ని జిల్లాలు 70 శాతం వరకు మాత్రమే వాడుకునేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. భూగర్భ జలాలను అధికంగా తోడినపుడు జలంలో ప్రమాదకర ఫ్లోరైడ్, ఐరన్, లవణ ధర్మం, నైట్రేట్స్, ఆర్సెనిక్ పరిమాణాలు పెరిగి ప్రజారోగ్యం సంక్షోభంలో పడవచ్చని హెచ్చరిస్తున్నారు. 2006లోనే 109 జిల్లాలో నైట్రేట్ సమస్యలను ఎదుర్కోగా నేడు 335 జిల్లాల నీటి నాణ్యతలు ప్రమాదపు అంచున నిలబడడం గమనించారు.
భూగర్భ జలాల అభివృద్ధికి చర్యలు:
ప్రస్తుత ‘సెంట్రల్ వాటర్ కమీషన్’తో పాటు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’లను ఏకం చేస్తూ భూగర్భ, ఉపరితల జలాల నియంత్రణకు నడుం బిగించాలని 2016లోనే ‘మిహిర్ షా కమిటీ’ సిఫార్సు చేయడం కూడా గుర్తు చేసుకోవాలి. స్థానిక వనరులను దృష్టిలో ఉంచుకొని వర్ష నీరు, ఉపరితల జలం, నేలలో నీరు (సాయిల్ వాటర్), భూగర్భ జల లభ్యతలను పరిగణనలోకి తీసుకొని అవసర ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. భూగర్భ జలాలతో ఉపరితల జలాలను అనుసంధానం చేయడానికి ప్రాంతాల వారీగా చొరవ తీసుకోవాలి. ఉపరితల,భూగర్భ జలాల లభ్యతల ఆధారంగానే వ్యవసాయ పంటలను, పంటల సాంద్రతలను నిర్ణయించుకోవాలి. నేడు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత కరెంట్ అందుబాటులో ఉంచడంతో రైతులు విచక్షణారహితంగా వేయి మీటర్ల లోతు వరకు బోర్లను వేసి భూగర్భ జలాలను పాతాళంలోంచి పైకి లాగడంతో భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడనున్నాయని గమనించాలి. భూగర్భ జలాలతో నీటి ఎద్దడి, శుష్క భూములు, పాక్షిక శుష్క ప్రాంతాల అవసరాలు తీరడానికి ప్రభుత్వ చట్టాలకు మరింత పదును పెట్టాల్సిన అగత్యం ఏర్పడుతున్నది.
భూగర్భ జలాల లభ్యతతో సామాజిక-పర్యావరణ సవాళ్లు ముడిపడి ఉన్నాయి. ప్రభుత్వాలు సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన, పాలనపరమైన మధ్యవర్తిత్వాలు సకాలంలో జరిగితే రాబోయే తరాలకు నీటి లభ్యత సమస్యలు ఉండవని గమనించాలి. జలంతో జీవనం, జీవనంతోనే ఆరోగ్యం సిద్ధిస్తాయని ఆశిద్దాం. భూగర్భ, ఉపరితల జల వనరులను అమూల్య జాతి సంపదగా గుర్తించి కాపాడుకోవాలి.
కరీంనగర్ – 9949700037